విదేశీ విద్యకు సరాసరి దారి!

ఎడ్యుకేషన్‌ ఎల్లలు చెరిగిపోతున్నాయి. విశ్వవ్యాప్తంగా ఏ మూలకైనా వెళ్లి విద్య నేర్చుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి ఆక్స్‌ఫర్డ్‌కి, కాకినాడ నుంచి కాలిఫోర్నియాకి కూల్‌గా వెళ్లిపోతున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశం నుంచే విదేశాల్లో ఎక్కువమంది చదువుకుంటున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు ఇతర కోర్సుల్లోనూ ఎక్కువగా చేరుతున్నారు. ఇలా విదేశీ డిగ్రీని సంపాదించుకోవాలంటే కొన్ని పరీక్షల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. వాటిలో ప్రధానమైనది జీఆర్‌ఈ (గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌). డిగ్రీ స్థాయి నుంచే వీటిపై అవగాహన పెంచుకుంటే ఆశించిన లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు.

జీఆర్‌ఈని ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్‌) అనే అమెరికా సంస్థ నిర్వహిస్తుంది. ఆన్‌లైన్‌, పేపర్‌ బేస్డ్‌ రెండు విధాలుగా పరీక్ష జరుగుతుంది. కానీ మనదేశంలో మాత్రం ఆన్‌లైన్‌ లోనే రాసుకోవాలి. 160కి పైగా దేశాల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో ఈ పరీక్షను ఏడాది పొడవునా నిర్వహిస్తారు. ఒక ఏడాదిలో గరిష్ఠంగా 5 సార్లు రాసుకోవచ్చు. రెండు పరీక్షల మధ్య వ్యవధి కనీసం 21 రోజులు ఉంటే సరిపోతుంది. జీఆర్‌ఈ స్కోరు అయిదేళ్లపాటు చెల్లుబాటవుతుంది. పరీక్ష ఫీజు 205 డాలర్లు.
పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం భారత్‌ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. గత సంవత్సరం వీరి సంఖ్య లక్షా 86 వేలు. దీంతో విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 17.3 శాతానికి చేరింది. చైనా తర్వాత మనవాళ్లే ఎక్కువగా విదేశాలకు వెళుతున్నారు. వీరిలో సింహభాగం (దాదాపు 56 శాతం) గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోనే చేరుతున్నారు. మన విద్యార్థుల్లో ఎక్కువ మంది అమెరికా తర్వాత యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ మొదలైన దేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు.
ప్రవేశాలు ఎప్పుడు?
ఎక్కువమంది వెళ్లే యూఎస్‌లో నాలుగుసార్లు అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. సీజన్లవారీ కొన్ని కోర్సుల చొప్పున స్ప్రింగ్‌ (జనవరి/ ఫిబ్రవరి), ఫాల్‌ (మే/ జూన్‌), సమ్మర్‌ (ఆగస్టు / సెప్టెంబరు), వింటర్‌ (నవంబరు / డిసెంబరు) ల్లో ప్రవేశాలు ఉంటాయి. అయితే ఎక్కువ యూనివర్సిటీలు ఫాల్‌ సీజన్లోనే ప్రకటనలు ఇస్తున్నాయి. భారతీయ విద్యార్థులకు ఈ సీజన్‌ అనువైనది. తర్వాతి ప్రాధాన్యం స్ప్రింగ్‌కు ఇవ్వవచ్చు.
దరఖాస్తు విధానం
ప్రముఖ సంస్థల్లో సెమిస్టర్‌ మొదలయ్యే రోజుకి ఏడాది ముందు నుంచే దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఉదాహరణకు ఫాల్‌ సీజన్‌కు ఆగస్టు నుంచి సెమిస్టరు మొదలవుతుంది. కాబట్టి ముందు సంవత్సరం సెప్టెంబరులో దరఖాస్తు చేసుకోవాలి. సంస్థను బట్టి ఈ డెడ్‌ లైన్లు మారతాయి. సాధారణంగా మొదటి డెడ్‌లైన్‌ సెప్టెంబరు, రెండో డెడ్‌లైన్‌ నవంబరు, మూడో డెడ్‌లైన్‌ జనవరి ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలకు ఒకటే డెడ్‌లైన్‌ కూడా ఉండవచ్చు. చివరి తేదీలోగా దరఖాస్తు, ఇతర వివరాలు సంబంధిత యూనివర్సిటీకి చేరాలి.
