యూఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ కోర్సుల్లో ఎన్నో ప్రత్యేకతలు!

ప్రపంచాన్ని సమూలంగా మార్చేస్తున్న ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అద్భుతమైన అభివృద్ధి వల్ల విభిన్న స్పెషలైజేషన్లతో దూసుకుపోతోంది. అభ్యర్థికి అపార అవకాశాలను అందించే ఈ కోర్సులను అమెరికాలోని ఎన్నో ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఆఫర్‌ చేస్తున్నాయి. మన విద్యార్థులు తమ అభిరుచులూ, ప్రావీణ్యాలూ బేరీజు వేసుకుని ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్లతో పీజీ చేస్తే వారికిక ఆకాశమే హద్దు! యూఎస్‌లో అందుబాటులో ఉండే సరికొత్త ఎలక్ట్రానిక్స్‌ కోర్సులూ, వాటి విశేషాలను పరిశీలిద్దాం!

ఎలక్ట్రానిక్స్‌ వినియోగం మన నిత్య జీవితంలో ఒక భాగమై పోయింది. ఇది లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించడమూ కష్టమే. వంట నుంచి సంగీతం వరకూ ఉపయోగించే పరికరాలూ, స్టవ్‌, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌.. ఇలా మనం వాడేవన్నీ ఎలక్ట్రానిక్స్‌వే.
ఆటోమోటివ్‌ ఇంజిన్స్‌ నుంచి ఆటోమేటెడ్‌ ఎక్విప్‌మెంట్‌ వరకూ అన్ని శ్రేణి పరికరాల ప్రొడక్షన్‌ సెట్టింగుల్లో ఎలక్ట్రానిక్‌ సాంకేతికతనే ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఆరోగ్య రంగంలో రోగనిర్ధారణ, చికిత్సకు సంబంధించిన పరిశోధనలు, వ్యాధుల నివారణోపాయాలతోపాటు జన్యుసంబంధమైనవాటికీ ఉపయోగిస్తున్నారు.
మంచి ఉద్యోగావకాశాలు, జీతం, నిరంతర పరిశ్రమ అభివృద్ధి కారణంగా ప్రతి రెండో విద్యార్థీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చదవాలని కోరుకుంటున్నాడని అధ్యయనాలు చెపుతున్నాయి. సొంత ఆలోచనలను అద్భుతమైన సాంకేతికాభివృద్ధిగా మలచడంలో ఈసీఈ ఇంజినీర్లు ముందుంటున్నారు. ఇటువంటి విధులకు లోతైన పరిజ్ఞానం అవసరమవుతుంది. ఈ కారణంగా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో కొన్ని ఉపశాఖలు ఏర్పడ్డాయి. ఈ రంగానికి యూఎస్‌ఏలో ఎంతో విలువ ఏర్పడి విస్తృత అవకాశాలు పెరిగాయి.
అమెరికాలో ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన పీజీ స్పెషలైజేషన్లలో మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఫోటానిక్స్‌, నానో టెక్నాలజీ, బయో మెడికల్‌ ఇమేజింగ్‌, బయో ఇంజినీరింగ్‌ అండ్‌ అకాస్టిక్స్‌ (బీఐబీఏ), పవర్‌ అండ్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, రోబోటిక్స్‌, స్పిన్‌ట్రానిక్స్‌ ఎంతో ప్రాచుర్యం పొందాయి.
మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఫోటానిక్స్‌
కంప్యూటర్లు, పర్సనల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్‌ ఆటోమేటివ్‌ సిస్టమ్స్‌, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, లేజర్లలో గొప్ప అభివృద్ధికి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లోని మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఫోటానిక్స్‌లో వచ్చిన మార్పులే కారణం.
యూఎస్‌ఏలో దీనికి సంబంధించి ఎన్నో విశ్వవిద్యాలయాలు పరిశోధన అవకాశాలతోపాటు ఉద్యోగావకాశాలూ అందిస్తున్నాయి. పరిశోధన జరిగే కొన్ని విశ్వవిద్యాలయాలు.. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాంటా బార్బరా, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయి (అర్బానా షాంపెయిన్‌).
