విదేశీ విద్యకు ప్రవేశ మార్గాలు

ప్రతి సంవత్సరం లక్షలమంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కలలు కంటుంటారు. ఇలాంటి లక్ష్యం ఉన్నవారు మొదట దృష్టిపెట్టాల్సింది ప్రీ-రిక్విజిట్‌ టెస్టులపై! విద్యార్థులు చేరే కోర్సును బట్టి విదేశీ విశ్వవిద్యాలయాలు నిర్దిష్ట టెస్ట్‌ స్కోర్లను అడ్మిషన్లకు పరిగణనలోకి తీసుకుంటాయి. అందుకే ఈ టెస్టులకింత ప్రాధాన్యం! వీటిలో ఆంగ్లభాషా సామర్థ్యాన్ని పరీక్షించేవి కొన్నయితే; సైకోమెట్రిక్‌, జనరల్‌ రీజనింగ్‌ టెస్టులు మరికొన్ని. ఏవి ఎందుకో, గరిష్ఠ స్కోర్లు, వీటి సమగ్ర స్వరూపం ఏమిటో చూద్దాం!

ఇతర దేశాల విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలంటే.. కనీసం రెండు పరీక్షలు రాయాల్సివుంటుంది. ఒకటి రీజనింగ్‌ టెస్ట్‌, రెండోది భాషా సామర్థ్య పరీక్ష.
* అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు టోఫెల్‌తో కలిసి శాట్‌ (స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌) రాయాల్సివుంటుంది. శాట్‌ అనేది విదేశీ కళాశాలల్లో ప్రవేశం పొందటానికి సాధారణంగా రాసే అడ్మిషన్‌ టెస్ట్‌.
* మాస్టర్‌ స్థాయి బిజినెస్‌, సైన్స్‌ డిగ్రీలకు గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామ్‌ (జీఆర్‌ఈ) స్కోరు అవసరం. యు.ఎస్‌.లోని చాలా బిజినెస్‌ స్కూళ్ళు ఎంబీఏ ప్రోగ్రాములకు ఇప్పుడు జీమ్యాట్‌ స్కోరును కాకుండా జీఆర్‌ఈ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
* అత్యుత్తమ బిజినెస్‌స్కూళ్ళలో గానీ, విదేశాల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో గానీ ఎంబీఏలో చేరదలిస్తే... జీమ్యాట్‌ (గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) తొలి మెట్టవుతుంది.
ఎలా సిద్ధం కావాలి?
విద్యార్థి తాను అడ్మిషన్‌ తీసుకోబోయే సమయానికి సంవత్సరం ముందుగానే రీజనింగ్‌ టెస్ట్‌ల సన్నద్ధతను ప్రారంభించాలి.
* క్వాంటిటేటివ్‌ విభాగంలోని మేథమెటికల్‌ కాన్సెప్టులు హైస్కూల్‌ స్థాయికి చెందినవే అయినా, వాటికి జవాబులను సాధించడానికి ఉపయోగించే ఆలోచనా విధానం మాత్రం మాస్టర్స్‌ స్థాయిదే అవుతుంది.
* అనలిటికల్‌ రైటింగ్‌ విభాగం విద్యార్థుల భాషా నైపుణ్యాలను పరీక్షించడానికి కాదు. ఒక వాదన చేయడంలో వారి తార్కికశక్తిని పరీక్షిస్తుంది. దాంతోపాటు వారి వాదన తీరును అంచనా వేసి, దాని స్థాయిని మూల్యాంకనం చేస్తుంది. అమెరికన్‌ విశ్వవిద్యాలయాల కరిక్యులమ్‌కు ఈ నైపుణ్యాలు చాలా అవసరం. ఈ టెస్టుల ద్వారా ఈ నైపుణ్యాలను అవి పరీక్షిస్తాయి.
నిపుణుల దగ్గర ఈ సబ్జెక్టులపై శిక్షణ తీసుకోవడం ద్వారా మంచి స్కోరును పొందవచ్చు. అలాగే సన్నద్ధత సమయాన్నీ ఆదా చేసుకోవచ్చు. సన్నద్ధత ప్రణాళికను తప్పకుండా రూపొందించుకోవాలి. సన్నద్ధతలో పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడానికి మాదిరి పరీక్షలను రాస్తుండాలి. సొంత నైపుణ్యాలు, సామర్థ్య స్థాయులను గ్రహించాలి. విద్యార్థులు తాము ఏయే అంశాల్లో బలంగా ఉన్నారో, వేటిని ఇంకా మెరుగుపరచుకోవాలో తెలుసుకోవాలి. వాటికి అనుగుణంగా చదివే తీరును మలచుకుంటే విజయానికి చేరువ అయినట్టే. పరీక్ష స్వరూపం, ఎదుర్కొనబోయే ప్రశ్నల రకాలపై అవగాహన పెంచుకోవాలి. సమాధాన వివరణలతో ప్రశ్నలను సాధన చేయాలి. ఉచిత నమోదు సౌకర్యమున్న టెస్టు వెబ్‌సైట్లలో 2 పూర్తితరహా మాదిరి పరీక్షలను రాయాలి.
చదవాలి, వినాలి
లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ సన్నద్ధత విషయంలో విద్యార్థి విస్తృతంగా చదువుతుండటం ద్వారా తన పఠన నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఇందుకు యూనివర్సిటీ పాఠ్యపుస్తకాలు లేదా వివిధ సబ్జెక్టు అంశాలుండే మెటీరియళ్లు అకడమిక్‌ శైలిలో రాసినవి ఎంచుకోవచ్చు.