సంబంధిత యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవడానికి విధించిన డెడ్‌లైన్‌ కంటే కనీసం మూడు లేదా నాలుగు వారాల ముందు వరకు జీఆర్‌ఈ రాసుకోవచ్చు. ఆ స్కోర్‌ యూనివర్సిటీలకు చేరడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. అభ్యర్థులు 4 నుంచి 6 నెలల సన్నద్ధతతో పరీక్షకు సిద్ధం కావచ్చు. విదేశాల్లో చదువుకోవాలనే ప్రణాళిక ముందు నుంచే ఉన్నవారు మూడో సంవత్సరం కోర్సులు చదువుతున్నప్పుడే జీఆర్‌ఈ సన్నాహాలు ప్రారంభించడం మంచిది.
సబ్జెక్టు పరీక్ష
జీఆర్‌ఈలో జనరల్‌ టెస్టుతో పాటు సబ్జెక్టు టెస్టు ఉంటుంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, సైకాలజీల్లో సబ్జెక్టు టెస్టులను నిర్వహిస్తున్నారు. అయితే చాలా సంస్థలు జీఆర్‌ఈ జనరల్‌ స్కోర్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నాయి. కొద్ది సంస్థలు మాత్రమే ఆయా సబ్జెక్టుల్లో స్కోర్‌ అడుగుతున్నాయి. ఈ సబ్జెక్ట్‌ పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరుగుతాయి. పరీక్ష వ్యవధి రెండు గంటల యాభై నిమిషాలు. భారత్‌లో ఏడాదికి ఒకసారి ఈ సబ్జెక్టు పరీక్షను నిర్వహిస్తున్నారు.
ఏ కోర్సుల్లోకి ప్రవేశం?
జీఆర్‌ఈ స్కోరుతో ఏ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోనైనా చేరవచ్చు. లైఫ్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, ఇంజినీరింగ్‌, బిజినెస్‌ తదితర అన్ని కోర్సుల్లో ప్రవేశానికీ ఈ స్కోర్‌ ఉపయోగపడుతుంది. కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ జీఆర్‌ఈ స్కోర్‌ చెల్లుబాటవుతుంది. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ కూడా జీఆర్‌ఈ స్కోర్‌ ఆధారంగా అడ్మిషన్లు నిర్వహిస్తోంది.
ఎవరు అర్హులు?: పరీక్షను ఎవరైనా రాసుకోవచ్చు. ఎలాంటి అర్హతలను పేర్కొనలేదు. అయితే ఈ స్కోర్‌తో ప్రవేశం పొందడానికి మాత్రం నిర్ణీత విద్యార్హతలు తప్పనిసరి. చాలా సంస్థల్లో ముఖ్యంగా యూఎస్‌లో ఉన్నత విద్యకు కనీసం 16 ఏళ్ల చదువు ఉండాలి. కొద్ది సంస్థలు 15 ఏళ్ల చదువు (10+2+3) తోనూ అడ్మిషన్లు ఇస్తున్నాయి.
మంచి స్కోరుకు మార్గం!
వీలైనన్ని ఎక్కువ మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రాక్టీస్‌ ఎంత ఎక్కువగా ఉంటే స్కోరింగ్‌ అంత ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
పరీక్షకు ఎప్పుడు హాజరవ్వాలో అభ్యర్థి నిర్ణయించుకోవచ్చు కాబట్టి పూర్తిగా సన్నద్ధమైన తర్వాతే రాయడం మంచిది. మాక్‌ టెస్టుల్లో చూపిన ప్రతిభ ద్వారా అసలు పరీక్షను ఎప్పుడు రాయాలో ఒక నిర్ణయానికి రావచ్చు.