* మరికొన్ని పరిశోధన సంస్థలు
* అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఫోటానిక్స్‌ (ఏఐఎం)
* ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (ఐఈఈ)
* కాలిఫోర్నియా నానోసిస్టమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎన్‌ఎస్‌ఐ)
*నానోటెక్‌: యూసీఎస్‌బీ నానో ఫాబ్రికేషన్‌ ఫెసిలిటీ
కెరియర్‌: స్థానిక సెమీకండక్టర్‌ పరిశ్రమ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఒరిగన్‌, సౌత్‌వెస్ట్‌ వాషింగ్టన్‌ల్లో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి. అపార అవకాశాలున్న సంస్థల్లో ఇంటెల్‌ కార్పొరేషన్‌, సోలార్‌ వరల్డ్‌, ఎఫ్‌ఈఐ, కాస్‌కేడ్‌ మైక్రోటెక్‌, మైక్రోచిప్‌, ఆన్‌ సెమీ, మ్యాక్సిమ్‌, ట్రిక్వింట్‌, సిల్‌ట్రానిక్స్‌, ఇతర సెమీ కండక్టర్‌ సంస్థలున్నాయి.
మైక్రో ఎలక్ట్రానిక్స్‌, ఫోటానిక్స్‌ ఇంజినీర్ల సరాసరి వార్షిక వేతన శ్రేణి రూ.33.73 లక్షల నుంచి రూ.98.14 లక్షల వరకూ ఉంది.
బయోమెడికల్‌ ఇమేజింగ్‌, బయో ఇంజినీరింగ్‌, అకాస్టిక్స్‌ (బీఐబీఏ),
ఎలక్ట్రికల్‌ ఇంజినీర్ల అనలిటికల్‌ టూల్స్‌ ..
వైవిధ్యంగా ఉండే బయో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, అల్ట్రాసోనిక్స్‌, అకాస్టిక్స్‌, ఆడియో ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌, హ్యూమన్‌ కంప్యూటర్‌ ఇంటరాక్షన్‌ అంశాల్లో చక్కని కెరియర్లకు వర్తిస్తాయి. ఉదాహరణకు బయోమెడికల్‌ సిస్టమ్స్‌-వాటి ఎన్విరాన్‌మెంట్స్‌ల మధ్య సంబంధాలను అధ్యయనం చేయటంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌కు ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ కాంప్లెక్స్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్‌లో ఉండే ప్రావీణ్యం ఎంతో పనికొస్తుంది.
పర్దూ యూనివర్సిటీ నార్త్‌వెస్ట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయి (అర్బానా షాంపెయిన్‌), డ్యూక్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా డేవిస్‌లలో బయోమెడికల్‌ ఇమేజింగ్‌, బయో ఇంజినీరింగ్‌లలో పరిశోధనలు జరుగుతున్నాయి. న్యూజనరేషన్‌ స్టెతస్కోపులను అభివ్టృద్ధికి సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, ఫిల్టరింగ్‌ అల్గారిదమ్స్‌లను ఉపయోగిస్తున్నారు.
కెరియర్‌: బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ రంగం వేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జీవనస్థితిగతులు మెరుగుపరిచే మెడికల్‌, ఇంజినీరింగ్‌ ప్రపంచాలకు చెందిన బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విస్తృతమైన ఉపాధి అవకాశాలకు తెరతీస్తోంది.
ఉద్యోగావకాశాలు ఎక్కువగా సెల్యులర్‌, టిష్యూ, జెనెటిక్‌, క్లినికల్‌, రిహాబిలిటేషన్‌ ఇంజినీరింగ్‌లలో ఉంటాయి. అదనంగా బయో ఇన్‌స్ట్రుమెంటేషన్‌, బయోమెటీరియల్స్‌, బయో మెకానిక్స్‌, డ్రగ్‌ డిజైన్‌ అండ్‌ డెలివరీ, మెడికల్‌ ఇమేజింగ్‌, ఆర్థోపెడిక్‌ సర్జరీ, ఫార్మాస్యూటికల్స్‌, సిస్టమ్స్‌ ఫిజియాలజీ రంగాల్లోనూ అవకాశాలుంటాయి.
