151 ఏళ్ల త‌ర్వాతే గ్రీన్‌కార్డ్‌!

* అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ డిగ్రీలున్న భారతీయుల పరిస్థితి
* తాజా నివేదికలో వెల్లడి

వాషింగ్టన్‌: మాస్టర్స్‌, డాక్టరేట్‌ లాంటి అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ పట్టాదారులైన భారతీయులు గ్రీన్‌కార్డు పొందాలంటే గరిష్ఠంగా 151 ఏళ్ల వరకూ ఎదురుచూడాలని తాజా నివేదిక తేల్చింది. మేధోమథన సంస్థ కెటో ఇన్‌స్టిట్యూట్‌ దీన్ని విడుదలచేసింది. అమెరికా పౌరసత్వం, వలసల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) విడుదల చేసిన శాశ్వత నివాస దరఖాస్తుల వివరాలను సంస్థ విశ్లేషించింది. వీటి ప్రకారం...
* 2018, ఏప్రిల్‌ 20నాటికి గ్రీన్‌కార్డుల కోసం 6,32,219 మంది భారతీయులు దరఖాస్తులను సమర్పించారు. వీరిలో కార్మికులతోపాటు వారీ జీవిత భాగస్వాములు, పిల్లలూ ఉన్నారు.
* మేలిమి నైపుణ్యాల విభాగం (హైయెస్ట్‌ స్కిల్డ్‌ కేటగిరీ)లోని అసాధారణ సామర్థ్యం (ఎక్స్‌ట్రార్డినరీ) కేటగిరీ కింద అమెరికా వచ్చిన భారత కార్మికులు (ఈబీ-1)లు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూడాల్సిన సమయం తక్కువగా ఉంది. వీరు గరిష్ఠంగా ఆరేళ్లు ఓపిక పడితే గ్రీన్‌కార్డులు చేతికి అందే అవకాశముంది. ఈ కేటగిరీ కింద ప్రస్తుతం 34,824 మంది కార్మికుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరి జీవిత భాగస్వాములు, పిల్లల దరఖాస్తులనూ కలిపితే ఈ సంఖ్య 83,578 వరకూ ఉంది.
* బ్యాచిలర్‌ డిగ్రీ పట్టాలతో ఇక్కడకు వచ్చిన కార్మికులు (ఈబీ-3 కేటగిరీ) అయితే 17 ఏళ్లు వేచి ఉండాలి. ప్రస్తుతం ఈ కేటగిరీలో 54,892 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరి జీవిత భాగస్వాములు, పిల్లల దరఖాస్తులనూ కలిపితే ఈ సంఖ్య 1,15,273 వరకూ ఉంది.
* అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ పట్టాదారుల (ఈబీ-2) విషయంలో ఈ ఎదురుచూపులు 150 ఏళ్లకు పైమాటే. ప్రస్తుతం ఈ కేటగిరీలో 2,16,684 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరి జీవిత భాగస్వాములు, పిల్లల దరఖాస్తులు కలిపితే ఈ సంఖ్య 4,33,368గా ఉంది. పెండింగ్‌ దరఖాస్తుల్లో ఎక్కువ ఈబీ-2 (69 శాతం) కేటగిరీలోనే ఉన్నాయి. అయితే వీరికి దక్కే కార్డులు 13 శాతం మాత్రమే.

Posted on 17.06.2018

 


Ask the Expert
Click Here..