పరీక్ష రాసేటప్పుడు గుర్తించిన జవాబుపై సందేహం ఉంటే దాన్ని రివ్యూ కోసం మార్క్‌ చేసుకోవచ్చు. చివర్లో మరోసారి సరిచూసుకోవచ్చు.
తప్పుగా గుర్తించిన జవాబులకు రుణాత్మక మార్కులు ఉండవు. కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుక్కునే విధానం తెలిసినప్పటికీ దాన్ని రాబట్టడానికి ఎక్కువ సమయం పడుతుందనిపిస్తే వాటిని మార్క్‌డ్‌ ఫర్‌ లేటర్‌ రివ్యూలో చేర్చాలి. మిగిలిన ప్రశ్నలకు జవాబులు రాసిన తర్వాత వీటిని చేయాలి. వీలైనంత వరకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం మంచిది.
సమయాన్ని చూసుకుంటూ సెక్షన్ల వారీ ముందుకెళ్లాలి. కనీసం అయిదు నిమిషాల ముందే ఆయా సెక్షన్లను పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. చివరి అయిదు నిమిషాలు మార్పుచేర్పులకు ఉపయోగించుకోవాలి. అక్షర దోషాలు, అన్వయ లోపాలు లేకుండా చూసుకోవాలి.
భారతీయ విద్యార్థులు క్వాంట్‌ విభాగం కంటే వెర్బల్‌తోనే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని ఒక అంచనా. అనలిటికల్‌ రైటింగ్‌ను కష్టంగా భావిస్తున్నారు. అందువల్ల వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అనలిటికల్‌ రైటింగ్‌ విభాగంలో 6 పాయింట్లకు గాను 4 సాధించడానికి ప్రయత్నించాలి.
ఈటీఎస్‌ అధికారిక పుస్తకాలను చదవాలి. సాధన చేయాలి. వాటి వివరాలను ‌www.ets.org/gre వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఎంత స్కోర్‌ రావాలి?
ఎంఎస్‌ లేదా ఇతర ఏ కోర్సుల్లో ప్రవేశానికైనా జీఆర్‌ఈ స్కోర్‌ చాలా ముఖ్యం. అమెరికాలోని టాప్‌ యూనివర్సిటీల్లో చేరడానికి సాధారణంగా 320+ స్కోర్‌ కావాలి. మన దేశం నుంచి విద్యార్థులు 300-310+ స్కోర్‌తో మంచి యూనివర్సిటీల్లో సీట్లు పొందుతున్నారు. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌సైన్స్‌, మ్యాథ్స్‌, సైకాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎడ్యుకేషన్‌ ఇలా ఎంఎస్‌ స్పెషలైజేషన్‌ను అనుసరించి వెర్బల్‌, క్వాంటిటేటివ్‌ విభాగాల్లో విడివిడిగా సాధించిన స్కోర్‌కు, ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
పరీక్ష విధానం
జీఆర్‌ఈ జనరల్‌ పరీక్షలో భాగంగా అనలిటికల్‌ రైటింగ్‌, వెర్బల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఎనలిటికల్‌ రైటింగ్‌లో భాగంగా రెండు ప్రశ్నలు రెండు విభాగాల్లో ఉంటాయి. ఏదైనా అంశంపై ప్రశ్న ఇచ్చి దాన్ని విశ్లేషించమంటారు వ్యవధి 30 నిమిషాలు. మరో ప్రశ్న ఏదైనా అంశానికి సంబంధించి వాదన ఉంటుంది. వ్యవధి 30 నిమిషాలు. వెర్బల్‌ రీజనింగ్‌లో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌ నుంచి 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి సెక్షన్‌కూ 30 నిమిషాలు కేటాయించారు. అలాగే క్వాంటిటిటేవ్‌ రీజనింగ్‌లోనూ రెండు సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సెక్షన్‌కు వ్యవధి 35 నిమిషాలు.
స్కోర్‌ స్కేల్‌: వెర్బల్‌ రీజనింగ్‌ 130 -170, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ 130 - 170, ఎనలిటికల్‌ రైటింగ్‌ 0 - 6 మధ్య స్కోర్‌ స్కేల్‌ ఉంటుంది.
