ఎంబీబీఎస్.. చలో విదేశం

* ఇక్కడి కంటే ఎంతో చవక
* బోధన, మౌలిక వసతుల్లోనూ మేటి
* మొగ్గు చూపుతున్న విద్యార్థులు

వైద్య వృత్తిలో స్థిరపడాలన్నది సాహితి లక్ష్యం. ఎంసెట్‌లోనేమో ర్యాంకు అనుకూలంగా రాలేదు. వచ్చిన ర్యాంకుకు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు రావడమన్నది అసాధ్యమని తేలిపోయింది. ప్రైవేటులో ప్రయత్నిస్తే సీటొచ్చింది. కానీ ఐదేళు పూర్తయ్యే సరికి ఫీజు, డొనేషన్.. అన్నీ కలిపి దాదాపు రూ.80 లక్షలు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి ఇక్కడే చదవాలా? అని ఆలోచించింది. తక్కువ ఖర్చుతో ఎక్కడ చదవొచ్చో విచారించింది. విదేశాల్లో రూ.15-25 లక్షల్లోపే వైద్య విద్య పట్టా చేతికొస్తుందన్న అవగాహన పెంచుకుంది. అంతే, డాక్టర్ అవ్వాలన్న లక్ష్య సాధన కోసం పొరుగు దేశానికి పయనమైంది.

ఏడాది ఖర్చుతో అక్కడ కోర్సంతా!

ప్రభుత్వ కళాశాలల్ని పక్కనబెడితే.. మన దేశంలో ప్రైవేటు కళాశాలల్లో ఎంబీబీఎస్ ఐదేళ్ల కోర్సుకు.. సగటున రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. కొన్ని కళాశాలల్లో అయితే కోటి రూపాయల దాకా అవుతోంది. అన్ని లక్షలు ఖర్చుపెట్టి.. చదివించే స్థోమత ఎగువ మధ్య తరగతి వర్గాలకి కూడా ఉండదు. తీసుకొనే ఫీజులో ఎక్కువ భాగం బ్లాకే. ఆ చదివింపులకు బ్యాంకులు రుణాలివ్వవు. ఇచ్చినా ఆ చదువును కొనే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు సహజంగానే తక్కువ ఖర్చుతో ఎక్కడ వైద్యవిద్య లభ్యమవుతుందన్న ఆలోచన మొదలవుతోంది. విదేశాల్లో అవకాశాలు వెల్లువెత్తుతుండడంతో ఇప్పుడంతా ఆ బాటే పడుతున్నారు. చైనా, రష్యా, ఉక్రేయిన్ లాంటి దేశాల్లో 15 - 25 లక్షల్లో ఎంబీబీఎస్ పూర్తి అవుతోంది. అంటే ఇక్కడ ఒక్క ఏడాదిలో పెట్టే ఖర్చుతో పోల్చితే.. విదేశాల్లో ఐదారేళ్ల వైద్య విద్యను పూర్తి చేయొచ్చు. దీంతో తల్లిదండ్రులూ.. తమ పిల్లల ఇష్టాన్ని నెరవేర్చేందుకు ఖండాంతరాలకు పంపించడానికీ వెనుకాడడం లేదు. నిజంగానే రూ.60-80 లక్షలు ఖర్చు పెట్టుకునే స్థోమత ఉన్నా.. విదేశాలకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే.. అక్కడైతే రూ.20 - 25 లక్షలతో పూర్తిచేసి.. తిరిగి వచ్చాక.. ఆ మిగిలిన డబ్బుతో పీజీ సీటును కొనుక్కోవచ్చు కదా అన్న ధోరణీ పెరిగిపోతోంది. ''నేను రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో చదివా. ఇప్పుడిక్కడ ప్రైవేటు ఆస్పత్రిలో క్రిటికల్ కేర్‌లో డిప్లొమా చేస్తున్నా. ఈ ఏడాది మా చెల్లికి ఇక్కడి ప్రైవేటులో సీటొచ్చింది. కానీ ఇక్కడ అంత డబ్బు పెట్టడం కంటే.. విదేశాల్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేయించి.. తిరిగి వచ్చాక అప్పటి పరిస్థితులను బట్టి అవసరమైతే పీజీ సీటుకు ఈ మిగిలిన డబ్బులను వాడుకోవచ్చు కదా.. అని ఆలోచిస్తున్నాం'' అని చెబుతున్నారు డాక్టర్ లాలిత్య.

బోధనా భేష్!

