ముందస్తు కసరత్తు ముఖ్యం

కాలిఫోర్నియాలో ట్రైవాలీ, వాషింగ్టన్‌ శివారులో ఉత్తర వర్జీనియా... ఇలా కొన్ని విశ్వవిద్యా లయాలు మూతపడటం మూలంగా విద్యార్థులు అవస్థలపాలవుతున్నారు. అయినప్పటికీ అమెరికా విద్యపై ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రాథమికాంశాలపై అవగాహన, తగిన ముందస్తు విచారణ, మెలకువలు పాటించి విద్యాసంస్థలూ, కోర్సులను ఎంచుకోవాల్సివుంది. తర్వాతి కాలంలో ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఇది అనివార్యం!

విద్యాభ్యాసం కోసం యూఎస్‌ఏను ఎందుకు ఎంచుకోవాలనే ప్రశ్నను అక్కడ చదివే విద్యార్థులను అడిగితే సాధారణంగా వచ్చే సమాధానాలు-
* విద్యలో అత్యున్నత నాణ్యత
* ఎన్నో కోర్సులు అందుబాటులో ఉండడం.
* చదివే కోర్సునుంచి ఇతర కోర్సుకూ, ఇతర విద్యాసంస్థలకూ తేలిగ్గా మారగలిగే అవకాశం.
* ట్యూషన్‌, జీవన ఖర్చులు ఎవరికైనా సరిపోయేలా వివిధ స్థాయుల్లో ఉండటం.
* మంచి జీవన ప్రమాణాలు.
* ఎన్నో భారతీయ కుటుంబాలు యూఎస్‌ఏలో స్థిరపడటం.
ఇన్ని అనుకూలాంశాలు ఉండటం వల్ల అమెరికాలో ప్రధానంగా ఉన్నతవిద్య చదవటానికి విద్యార్థులు మొగ్గు చూపిస్తున్నారు.

సకాలంలో...

ప్రతి సంవత్సరం లక్షమందికి పైగా విద్యార్థులు తాము ఇష్టపడే కోర్సులను అభ్యసించడానికి అమెరికా వెళుతున్నారు. ఈ సంఖ్య గత 5 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తోంది. వీసా ఆమోదం పొందినవారి కంటే ఇంటర్వ్యూకు హాజరైనవారు రెట్టింపు సంఖ్యలో ఉంటారు.
అమెరికా విద్యాభ్యాసంపై అభీష్టం ఉన్నవారు తమ కల నెరవేర్చుకోవడానికి మొదట చేయాల్సినది విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవడం. ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వవిద్యాలయాలకు పెద్దఎత్తున దరఖాస్తులు వస్తాయి. ఒకదానికే దరఖాస్తు చేసుకుంటే దానిలో ప్రవేశం దొరుకుతుందన్న హామీ ఉండదు. కాబట్టి చాలామంది విద్యార్థులు ప్రవేశాల కోసం కనీసం 3- 4 విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేస్తుంటారు.
అడ్మిషన్‌ ప్రక్రియ నుంచి వీసా వరకూ కొన్ని నెలల వ్యవధి పడుతుంది. కాబట్టి ముందస్తుగానే దరఖాస్తు చేసుకోవడం వల్ల చివరి క్షణాల్లో సీటు తిరస్కరణకు గురవుతుందేమోన్న ఒత్తిడి ఉండదు.
అమెరికా విశ్వవిద్యాలయాల్లోకి విద్యార్థులను ఏటా రెండుసార్లు ప్రవేశం కల్పిస్తారు. ఇది ఫాల్‌ (సెప్టెంబర్‌), స్ప్రింగ్‌ (జనవరి)ల్లో ఉంటుంది. కొద్ది విశ్వవిద్యాలయాలు వేసవి (మే)లోనూ ప్రవేశాలు కల్పిస్తాయి. అధికశాతం ప్రవేశాలు మాత్రం ఫాల్‌లో జరుగుతాయి. చాలా విశ్వవిద్యాలయాలు అన్ని కోర్సులనూ ఈ కాలంలోనే ప్రారంభిస్తాయి. సెప్టెంబర్‌ నెలలో ప్రవేశాలు పొందినవారు డిగ్రీ తరువాత కాలాతీతం కాకుండా వెంటనే పీజీలో చేరగలుగుతారు.
గడువు తేదీ విశ్వవిద్యాలయాల దరఖాస్తుల సంఖ్య, పూర్వ దరఖాస్తు ప్రక్రియల ఆధారంగా మారుతూ ఉంటుంది. ఇది వివిధ విభాగాల దరఖాస్తుల పరిశీలన సమయంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఫార్మసీ, హెల్త్‌సైన్సెస్‌, సైన్స్‌ వంటి కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సుల్లో చేరాలనుకునేవారు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
చాలా విశ్వవిద్యాలయాలకు నిధులు వచ్చే సౌకర్యాలు తగ్గిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం కారణంగా గతంతో పోలిస్తే ఇప్పటి విద్యార్థులకు ఉపకార వేతనాల సౌకర్యం తక్కువే. వీటిని ఆశించేవారు గడువుకు చాలా ముందుగా దరఖాస్తు చేసుకోవటం శ్రేయస్కరం.
చాలా విశ్వవిద్యాలయాల్లో స్కాలర్‌షిప్‌లతో కూడిన దరఖాస్తుల గడువుతేదీ వేరేగా ఉంటుంది. వీటిని వెబ్‌సైట్లలో ప్రస్తావించరు. అందుకే ఉపకార వేతనాలు, ఇతర రాయితీల కోసం ముందుగానే దరఖాస్తు చేయటం అత్యంత ముఖ్యం.