సంవత్సరానికి వేతనం రూ. 51.98 లక్షలు ఉంటుంది.
పవర్‌ అండ్‌ ఎనర్జీ సిస్టమ్స్‌
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లోని ఈ విభాగం ఎలక్ట్రిక్‌ ఎనర్జీని ప్రాసెస్‌, డెలివర్‌ చేసే డివైసెస్‌, సిస్టమ్స్‌పై దృష్టిపెడుతుంది. ఇందులో భాగమయ్యే స్థూల అంశాలు: ఎలక్ట్రో మెకానిక్స్‌, లార్జ్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ అండ్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ తాలూకు డిజైన్‌, ఆపరేషన్‌; మాగ్నెటిక్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ ఎనర్జీ కన్వర్షన్‌ మెథడ్స్‌, హైపవర్‌ లెవెల్స్‌లో ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌ అప్లికేషన్‌, ఆల్టర్నేటివ్‌ ఎనర్జీ. దీనిలో అందించే కోర్సులు కవర్‌ చేసే కాన్సెప్టులు- రిన్యూవబుల్‌ ఎలక్ట్రిక్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, ఎలక్ట్రిక్‌ మెషిన్స్‌, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌, ఎలక్ట్రానిక్‌ మోటార్‌ కంట్రోలర్స్‌, స్విచింగ్‌ పవర్‌ కన్వర్టర్స్‌. అడ్వాన్స్‌డ్‌ కోర్సులుగా అడిషనల్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ డివైసెస్‌ అండ్‌ ఎలక్ట్రో మాగ్నెటిక్‌ ఫీల్డ్స్‌ ఉంటాయి.
ఈ ఫీల్డుల్లో పరిశోధన యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయి (అర్బానా షాంపెయిన్‌), యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (ఆస్టిన్‌), యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌ల్లో జరుగుతోంది. ఎనర్జీ కన్వర్షన్‌ రిసెర్చి, పవర్‌ మాగ్నెటిక్స్‌, జెనెటిక్‌ ఆప్టిమైజేషన్‌ మొదలైన అత్యున్నత ప్రయోగశాలలు అమెరికాలో ఉన్నాయి.
కెరియర్‌: భవిష్యత్తులో గొప్ప కెరియర్‌ను అందించగలిగేది పవర్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌. ఈ రంగంలో ఉద్యోగాలను అందించేవారిలో- మెటల్స్‌, ఆటోమొబైల్‌, ఆయిల్‌, డేటా పరిశ్రమలున్నాయి. ఇంకా లార్జ్‌ పవర్‌ సిస్టమ్స్‌కు చెందిన ఆపరేటర్లు, బిల్డర్లు; పవర్‌ సెమీ కండక్టర్స్‌, ఇతర పవర్‌ ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్లు, వినియోగదారులు; రోబోటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ కంట్రోల్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్లు, వినియోగదారులు కూడా ఉపాధికి దోహదం చేసేవారే.
సంవత్సరానికి వేతనం రూ. 62.89 లక్షలు ఉంటుంది.
రోబోటిక్స్‌ అండ్‌ అటానమస్‌ సిస్టమ్స్‌
రోబోటిక్‌ అండ్‌ అటానమస్‌ సిస్టమ్స్‌ (ఆర్‌ఏఎస్‌) ఇంటరాక్టివ్‌గా, పరస్పర అనుసంధానంగా ఉండే టూల్స్‌. ఇవి మనం నివసించే ప్రపంచంలో ఎన్నో ఉపయోగకరమైన విధులు నిర్వర్తించటానికి ఉపయోగపడతాయి. నిర్ణయాలు తీసుకునే ఈ సిస్టమ్స్‌ విభిన్న స్థాయి అటానమీలతో సురక్షిత రవాణా, సమర్థ ఆరోగ్య పరిరక్షణ, వృద్ధుల సంక్షేమం లాంటి సవాళ్ళను ఎదుర్కోవటానికి సాయపడ[తాయి. ఇంజినీరింగ్‌ ఎలిమెంట్స్‌ అయిన డిజైన్‌, రోబోటిక్స్‌ టెస్టింగ్‌, ఆటోమేషన్‌, అటానమీలను ఈ రంగం ఉపయోగించుకుంటుంది.
