అమెరికా చదువులపై అవగాహన లేక...

* 5 వేల కోట్ల వృథా
* కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, ఫ్లోరిడాల్లోనే మన విద్యార్థులు

ఈనాడు - అమరావతి: అమెరికా చదువులపై మన విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో రుసుముల రూపంలో ఏటా రూ.5వేల కోట్ల వరకూ అదనంగా చెల్లిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అక్కడ ఉన్నత విద్యకు ఫెలోషిప్‌, ఉపకార వేతనం పొందగలిగితే అక్కడ చట్టబద్ధంగా పనిచేసే అవకాశం లభించడంతోపాటు నెలకు 1000 డాలర్ల వరకు వేతనం లభిస్తుందని వివరిస్తున్నారు. కానీ అవగాహన కొరవడి మన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలేదనేది నిపుణుల మాట.

‘‘అమెరికాలో దాదాపు 4,800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మన దేశం నుంచి వెళ్తున్న విద్యార్థుల్లో 2/3వ వంతు మంది కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, ఫ్లోరిడాల్లోనే చదువుతున్నారు. కంప్యూటర్‌ సైన్సుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో కళాశాలలో కోర్సుల వారీగా 10-20 వరకు ఫెలోషిప్‌లు, ఉపకార వేతనాలు ఉంటాయి. పోటీ కారణంగా వీటిల్లో 2-3 మాత్రమే మనవారికి లభిస్తున్నాయి. విద్యార్థులు ఇతర వర్సిటీల గురించి తెలుసుకుని వాటిలో చేరితే మరిన్ని ఫెలోషిప్‌లు, ఉపకార వేతనాలు పొందడానికి అవకాశాలు పెరుగుతాయి. దీంతో రాష్ట్ర సంపద మిగులుతుంది. అమెరికాలో ఇతర వర్సిటీలూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి’’
- కుమార్‌ అన్నవరపు, ఇండో అమెరికన్‌ స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్

అమెరికా చదువులపై మన రాష్ట్ర విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో రుసుముల రూపంలో ఏటా రూ.5 వేల కోట్ల వరకూ అదనంగా చెల్లిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ‘‘అమెరికాలో వేల సంఖ్యలో మంచి విశ్వవిద్యాలయాలు ఉన్నా.. మన విద్యార్థులు ఎక్కువగా వందలోపు విశ్వవిద్యాలయాలనే ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో ఆయా కళాశాలల్లో ఫెలోషిప్‌లు, ఉపకార వేతనాలకు వీరి మధ్య పోటీ ఎక్కువగా ఉంటోంది. ఒక్కో కళాశాల నుంచి మన విద్యార్థులు ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతున్నారు. ఎక్కువ మంది ఈ అవకాశాన్ని పొందలేకపోతున్నారు’.. అనేది వీరి అభిప్రాయం.

ఉదాహరణ ఇదిగో..
టెక్సాస్‌లోని కింగ్స్‌విల్లేలో మొత్తం జనాభా 14 వేలు కాగా.. ఇక్కడ టెక్సాస్‌ ఎ అండ్‌ ఎం కింగ్స్‌విల్లే వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు సుమారు 9 వేల మంది. వీరిలో మన దేశీయులు 6 వేల వరకు ఉంటే అందులో 4 వేల మంది తెలుగువారే. ఒకే వర్సిటీలో ఎక్కువగా మన విద్యార్థులు చేరుతున్నారనేందుకు ఈ సంఖ్య నిదర్శనమని ఇండో అమెరికన్‌ స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ కుమార్‌ అన్నవరపు చెబుతున్నారు.

ఈ పరిస్థితిలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి ‘అమెరికాలో ఉన్నత విద్య-నైపుణ్య సదస్సు’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అగ్రరాజ్యంలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలపై ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది 100 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వీటిని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి విడత 30 కళాశాలల్లో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 15 కళాశాలల్లో పూర్తిచేశారు. ఇంజినీరింగ్‌ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు.

అమెరికాలో ఏఏ వర్సిటీలు నాణ్యమైన విద్య, కోర్సులను అందిస్తున్నాయో ఈ సదస్సుల్లో వివరిస్తున్నారు. అక్కడి విద్యపై అవగాహన కల్పించే ప్రత్యేక పుస్తకాన్నీ పంపిణీ చేస్తున్నారు. రుసుముల భారాన్ని తగ్గించుకోవడానికి అందుబాటులో ఉన్న ఫెలోషిప్‌లు, ఉపకార వేతనాల వివరాలను అందిస్తున్నారు.

Posted on 21.08.2018

 


Ask the Expert
Click Here..