సరైన విద్యాసంస్థ ఎంపికకు చేయూత

* ఉచిత సలహాల కోసం వై-యాక్సిస్‌తో ఒప్పందం
* ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ఏర్పాటు
* స్పందన ఆధారంగా ఇతర రాష్ట్రాలకు విస్తరణ
* ‘ఈనాడు’తో అమెరికా విద్యా, సాంస్కృతిక వ్యవహారాల సహాయ అధికారి కార్ల్‌ ఆడమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘అమెరికా వెళ్లే విద్యార్థులు చదువుకోవడ‌మే ప్రధాన అంశంగా ఉండాలి. విద్యా సంవత్సరం ఆరంభానికి కనీసం అయిదారు నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించాలి. పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాకే విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవాలి’ అని అమెరికా విద్యా, సాంస్కృతిక వ్యవహారాల సహాయ అధికారి కార్ల్‌ ఆడమ్‌ చెప్పారు.
ఏప్రిల్ 18న‌ హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. అమెరికా అధికారిక వెబ్‌సైట్స్‌ను చూడాలని, కాన్సులేట్‌ కేంద్రాలు, రాయబార కార్యాలయాలతోపాటు అమెరికా కార్నర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలను సంప్రదించాలని చెప్పారు. విద్యార్థులు మోసపోకుండా చూసేందుకు సరైన సహాయ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
‘‘భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చే వారిలో అత్యధిక శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే ఉంటారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సహకరించేందుకు వీలుగా మరో సంస్థను ఎంపిక చేశాం. విద్యార్థులకు ఉచితంగా సలహాలు ఇచ్చేందుకు వై యాక్సిస్‌ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నాం. దేశం మొత్తం మీద ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విద్యా సంస్థను ఎంచుకోవటం ఎలా? ఎలాంటి ధ్రువపత్రాలు అవసరం? ఇంటర్వ్యూ సమయంలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలి? తదితర అంశాలపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈ కేంద్రంలో విధులు నిర్వహించే అయిదుగురు శిక్షకులకు (ట్రైనర్స్‌)లకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చాం. విద్యార్థులు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించి మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్‌ను ఎంపిక చేశాం.
భారత సంస్కృతిని కోరుకుంటున్నాం
భారతదేశం-అమెరికా సంబంధాలు దశాబ్దాలుగా బలోపేతమవుతున్నాయి. అమెరికా తరగతి గదులకు ఇక్కడి విద్యార్థులను ఆహ్వానిస్తున్నాం. ఇక్కడి విభిన్న సంస్కృతులను అమెరికా కోరుకుంటోంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి నాలుగు కుటుంబాల్లో కనీసం ఒకరు అమెరికాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది మా ప్రభుత్వ నిర్ణయం. విద్యార్థులను అవమానించాలని కానీ, వారికి నష్టం కలిగించాలని గానీ అమెరికా ప్రభుత్వానికి లేదు. నేను ఈ దేశంలో ఉంటే ఇక్కడి నిబంధనలు పాటించాలి. మీరు అక్కడికి వెళితే అక్కడి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. రూ.లక్షలు, విలువైన సమయాన్ని కోల్పోకుండా ఉండాలంటే సరైన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవటం తొలి మెట్టు. దాని పైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న అంశాన్ని మరవకూడదు. ప్రస్తుతం అమెరికాలో వివిధ దేశాలకు చెందిన పది లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి ఆరుగురులో ఒకరు భారతీయులు కావటం విశేషం.
పరిశీలనలో అమరావతి, విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, విశాఖపట్నం నగరాలకు విస్తరించాలన్న యోచనలో ఉన్నాం. పైలెట్‌ ప్రాజెక్టుగా తొలుత హైదరాబాద్‌లో ప్రారంభించాం. ఈ ప్రయోగం సఫలమైతే దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాలన్నది మా ఆలోచన. ప్రైవేటు కన్సల్టెన్సీలను ప్రోత్సహించే ఆలోచన మాకు లేదు. మొదటి నుంచి ఆ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఎంతో వ్యయ, ప్రయాసలకు ఓర్చి విద్యార్థులకు సరైన సలహాలు ఇచ్చేందుకు వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ ఫౌండేషన్‌తో జత కట్టాం. వీరు అందించే సేవలన్నీ ఉచితమే.
నిజాయతీ ముఖ్యం
అమెరికా వెళ్లాలన్న ఆత్రుతతో విద్యార్థులు దరఖాస్తుల భర్తీలో అవాస్తవాలు నమోదు చేస్తుంటారు. అక్కడే ఎక్కువ మంది విద్యార్థుల వీసాలు తిరస్కారానికి గురి అవుతాయి. చదువుకునేందుకు వెళ్తుంటే అదే ప్రధానాంశంగా ఉండాలి. ఇంటర్వ్యూ సమయంలో అడిగే ప్రశ్నలకు నిజాయతీతో సమాధానాలు చెప్పాలి. నిర్ధారిత గడువు ముగిసిన తరవాత మాతృదేశానికి తిరిగి వెళతానన్న విషయాన్ని కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.

Posted on 19.04.2019

 


Ask the Expert
Click Here..