కోర్సు... ఆపై కొలువు!

నాణ్యమైన విద్య... సులువైన ఇమిగ్రేషన్‌...కోర్సులు పూర్తిచేసిన విదేశీ విద్యార్థులు అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడే వెసులుబాటు... ఇవీ ఆస్ట్రేలియా ప్రత్యేకతల్లో ప్రధానమైనవి! బహుళ సంస్కృతుల కేంద్రంగా ఉండటం వల్ల ఏ దేశానికి చెందినవారైనా ఇక్కడ తేలిగ్గా ఇమిడిపోగలుగుతారు. వివిధ అత్యుత్తమ శ్రేణి విశ్వవిద్యాలయాలున్న ఈ దేశం ప్రపంచపు నలుమూలల నుంచీ ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షిస్తోంది. ఉన్నతవిద్య కోసం ఆస్ట్రేలియాను ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కొద్ది సంవత్సరాలుగా గణనీయంగా పెరుగుతోంది! అతిపెద్ద ఇన్‌టేక్‌ అయిన జులై అడ్మిషన్లకు ఇంకా కొద్ది సమయం ఉంది. అలాగే ఆసక్తి ఉన్న విద్యార్థులు రాబోయే నవంబరు, ఫిబ్రవరి ప్రవేశాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవచ్చు!

అనుకూల వాతావరణం, స్థానిక ప్రజల స్నేహపూర్వక ప్రవర్తన ఆస్ట్రేలియా ప్రత్యేకతలు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన ఈ దేశం విద్య, సేవలు, నిర్మాణం, ఆర్థికం, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
ప్ర‌పంచంలో అత్యంత నివాస‌యోగ్య‌మైన మొద‌టి ప‌ది న‌గ‌రాల్లో మూడు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. అవి..మెల్‌బోర్న్, ఆడిలైడ్ , పెర్త్‌. వీటితోపాటు సిడ్నీ, బ్రిస్‌బేన్‌, కాన్‌బెర్రా లాంటి ప్రధాన నగరాలున్నాయి. ఇక్కడి ప్రధాన నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో అత్యధికంగా కాస్మాపాలిటన్‌ వాతావరణం కనిపిస్తుంది. అక్కడి జీవనశైలి, ఆహార విహారాలపై అంతర్జాతీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. విదేశీ విద్యార్థులకు ఇది అనుకూలాంశం.
యు.ఎస్‌.లో విద్యాభ్యాసానికి వెళ్ళే విదేశీ విద్యార్థులు కఠిన వీసా నిబంధనలూ మొదలైన కారణాల వల్ల 2017లో 26 శాతం తగ్గారు. ఈ తగ్గుదల మనదేశంలో 35 శాతం వరకూ ఉంది. ఇలాంటి విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఎంచుకునే దేశాల్లో ఆస్ట్రేలియా ముందువరుసలో ఉంది.
ఆఫ్‌ క్యాంపస్‌లోనూ అవకాశం
అమెరికాలో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలను క్యాంపస్‌లో చేయటానికి మాత్రమే అనుమతిస్తారు. ఆఫ్‌ క్యాంపస్‌లో చేయడం చట్ట వ్యతిరేకం. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలను ఆఫ్‌ క్యాంపస్‌లో కూడా చేసే వీలుండటం విశేషం. విదేశీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే అంశమిది. మాస్టర్స్‌ కోర్సు చదివిన తర్వాత రెండేళ్ళ వర్క్‌ పర్మిట్‌ ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత.
2015లో 6,42,949 మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకున్నారు. 2016కు వచ్చేసరికి ఇది 10.9 శాతం పెరిగి, విద్యార్థుల సంఖ్య 7,12,884గా నమోదయ్యింది. ఈ కాలవ్యవధిలో ఆ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్యలో 8.9 శాతం పెరుగుదల (71,992 నుంచి 78,424 మంది) ఓ విశేషం.