అమెరికాలోని ఎన్నో టాప్‌ ర్యాంకింగ్‌ విశ్వవిద్యాలయాల్లో ఈ రంగంలో పరిశోధనలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌, కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీలు రోబోటిక్స్‌ అండ్‌ ఆటానమస్‌ సిస్టమ్స్‌లో ఎన్నో పరిశోధన ప్రాజెక్టులు కొనసాగిస్తున్నాయి.
కెరియర్‌: అమెరికాలోని ఉత్పత్తి క్షేత్రాల్లో ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ ప్రవేశం కొనసాగుతూనేవుంది. వేగవంతమైన ఉత్పత్తి, మేటి నాణ్యత, వృథాను అరికట్టటం, ప్రమాదకర విధుల నుంచి కార్మికుల బదులు యంత్రాలను వాడటం ద్వారా సంపూర్ణ భద్రత ఇవన్నీ వీటి ప్రయోజనాలే. అటానమస్‌ సిస్టమ్స్‌ ఇంజినీర్‌, రోబోటిక్స్‌ అండ్‌ అటానమస్‌ ఆర్కిటెక్ట్‌, రోబోటిక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజినీర్‌, సిస్టమ్స్‌ ఎనలిస్ట్‌ (రోబోటిక్స్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌) హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
ఈ రంగంలో పనిచేసే ఇంజినీర్ల వార్షిక వేతనం రూ. 49.41- రూ.71.87 లక్షల మధ్య ఉంటుంది.
స్పిన్‌ట్రానిక్స్‌
దీన్ని స్పిన్‌ ఎలక్ట్రానిక్స్‌ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్‌, దానితో అనుబంధంగా ఉండే అయస్కాంత కదలికలను దీనిలో అధ్యయనం చేస్తారు. సాంప్రదాయిక ఎలక్ట్రానిక్స్‌తో పోలిక ఉన్నప్పటికీ ప్రాథమికంగానే రెంటికీ తేడా ఉంది. డైల్యూట్‌ మాగ్నెటిక్‌ సెమీ కండక్టర్స్‌, క్వాంటం కంప్యూటింగ్‌లలో స్పిన్‌ట్రానిక్స్‌ పాత్ర కనిపిస్తుంది.
స్పిన్‌ట్రానిక్స్‌లో పరిశోధనను మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహిస్తోంది.
కెరియర్‌: ఈ రంగంలో నిపుణులను కేవలం ఇంజినీర్లు అనకుండా శాస్త్రవేత్తలు అని వ్యవహరిస్తారు. వీరు సంపాదించే జీతం సంవత్సరానికి రూ. 48.13 లక్షల నుంచి రూ.64.17 లక్షల వరకూ ఉంటుంది.
* రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ స్పేస్‌ సైన్స్‌
అంతరిక్ష వాతావరణంపై అవగాహన పెంచుకునే అవసరం సమాజానికి పెరుగుతూవస్తోంది. అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్‌, నేవిగేషన్‌ సిస్టమ్స్‌పై ఆధారపడటం ఎక్కువైంది. ఈ వాతావరణంలో జరిగే వివిధ భౌతిక, రసాయనిక ప్రక్రియలు తెలుసుకోవటం వల్ల తగిన టెక్నాలజీలను అభివృద్ధి చేయటం, ప్రయోగించటంలాంటివి సాధ్యమవుతాయి. అంతరిక్ష వాతావరణం నుంచి సమాచారాన్ని పొందటానికి సమర్థంగా ఉపయోగపడేది రిమోట్‌ సెన్సింగ్‌.