వీసాకు అధిక వ్యవధి

విద్యార్థి వీసా (ఎఫ్‌ 1) పొందడానికి చాలా సమయం తీసుకుంటుంది. దరఖాస్తు నుంచి వీసా పొందడానికి సుమారు 3 -6 నెలల వ్యవధి అవసరమవుతుంది. ఒక్కోసారి ఇంకా ఎక్కువ కాలం కూడా తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ ప్రక్రియ వేగంగా జరగవచ్చు.
మొదటి అడుగు: ఉన్నత చదువులకు యూఎస్‌ఏ వెళ్లాలనుకునే విద్యార్థి ప్రవేశానికి అవసరమైన GRE, TOEFL, IELTS ట్రాన్‌స్క్రిప్ట్స్‌, రెకమండేషన్‌ లెటర్స్‌, ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లు మొదలైనవాటి గురించి అవగాహనతో ఉండాలి. ఈ పరీక్షలకు, డాక్యుమెంట్ల తయారీకి వ్యక్తిని బట్టి 3-8 వారాల సమయం పడుతుంది.
రెండో అడుగు: విశ్వవిద్యాలయాల ఎంపిక విద్యార్థుల పర్సంటేజీ, TOEFL, GRE మొదలైన వాటిపై ఆధారపడివుంటుంది. ఒక విశ్వవిద్యాలయానికే దరఖాస్తు చేస్తే ప్రవేశం దొరుకుతుందన్న నమ్మకం లేదు కాబట్టి, అర్హత సాధించగల విశ్వవిద్యాలయాలను ఎంచుకుని వాటన్నింటికీ దరఖాస్తు చేసుకోవడం మేలు. ఖరారుగా ప్రవేశం (I 20)పొందగలిగినవి ఒకటి కంటే మించి విద్యాసంస్థలకు దరఖాస్తు చేయడం మేలు.
మూడో అడుగు: ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించి, అవసరమైన పత్రాలను విశ్వవిద్యాలయాలకు పంపించాలి. దరఖాస్తు చేసుకోవడం నుంచి ప్రవేశం పొందడం వరకూ సుమారు 2 -4 నెలల వ్యవధి పడుతుంది. ఇది ఆ విశ్వవిద్యాలయం స్థాయి, ర్యాంకుపై ఆధారపడి ఉంటుంది. యూఎస్‌ఏ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు వివిధ అంశాలతో సంబంధమున్న సంక్లిష్ట ప్రక్రియగా చెప్పుకోవచ్చు.
గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్స్‌, ట్రాన్స్‌క్రిప్ట్స్‌ ఇవాల్యూయేషన్‌, జీపీఏ లెక్కింపు, విభాగాల సమీక్ష మొదలైన వివిధ విభాగాలు విద్యార్థులు పంపుకునే ప్రతి ఫైలునూ సమీక్షిస్తాయి. తరువాత ఇమిగ్రేషన్‌ విభాగం I 20 విషయం పరిశీలిస్తుంది. ఇలా అడ్మిషన్‌ ఖరారు ప్రక్రియ చాలా వ్యధి తీసుకుంటుంది.