బీ-స్కూల్స్‌కూ ఇదే ఆధారం
సాధారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి జీఆర్‌ఈ రాస్తుంటారు. ఇటీవల కాలంలో అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు జీఆర్‌ఈ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరడానికీ అనుమతిస్తున్నాయి. హార్వర్డ్‌, స్టాన్‌ఫోర్డు, యేల్‌, పెనిసిల్వేనియా, కొలంబియా, కాలిఫోర్నియా యూనివర్సిటీ (బెర్క్‌లీ), ఇన్‌సీడ్‌ (సింగపూర్‌, ఫ్రాన్స్‌) వంటి విదేశీ టాప్‌ యూనివర్సిటీలతోపాటు దేశీయ యూనివర్సిటీలు జీఆర్‌ఈ స్కోర్‌తో ప్రవేశాలు ఇస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ జీఆర్‌ఈని పరిగణనలోకి తీసుకుంటోంది.
ఎలా సిద్ధం..?
ఇంజినీరింగ్‌ లేదా నాన్‌ ఇంజినీరింగ్‌ నేపథ్యం ఉన్న భారతీయ విద్యార్థుల్లో ఎక్కువమంది జీఆర్‌ఈలోని వెర్బల్‌ సెక్షన్లను కొంత కఠినంగా భావిస్తున్నారు. కానీ వెర్బల్‌ రీజనింగ్‌ అనేది ఇంగ్లిష్‌ భాషా పరిజ్ఞానాన్నో, నేరుగా పదజాల సామర్థ్యాన్నో పరీక్షించేది కాదని గుర్తించాలి. ఇది విద్యార్థుల భాషానైపుణ్యాలను ఉపయోగించి విద్యార్థుల లాజిక్‌, రీజనింగ్‌లను పరీక్షించేది. ఈ సెక్షన్‌కు అవసరమైన నైపుణ్యాలపై పట్టు పెంచుకుంటే మంచి స్కోరు పొందటం కష్టమేమీ కాదు. దీనికి బాగా చదివే అలవాటు అవసరం. ఆ పఠనం వార్తాపత్రికను తిరగేసినట్టు కాకుండా నిర్దిష్టంగా శ్రద్ధతో కేంద్రీకృతంగా సాగాలి. అప్పుడే అక్కడి విషయంపై అవగాహన వచ్చి, దాన్ని జవాబుగా మలచటానికి వీలవుతుంది.
అనలిటికల్‌ రైటింగ్‌లోని ఎస్సేల ద్వారా విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేయరు. ఆ టాపిక్‌లన్నీ జీఆర్‌ఈ వెబ్‌సైట్లోనే ఉంటాయి. కంప్యూటర్‌ ఆ ఎస్సేల నిధిలోంచి రాండమ్‌ గా ఎంచుకుని, చూపిస్తుంది. వాదనను నిర్మించటం, అర్థవంతమైన చర్చ తీరును ఎస్సేల ద్వారా అంచనా వేస్తారు. నమూనా ఎస్సేలు వ్యాసాలను ఎలా రూపొందించుకోవచ్చో అవగాహన ఏర్పరుస్తాయి. వివిధ రకాల ఎస్సేలను సాధన చేసి, అనుభవజ్ఞులతో దిద్దించుకుని, వారి సూచనలు తీసుకుని పాటించటం మేలు. ఆ విధంగా లోపాలను సవరించుకుని రాసే తీరును గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు.
జీఆర్‌ఈ క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ ఇంజినీరింగ్‌, సైన్స్‌ నేపథ్యం లేనివారు క్లిష్టంగా భావిస్తుంటారు. కానీ ఇది పదో తరగతి స్థాయిలోనే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కృషిచేస్తే ఏ విద్యార్థికైనా ఇది సులువుగానే ఉంటుంది. రీజనింగ్‌ టెస్ట్‌ కాబట్టి ఫార్ములా కంటే సరైన లాజిక్‌ను అన్వయించటంపైనే శ్రద్ధ పెట్టటం ముఖ్యం.

Posted on 12.07.2018

 


Ask the Expert
Click Here..