ఏడాదికి మూడుసార్లు ఆస్ట్రేలియాలో అడ్మిషన్ల సీజన్లు ఉంటాయి. అవి జులై, నవంబరు, ఫిబ్రవరి. అతి పెద్దదైన జులై ఇన్‌టేక్‌ ఇప్పుడు జరుగుతోంది. దరఖాస్తులకు మరికొంత సమయం ఉంది. మిగతా రెండు సీజన్ల ప్రవేశాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవటంపై విద్యార్థులు దృష్టిపెట్టాలి.
ప్రపంచస్థాయి బోధన
ఎన్నో అత్యున్నత ర్యాంకులున్న విశ్వవిద్యాలయాలు ఇక్కడున్నాయి. 41కు పైగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలే ఎక్కువ. చాలా యూనివర్సిటీల బ్రాంచీలకు విదేశాల్లో శాటిలైట్‌ క్యాంపసులున్నాయి.
ఉన్నత విద్య బ్రిటిష్‌ నమూనా ఆధారితం కావటం వల్ల ఎంచుకున్న రంగంలో ప్రపంచస్థాయి బోధన, శిక్షణ ఇక్కడ దొరుకుతాయి. అదనంగా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు నాణ్యమైన సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఆ దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న సుప్రసిద్ధ పరిశోధన కేంద్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్ల విద్యార్థులకు శ్రేష్ఠమైన విద్యను అందించగలుగుతున్నాయి.
ఈ దేశంలో నాలుగు రకాల డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అండర్‌ గ్రాడ్యుయేట్‌: ఈ బ్యాచిలర్‌ డిగ్రీల్లో చేరటానికి 18 సంవత్సరాలు నిండివుండాలి. కనీస ఆంగ్ల పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌ లేదా టోఫెల్‌, పీటీఈలో స్కోర్లుండాలి. ఇంటర్లో కనీసం 65 శాతం అవసరం. అయితే 60 శాతం కంటే తక్కువున్నవారు ఫౌండేషన్స్‌, డిప్లొమా ప్రోగ్రాముల్లో చేరవచ్చు.
రిసర్చ్‌ మాస్టర్స్‌: దీనిలో చేరాలంటే బ్యాచిలర్‌ డిగ్రీ (ఆనర్స్‌) లేదా మాస్టర్స్‌ ప్రిలిమినరీ సంవత్సరం, పరిశోధన ఆధారిత గ్రాడ్యుయేట్‌ డిప్లొమా లేదా తగినంత పరిశోధనానుభవం ఉండాలి.
ప్రొఫెషనల్‌ మాస్టర్స్‌: బ్యాచిలర్‌ డిగ్రీ, వృత్తిపరమైన అనుభవం లేదా సంబంధిత వృత్తిపరమైన విస్తృత అనుభవం ఉన్నవారు చేరవచ్చు.
టీఏఎఫ్‌ఈ సర్టిఫికెట్లు (ఒకేషనల్‌ శిక్షణ, విద్య): అత్యంత నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో చేరాలనుకునేవారికి ఈ డిగ్రీలు ఉపయోగం. యూనివర్సిటీ డిగ్రీ చదువులకు కూడా ఇదో ప్రత్యామ్నాయ మార్గం.
స్కిల్డ్‌ ఆక్యుపేషన్‌ లిస్ట్‌ (ఎస్‌ఏఎల్‌)
మారుతున్న సామాజిక ఆర్థిక అవసరాలను బట్టి ప్రతి ఆరు నెలలకోసారి ఈ జాబితాను తయారుచేసి విడుదల చేస్తారు. దీనిలో ఉన్న కోర్సుల్లో ప్రవేశాలు పొందినవారికి అర్హతలను బట్టి వీసా సులభంగా మంజూరవుతుంది. సంబంధిత కోర్సుల్లో చదివి అక్కడే స్థిరపడటానికి అవకాశం ఉండటం ఆస్ట్రేలియాలో పెద్ద అనుకూలాంశం.
2017లో రూపొందించిన జాబితాలో పదికి పైగా ఇంజినీరింగ్‌ వృత్తులు చోటుచేసుకున్నాయి. కెమికల్‌, మెటీరియల్స్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, అగ్రికల్చరల్‌, బయోమెడికల్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌; టెలికమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇవి కాకుండా మిగిలినవి: ఐసీటీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ఐసీటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌, సిస్టమ్స్‌ అనలిస్ట్‌, అనలిస్ట్‌ ప్రోగ్రామర్‌, కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌, ఇంజినీరింగ్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌, అకౌంటెంట్‌ (జనరల్‌).