దరఖాస్తును పరిశీలించడానికీ, I 20ను ఖరారు చేయడానికీ విశ్వవిద్యాలయాలు తగిన సమయం తీసుకుంటాయని విద్యార్థులు తప్పకుండా అవగాహనతో ఉండాలి. I 20 ఖరారయ్యాక కూడా ఆ విషయం విద్యార్థులకు ఏర్‌ మెయిల్‌ ద్వారా చేరవేయడానికి సుమారు 20 రోజులు పడుతుంది.
ఫాల్‌ ప్రవేశాల ప్రత్యేకత ఏమిటంటే... ఇవి విద్యార్థులకు అడ్మిషన్‌తోపాటు ఆర్థిక సహాయం, అసిస్టెంట్‌షిప్‌, స్కాలర్‌షిప్‌, క్యాంపస్‌లోనే వసతి వంటి ఇతర అవకాశాలనూ కల్పిస్తాయి. ముందు దరఖాస్తు చేసుకున్నవారికే ప్రవేశాల్లో ప్రాధాన్యం అనే సూత్రాన్నివిశ్వవిద్యాలయాలు పాటిస్తాయి. అందుకని- అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవటం విస్మరించకూడని అంశం. విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులు వస్తాయి. కాబట్టి అర్హతలున్న విద్యార్థులందరికీ ఇంటర్నేషనల్‌ అడ్మిషన్స్‌ విభాగం ప్రవేశాలూ, ఉపకార వేతనాలూ మొదలైనవాటిని ఖరారుగా ఇచ్చే అవకాశం లేదు. పరిమిత సీట్లూ, పరిమిత ఆర్థిక వనరులూ, అసిస్టెంట్‌షిప్‌ ఆప్షన్లు ఉండటమే దీనికి కారణం.
ఒకవేళ విద్యార్థి ముందుగా నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే దరఖాస్తు చేసుకున్నట్లయితే కోరుకున్న విశ్వవిద్యాలయంలోనే అడ్మిషన్‌ పొందే అవకాశాలు ఎక్కువ. అదే విద్యార్థి అదే విశ్వవిద్యాలయానికి కొంత ఆలస్యంగా ఫిబ్రవరి నెలలో దరఖాస్తు చేసుకుంటే అడ్మిషన్‌ పొందే అవకాశం తగ్గిపోతుంది. విశ్వవిద్యాలయం నుంచి నిధులు, అసిస్టెంట్‌షిప్‌ పొందిన విద్యార్థులు యూఎస్‌ ఎంబసీ నుంచి కూడా అనుకూల ఫలితం పొందే పొందే వీలుంది. I 20తోపాటు ఉపకార వేతనం పొందిన విద్యార్థులకు వీసా వచ్చే అవకాశం మెరుగవుతుంది. అడ్మిషన్‌ పొందిన తరువాతి దశ వీసా సాధించడమే. I 20తోపాటు స్కాలర్‌షిప్‌ ఉన్నట్లయితే వీసా పొందే అవకాశాలు పెరిగినట్లేనని నిశ్చయంగా చెప్పవచ్చు. అడ్మిషన్‌ పొందిన తరువాత వీసా సన్నద్ధతకు విద్యార్థులకు తగినంత సమయం ఉంటుంది. అభ్యర్థి ఆర్థిక సంబంధ పత్రాలతోపాటు వీసా ఇంటర్వ్యూకు కూడా సన్నద్ధమవ్వాలి.Ask the Expert
Click Here..