STEM కోర్సులు కళకళ!

అమెరికా విద్యపై ఆసక్తి ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయాల ఎంపిక మొదలు వీసా పొందే విషయంలో మనరాష్ట్రానికి చెందిన చాలామంది చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్‌ స్టేట్స్‌-ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ రేణుకా రావు హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా 'చదువు'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు...

ప్రశ్న: ఉన్నత విద్యను అభ్యసించాలన్న 'అమెరికా కలలు' సాకారం కావటంలో రాష్ట్ర విద్యార్థులకు ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి?

జవాబు: ప్రధానమైనది ఆంగ్లంపై పట్టులేకపోవటం. ముందు నుంచే ప్రణాళికాబద్ధమైన ఉత్తీర్ణత లేకపోవటం మరో కారణం. వీసా పొంది అమెరికా విద్యాసంస్థల్లో చేరినా అక్కడి తరగతుల్లో చెప్పిన పాఠాలు ఆశించిన స్థాయిలో ఆకళింపు చేసుకోలేకపోతున్నారు.వీటి నుంచి గట్టెక్కాలంటే ఇంగ్లిష్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి. అనర్గళంగా మాట్లాడగలగాలి. రచనాపటిమ అలవర్చుకోవాలి. అధిక శాతం మంది మాస్టర్‌ డిగ్రీ కోసం ప్రయత్నిస్తుంటారు. అందులో థీసిస్‌ రాయాల్సి ఉంటుంది. ఆంగ్ల భాషపై పట్టులేనప్పడు అది కష్టమవుతుంది. డిగ్రీ స్థాయిలోనూ ప్రణాళికాబద్ధమైన ఉత్తీర్ణత లోపిస్తోంది.
ఇంజనీరింగ్‌ విద్యార్థులను తీసుకుంటే మొదటి రెండు సంవత్సరాల్లో ఎక్కువ సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్‌ ఉంటున్నాయి. నాలుగు సంవత్సరాల్లో ఒత్తిడికి లోనవుతుంటారు. విద్యార్థిలో క్రమానుగత ఉత్తీర్ణత ఉందా, లేదా అన్న అంశానికి అమెరికా విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యం ఇస్తాయి.

ప్ర: ఆటంకాల్లేకుండా వీసాను పొందాలంటే ఎలాంటి ముందస్తు కసరత్తు చేయాలంటారు?
జ: ఇక్కడ కూడా ఆంగ్లమే కీలకం. ఇంటర్వ్యూ అధికారి అడిగిన ప్రశ్నలను అర్ధం చేసుకోలేక సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఒకవేళ సమాధానాలు చెప్పినా అధిక శాతం విద్యార్థులు అవును, కాదు అన్నట్లుగా పొడిపొడి సమాధానాలు చెపుతున్నారు. ఇలా ఇంటర్వ్యూ అధికారులు ఒప్పించలేకపోతున్నారు. సమాధానాలు స్పష్టంగా ఉండాలి. 'విద్యాభ్యాసం ఖర్చులు ఎవరు భరిస్తారు? ఎలా' అని ప్రశ్నిస్తే 'తండ్రో అన్నో' అని చెబుతారు. వారు ఏమి చేస్తారు అంటే వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం అని చెబుతుంటారు. అలా కాదు. వ్యాపారం అంటే ఏమి చేస్తారు అన్నది స్పష్టంగా చెప్పాలి. స్పష్టంగా చెప్పటం ద్వారా మన సామర్ధ్యం, పటిష్ఠత ఏపాటిదో అన్నది అధికారులకు అర్థం అవుతుంది. వారిలో మనపై నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది.

ప్ర: అమెరికాలోని విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవటం; అక్కడ చేయాల్సినవి, చేయకూడనివి- వీటిపై మీరేమి సలహాలు ఇస్తారు?
జ: ఏమి చదవాలి? ఎక్కడ చదవాలి? అన్న అంశాలపై ఇటు విద్యార్థులకూ, అటు కుటుంబ సభ్యులకూ స్పష్టత ఉండాలి. ఎవరో చెప్పిన విషయాలను నమ్మకూడదు. ఆయా అంశాలపై అధ్యయనం చేయండి. అందుకు మా వంతు సహకారాన్నీ అందిస్తున్నాం.
* సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయిదు గంటల మధ్యలో 1800 103 1231 టోల్‌ ఫ్రీ నెంబరులో సుశిక్షితులైన సలహాదారులు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించవచ్చు.
* అమెరికా ప్రభుత్వం నిర్వహిస్తున్న www.usief.org.in లేదా www.educationusa.state.gov వెబ్‌సైట్లను చూడవచ్చు.
* విద్యావకాశాలకు సంబంధించిన అమెరికాలోని ప్రయివేటు సంస్థ నిర్వహించే www.petersons.comలో బోలెడంత సమాచారం లభిస్తుంది.
* చేరబోయే విశ్వవిద్యాలయానికి అనుమతి (అక్రిడిటేషన్‌) ఉందా? లేదా చూసుకోండి.
భారత్‌ ఇంజనీరింగ్‌కు 'ఏఐసీటీఈ' మాదిరిగా అమెరికాలో 'ఎబిఈటీ', 'ఏఏసీఎఫ్‌టీ' ఇలాంటివి ఉన్నాయి. ఆయా విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకునేందుకు అనుమతి ఉందా లేదా పరిశీలించండి. ఆర్థిక పరిస్థితిని ముందు నుంచే ప్రణాళిక చేసుకోండి. ఒకరోజు కోసం అప్పులు తెచ్చి బ్యాంకుల్లో జమ చేసే విధానాలను వీడండి. కనీసం 12 నుంచి 18 నెలల ముందు నుంచే కసరత్తు చేయండి. ప్రణాళికను రూపొందించుకోండి.

ప్ర: ఎలాంటి కోర్సులు విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటాయి?
జ: స్టెమ్‌ ఫీల్డ్స్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మాథమేటిక్స్‌) కోర్సులకు మెరుగైన అవకాశాలున్నాయి. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్‌కి అనూహ్యమైన డిమాండ్‌ ఉంది. చొరవ, ధైర్య సాహసాలున్నవారికి ఈ కోర్సు చాలా ఉపయుక్తం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రిస్క్‌ తీసుకోవాల్సి ఉంటుంది. సముద్రాలకు వెళ్లాల్సి వస్తుంది. పెట్రోలియం ఇంజనీరింగ్‌లో కూడా ఎన్నో స్పెషలైజేషన్లు ఉన్నాయి. విద్యార్థులు జాగరూకతతో కోర్సులను ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ప్ర: ఏపీ విద్యార్థులకు మీ సూచనలు ఏమిటి?
జ: ఎంతో వ్యయ ప్రయాసలతో కసరత్తు చేస్తున్నారు. ముందస్తుగా మీ ఆంగ్లభాషకు పదును పెట్టండి. అవసరమైన ప్రత్యేక శిక్షణ పొందండి. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లటం అన్నది జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయం కావటంతో స్వీయ అధ్యయనం, పరిశీలన, ఆకళింపు ముఖ్యం.

- ఐ.ఆర్‌. శ్రీనివాసరావు (ఈనాడు, హైదరాబాద్‌)Ask the Expert
Click Here..