టీవీ, ఇంటర్నెట్‌లలో ఇంగ్లిష్‌ ప్రోగ్రామ్‌లను చూడటం, రేడియోలో వినడం వంటివి లిసనింగ్‌ స్కిల్స్‌ను పెంచుకునే చక్కని మార్గాలు. సమరైజింగ్‌, పారాఫ్రేజింగ్‌ ప్యాసేజీలను తప్పకుండా సాధన చేయాలి.
నిమిషంలో సారాంశం
కాంప్రహెన్షన్‌ను మెరుగుపరచుకోవడానికి చదవడం సాధన చేయాలి. స్పీకింగ్‌ స్కిల్స్‌ను అభివృద్ధిపరచుకోవడానికి.. వార్తాపత్రిక/ మ్యాగజీన్‌ నుంచి చిన్నవ్యాసాన్ని ఎంచుకుని బిగ్గరగా చదవడం లాంటివి చేయాలి. ఆ వ్యాసానికి సంబంధించిన సారాంశాన్ని ఒక నిమిషంపాటు చెప్పే ప్రయత్నం చేయాలి. నచ్చిన/ పరిచయమున్న అంశాలను జాబితాగా రాసుకుని, వాటపై మాట్లాడటం సాధన చేయాలి. చదివిన వ్యాసంపై అభిప్రాయం చెప్పగలగాలి. టోఫెల్‌, పీటీఈలకు హాజరయ్యేముందే క్వర్టీ కీప్యాడ్‌పై టైపింగ్‌ సాధన చేయడం మంచిది.
మూడు దశల్లో...
ఈ పరీక్షలకు సన్నద్ధత మూడు దశల్లో సాగించటం మేలు.
1 కాన్సెప్టులను నేర్చుకుని వాటిని ప్రశ్నల్లో ఉపయోగించడం సాధన చేయాలి. మంచి శిక్షకుడి దగ్గర తీసుకునే శిక్షణ ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది. వార్తాపత్రికలు, మ్యాగజీన్లు, పుస్తకాలను క్రమం తప్పకుండా చదవడం ద్వారా రీడింగ్‌, ఒకాబులరీ స్కిల్స్‌ రెండింటినీ మెరుగుపరచుకోవచ్చు. కొన్ని పరీక్షల్లో చదవడం విమర్శనాత్మకంగా చదవడంపై దృష్టిపెట్టేలా ఉంటుంది. చదవడం అంటే కేవలం సమాచారాన్ని అర్థం చేసుకోవడానికే పరిమితం కాకూడదు. సమస్యా పరిష్కారానికి ఆ సమాచారాన్ని విశ్లేషించడం, మూల్యాంకనం చేయడం వంటివి చేయగలగాలి.
2 నిర్ణీత సమయంలో ప్రశ్నలను సాధించడం, సమీక్షించుకోవడం, తప్పులను సవరించుకోవడం, వాటి నుంచి నేర్చుకోవడం సాధన చేయాలి. దృఢ నిశ్చయమున్న విద్యార్థులకే పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. సెంటెన్స్‌ కరెక్షన్‌ (గ్రామర్‌), అనలిటికల్‌ రైటింగ్‌, కఠినమైన మేథ్స్‌ వంటి సవాలనిపించే విభాగాలకు చాలా ఎక్కువ సన్నద్ధత, సాధన అవసరమవుతుంది.
3 సాధ్యమైనన్ని మాదిరి పరీక్షలు- పేపర్‌, కంప్యూటర్‌ రెండు విధానాల్లో రాయడం ద్వారా నిజమైన పరీక్షలో ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు.
కోరుకున్న స్కోరును సాధించేవరకూ ఎవరైనా ఎన్నిసార్లైనా పరీక్షను రాయవచ్చు. పరీక్షను తిరిగి రాయడంలో ఎటువంటి ఆంక్షలూ ఉండవు. కాకపోతే, పరీక్ష రాసిన ప్రతిసారీ పరీక్ష రిజిస్ట్రేషన్‌ ఫీజు మాత్రం కట్టాల్సి ఉంటుంది. స్కోరు విషయంలో ఆశించదగ్గ మార్పును తీసుకురావాలంటే.. కాన్సెప్టులను నేర్చుకోవడానికీ, సాధనకూ తగిన మొత్తంలో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అదనపు కృషి చేయకుండా మరోసారి టెస్ట్‌ రాయటం వల్ల మాత్రం ప్రయోజనమేమీ ఉండదు.
రిఫరెన్స్‌ మెటీరియల్‌
ప్రతి పరీక్షకు చాలా మొత్తంలో మెటీరియల్‌ అందుబాటులో ఉంది. గైడ్లు, వీడియోలు, మాదిరి పరీక్షల రూపంలో అధికారిక మెటీరియల్‌ను టెస్ట్‌ మేకర్స్‌ విడుదల చేస్తారు. వాటికి ప్రాధాన్యం ఇవ్వటం సముచితం. అలాగే ఉచితంగా నమోదు చేసుకుని పూర్తిచేసే మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సులూ చాలానే అందుబాటులో ఉన్నాయి.
* https://www.youtube.com/user/TOEFLtv
* https://pearsonpte.com/preparation/
* https://sat.collegeboard.org/practice/sat-practice-test
* https://www.khanacademy.org/sat
* The Official SAT Study Guide: Second edition
* The Official Guide for GMAT Review, 2018
* The Official Cambridge Guide to IELTS
* The Official Guide to PTE Academic
* ETS-GRE Official Guide- Third edition
* The Official Guide to the TOEFL Test
రీజనింగ్‌ టెస్టులు