పీజీకి ఎంత ఖర్చవుతుంది?
మాస్టర్స్‌ డిగ్రీ చేయాలంటే ఆస్ట్రేలియన్‌ బ్యాచిలర్‌ డిగ్రీతో సమానమైన అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసివుండాలి. వీరు ఆస్ట్రేలియాలో కోర్సు పూర్తిచేయటానికి ట్యూషన్‌ ఫీజు, దైనందిన ఖర్చుల కోసం తగినన్ని ఆర్థిక వనరులు కలిగివుండటం తప్పనిసరి.
మాస్టర్స్‌ చేయటానికి ఏడాదికి 8.20 లక్షల నుంచి 15.36 లక్షల వరకూ యూనివర్సిటీని బట్టి ట్యూషన్‌ ఫీజు ఉంటుంది. ఇక నివాసం, ఇతర దైనందిన ఖర్చులకు 10.39 లక్షలు అవసరం.
విద్యార్థి వీసా పొందటానికి....
* ఏడాది ట్యూషన్‌ ఫీజు, జీవన వ్యయం, ప్రయాణ ఖర్చులకు సరిపోను డబ్బున్నట్టు ఆధారాలతోపాటు ఓవర్‌సీస్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండాలి.
* విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం కనీసం 5.12 లక్షల రూపాయిలు ఉన్నట్టు ఆధారాలు చూపాలి.
దరఖాస్తుదారులైన విద్యార్థులు వాస్తవంగా విద్యాభ్యాసం చేయాలనే ఆసక్తితోనే తాత్కాలికంగా ఆస్ట్రేలియాలో ఉండబోతున్నారని ఇమిగ్రేషన్‌ విభాగం విశ్వసిచంటం ముఖ్యం. దీనికోసం ప్రతి దరఖాస్తునూ వివరంగా పరిశీలిస్తారు. ఈ రకంగా వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో జెన్యూన్‌ టెంపరరీ ఎంట్రన్ట్‌ (జీటీఈ) అసెస్‌మెంట్‌ భాగంగా ఉంటుంది. ఈ సందర్భంగా సంబంధిత అధికారి విద్యార్థులతో వారు ఎందుకని ఆస్ట్రేలియాలోనే చదవాలని భావిస్తున్నారో కారణాలను తెలుసుకుని, వాటిపై చర్చిస్తారు. సంతృప్తికరంగా తగిన సమాధానాలు ఇస్తే వీసాను మంజూరు చేస్తారు.
ఇంగ్లిష్‌ భాషా పరీక్షలు
ఆస్ట్రేలియాలో ఆంగ్లంలో బోధించే ప్రోగ్రాములు 60 వేలకు పైగా ఉన్నాయి. అందుకే అక్కడి యూనివర్సిటీలు తమ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు మంచి ఆంగ్ల భాషా సామర్థ్యాలుండాలని ఆశిస్తాయి. అన్ని విశ్వవిద్యాలయాలూ అధికారికమైన మూడు ఆంగ్ల పరీక్షల స్కోర్లను ఆమోదిస్తాయి. వీటిలో ఏదో ఒక దానిలో స్కోరు ఉండాలి.
* ఐఈఎల్‌టీఎస్‌ (అకడమిక్‌ మాడ్యూల్‌): ఓవరాల్‌ స్కోరు 6.5 (బ్యాండ్‌ కనీసం 6.0)
* టోఫెల్‌ ఇంటర్నెట్‌: టెస్ట్‌ స్కోరు 79. సెక్షన్లవారీగా కనీసం ఉండాల్సిన స్కోర్లు: లిసనింగ్‌: 19, స్పీకింగ్‌: 19, రీడింగ్‌: 18, రైటింగ్‌: 22
* పియర్సన్‌ టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ (పీటీఈ): ఓవరాల్‌ స్కోరు 50-64 (సెక్షన్‌వారీ స్కోరు కనీసం 46-58)

Posted on 29.05.2018Ask the Expert
Click Here..