విదేశాల్లోని చాలా కళాశాలల్లో మన బోధనా ప్రమాణాలు, మౌలిక వసతులకు ఏ మాత్రం తీసిపోనివిధంగా వైద్య విద్య లభ్యమవుతోంది. ప్రాక్టికల్ నాలెడ్జీ పెంపొందించే తరగతులు కూడా ఎక్కువే! ''నేను చైనాలో ఎంబీబీఎస్ చేశా. అక్కడి వైద్య కళాశాలలు సూపర్ అని చెప్పలేము. అలా అని అధ్వానంగా ఏమీ ఉండవు. మన వాటికేమీ తీసిపోవు. స్థానిక భాష నేర్చుకుంటే మనకే మంచిది. ఎందుకంటే ఏడాది పాటూ ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు చైనీస్ భాష రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే నేర్చుకోవడం కష్టమేం కాదు. వాళ్లే నేర్పిస్తారు కూడా. ప్రొఫెసర్లు ఎక్కువమంది బాగా ఆంగ్లంలో మాట్లాడగలరు. మొత్తంగా చూస్తే బాగానే ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డాం అన్నదాని పైనే తుది ఫలితం ఉంటుంది. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా. ఇక్కడి వైద్య విద్యార్థులతో పోల్చుకుంటే.. కొన్ని సందర్భాల్లో విదేశాల్లో చదివిన నేనే బెటరన్న భావన కూడా వస్తుంటుంది'' అని చెబుతున్నారు డాక్టర్ కవిత మెహతా.

మనవాళ్లు ఎక్కువే

విదేశీ విశ్వవిద్యాలయాల్లో భారతీయుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పుడు మన విద్యార్థులు గుర్తించ గలిగేంత సంఖ్యలో ఉంటున్నారు. కాబట్టి 'మరీ ఒంటరి' అన్న భావనేం ఏర్పడదు. ఇప్పుడు చైనాలో అయితే ఒక్కో యూనివర్సిటీలో దాదాపు 100 మంది వరకూ మన భారతీయ విద్యార్థులే ఉంటున్నారని ఓ అంచనా. ''మన రాష్ట్రం నుంచి ఏడాదికి సుమారు రెండు వేల మంది విదేశీ ఎంబీబీఎస్ కోసం వెళ్తున్నారు. చైనాలో ఐదేళ్లు, రష్యా, ఉక్రేయిన్‌లలో ఆరేళ్ల కోర్సు ఉంటుంది. ఖర్చు దేశాన్ని బట్టి మారుతుంటుంది. చైనాలో రూ.12-15 లక్షలు ఉంటుంది. ఉక్రేయిన్‌లో రూ.15-17 లక్షలు ఉంటుంది. రష్యాలో రూ.25 లక్షల వరకూ ఖర్చు ఉంటుంది'' అని విదేశాల్లో వైద్య విద్య అవకాశాలు ఇప్పించే ఏజెన్సీ నిర్వాహకులు ఒకరు చెప్పారు. ''నేను 2003లో రష్యా వెళ్లినప్పుడు ఎక్కువ మందిమి అమ్మాయిలమే ఉండేవాళ్లం. అప్పుడు 70 మంది వరకూ భారతీయులు ఉండగా.. అందులో 12 మంది తెలుగువాళ్లే. మా బ్యాచ్‌లో 50 మంది అమ్మాయిలమే. కొద్దిగా అలవాట్లు దగ్గరిదగ్గరిగా ఉంటాయని.. భారత్, శ్రీలంక, మలేషియా విద్యార్థులను ఒక హాస్టల్‌లో ఉంచేవారు. మేమే వండుకునే వాళ్లం. అందుకు అవసరమైనవన్నీ వాళ్లే సమకూర్చారు. ఇప్పుడైతే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది'' అని వివరించారు డాక్టర్ లాలిత్య.

ఆ రోజులు పోయాయి!

ఒక్కప్పుడు చైనా, రష్యాల్లో వైద్య విద్యనభ్యసించి వస్తే.. ఓ రకంగా చూసేవారేమో! కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక్కడి వాళ్లతో సమానంగా వేతనాలు ఇస్తున్నారు. ''నేను ఉక్రెయిన్‌లో చదివా. ఇక్కడికొచ్చాక నాకు ఎలాంటి తేడా కనిపించలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇక ఏ విషయాన్నీ ఎవ్వరూ పట్టించుకోరు. మనకెంత పరిజ్ఞానం ఉంది? అన్నదే ముఖ్యం తప్ప.. ఎక్కడ చదివామన్నది కాదు. అయినా ఎప్పుడైనా ఎక్కడైనా సరే.. మనకున్న పరిజ్ఞానమే మనల్ని నిలబెడుతుంది'' అంటున్నారు డాక్టర్ ప్రభు. ఇంతకు ముందు ఎంసీఐ పరీక్ష పాస్ అవడం కూడా చాలా కష్టమనే భావన ఉండేది. కానీ ఇప్పుడు తొలి ప్రయత్నంలోనే విజయం సాధిస్తున్నారు. ''ఎంసీఐ పరీక్షను నేను మొదటిసారే పాసయ్యాను. కోచింగ్ కూడా తీసుకోలేదు. కొన్ని దేశాల్లో అక్కడే ఎంసీఐకి సంబంధించిన కోచింగ్ కూడా ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు చాలా మంది మొదటి సారే ఎంసీఐ అర్హత పరీక్షను గట్టెక్కు తున్నారు'' అని చెబుతున్నారు డాక్టర్ కవిత.

విదేశాల్లో వైద్యవిద్యకు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి....Ask the Expert
Click Here..