అమెరికాలోని చాలా కొద్ది విశ్వవిద్యాలయాల్లోనే ఈ రంగంలో పరిశోధనలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయి (అర్బానా షాంపెయిన్‌), పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ మొదలైనవి వీటిలో కొన్ని.
కెరియర్‌: స్పేస్‌ సైన్స్‌లో కెరియర్‌ అంటే అది వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌) గా తయారవ్వటానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఈ రంగంలో విభిన్న రకాలైన ఇంజినీర్లు పనిచేసే అవకాశం ఉంది. ఉదాహరణకు...ఏరోస్పేస్‌/ ఏరోనాటికల్‌ ఇంజినీర్లు, ఏవియానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్లు, కంప్యూటర్‌ ఇంజినీర్లు, మెటీరియల్స్‌ ఇంజినీర్లు, మెకానికల్‌ ఇంజినీర్లు, రోబోటిక్స్‌ ఇంజినీర్లు, స్పేస్‌క్రాఫ్ట్‌ ఇంజినీర్లు.
ఈ రంగంలో పనిచేసే ఇంజినీర్ల సగటు వార్షిక వేతనం రూ. 62.89 లక్షలు ఉంటుంది.
నానో టెక్నాలజీ
నానోటెక్నాలజీ నేటి కంప్యూటర్‌ చిప్‌ తయారీదారులతోపాటు దాని కొత్త చిప్‌ టెక్నాలజీల అభివృద్ధికీ తోడ్పడుతోంది. నానో ఎలక్ట్రానిక్స్‌, నానో ఫోటానిక్‌ అప్లికేషన్ల విస్తృత శ్రేణి అవసరాలకు తగ్గ కొత్త మెటీరియళ్ల అభివృద్ధితోపాటు న్యూపాయింట్‌ ఆఫ్‌ కేర్‌ నానో బయో ఎలక్ట్రానిక్‌ సెన్సార్లు, ఎన్నో ఇతర అప్లికేషన్ల తయారీకీ సాయపడుతోంది.
యూఎస్‌ఏలో నానోటెక్నాలజీకి సంబంధించి మూడు ప్రపంచ ప్రసిద్ధి పరిశోధన కేంద్రాలున్నాయి.
* యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఫొటో ఓల్టాయిక్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ‌
* 3డీ సిస్టమ్స్‌ ప్యాకేజింగ్‌ రిసెర్చ్‌ సెంటర్‌
* సెంటర్‌ ఫర్‌ ఎంఈఎంఎస్‌ అండ్‌ మైక్రో సిస్టమ్స్‌ టెక్నాలజీస్‌ (సీఎంఎంటీ)
నానోటెక్నాలజీపై పరిశోధన అవకాశం అందించే మరికొన్ని సంస్థలు.. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాంటా బార్బరా, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయి (అర్బానా షాంపెయిన్‌), జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సునీ పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌- ఆల్బెనీ క్యాంపస్‌.
కెరియర్‌: ఎలక్ట్రానిక్స్‌/సెమీ కండక్టర్‌, మెటీరియల్స్‌ సైన్స్‌, టెక్స్‌టైల్స్‌, పాలిమర్స్‌, ప్యాకేజింగ్‌, ఆటో అండ్‌ ఏరోస్పేస్‌ పరిశ్రమల్లో, స్పోర్టింగ్‌ గూడ్స్‌, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్‌, ఫుడ్‌ సైన్స్‌, ఫోరెన్సిక్స్‌ మొదలైన రంగాల్లో నానో టెక్నాలజీ విద్యార్థులకు అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయి. నానో టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసిన ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌ చాలా విలువ ఇస్తుంది.
నానో టెక్నాలజీ ఇంజినీర్ల వార్షిక వేతనం రూ. 34.33 లక్షల నుంచి 98.15 లక్షలవరకూ ఉంటుంది. .

Posted on 08.02.2018Ask the Expert
Click Here..