ఈ టెస్టుల స్కోరు ఐదేళ్ళ పాటు చెల్లుబాటవుతుంది. స్కోర్ల శ్రేణి, ఆమోదించే దేశాలు, మంచి స్కోరు వివరాలు వరుసగా...
జీఆర్‌ఈ www.ets.org/gre
జనరల్‌ రీజనింగ్‌ స్కోరు 260-340 యూఎస్‌ఏ
వెర్బల్‌, క్వాంట్‌లలో 300+, అనలిటికల్‌ రీడింగ్‌లో 4/6

జీమ్యాట్‌ www.mba.com/gmatprep
200-800 యూఎస్‌ఏ, ఇంకా ప్రసిద్ధ బిజినెస్‌ స్కూళ్ళు రీజనింగ్‌, క్వాంట్‌, వెర్బల్‌లలో 650/800; అనలిటికల్‌ రైటింగ్‌లో 0-6 (హాఫ్‌ పాయింట్‌ ఇంటర్వెల్స్‌)

శాట్‌ www.sat.org/practice
కొత్త స్కేలు 400-1600; ఎస్సేకు 2-8 పాయింట్లు యూఎస్‌ఏ ఎవిడెన్స్‌ బేస్డ్‌ రీడింగ్‌, రైటింగ్‌, మ్యాథ్‌లలో 1330+. ఎస్సే అనేది ఆప్షనల్‌.
లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్టులు
వీటికి రెండు సంవత్సరాల చెల్లుబాటు ఉంటుంది. టెస్ట్‌ తీరు, ఆమోదించే దేశాలు, మంచి స్కోరు వివరాలు వరుసగా...

ఐఈఎల్‌టీఎస్‌: www.ielts.org
పేపర్‌ ఆధారితం యూఎస్‌ఏ, యూకే, కెనడా, న్యూజీలాండ్‌
9.0 బ్యాండ్‌కు మొత్తంగా 6.5 బ్యాండ్‌

పీటీఈ https://pearsonpte.com/countries/pte-in-india/
కంప్యూటర్‌ ఆధారితం ఆస్ట్రేలియా, యూకే, కెనడా, న్యూజీలాండ్‌ 90కి మొత్తంగా 64

టోఫెల్‌ https://www.toeflgoanywhere.org/
కంప్యూటర్‌ ఆధారితం యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా 120కి మొత్తంగా 90
ఏ టెస్టు.. ఎప్పుడు?
టోఫెల్‌ ఏడాది పొడవునా జరుగుతుంది. సాధారణంగా ఈ పరీక్షను వారాంతాల్లో నిర్వహిస్తారు. ఐఈఎల్‌టీఎస్‌ నెలకు నాలుగుసార్లు ఉంటుంది. జీఆర్‌ఈ, జీమ్యాట్‌ల నిర్వహణ సంవత్సరం పొడవునా జరుగుతుంది. ముందస్తుగా స్లాట్‌ను ఖరారు చేసుకోవాలి. ఇక¹ సంవత్సరంలో కొద్దిసార్లు మాత్రమే నిర్వహించే శాట్‌ను సాధారణంగా అక్టోబరు, నవంబరు, డిసెంబరుల్లో రాయాల్సి వుంటుంది!

Posted on 21.12.2017Ask the Expert
Click Here..