నాణ్యమైన విద్యకు.. కంగారూల నేలకు!

ఇటీవలి కాలంలో భారతీయ విద్యార్థులను ఆస్ట్రేలియా ఎక్కువగా ఆకర్షిస్తోంది. అక్కడికి ఉన్నత విద్యకు వెళ్లే మన వాళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. నాణ్యమైన విద్య, మేటి జీవన ప్రమాణాలు, చదువుకుంటూ పనిచేసుకునే వెసులుబాటు, స్కాలర్‌షిప్పులు, పోస్టు స్టడీ వర్క్‌ వీసా, ఉద్యోగాలు, మంచి వేతనాలు, స్థిరపడే అవకాశం... తదితరాలు అందుకు ప్రధాన ఆకర్షణలు.

వివిధ సంస్థలు వెలువరిస్తోన్న ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో టాప్‌-100లో కనీసం 7 సంస్థలు ఆస్ట్రేలియా నుంచి నమోదవుతున్నాయి. ఈ దేశానికి ఏటా ఏడు లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు చదువుల కోసం వెళ్తున్నారు. 2018లో ఉన్నత విద్య కోసం సుమారు లక్ష మంది భారతీయ విద్యార్థులు కంగారూల దేశంలో కాలుమోపారు. వారానికి 20 గంటలు పనిచేసుకునే సౌలభ్యం ఉంది. ఈ దేశ జనాభాలో సగం మంది తల్లిదండ్రులు ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడినవారే. జనాభాలో 60 శాతం మంది వలస వచ్చినవారేనని అక్కడి 2013 లెక్కల ప్రకారం తేలింది. దేశవ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో విద్య లభిస్తుంది.

ప్రవేశాలు.. ఫీజులు..
ప్రపంచంలోని టాప్‌-800 విశ్వవిద్యాలయాల్లో 30 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఈ దేశంలోని యూనివర్సిటీల సంఖ్య 43 మాత్రమే. వీటిలో 40 ఈ దేశానికి చెందిన విశ్వవిద్యాలయాలు, 2 అంతర్జాతీయ యూనివర్సిటీలు, ఒకటి ప్రైవేటు స్పెషాలిటీ సంస్థ. మిగిలినవన్నీ కళాశాలల జాబితాలోకి వస్తాయి. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ ఒక్కటే పార్లమెంట్‌ ద్వారా ఏర్పాటైంది. ఫీజులను ఆయా విశ్వవిద్యాలయాలే నిర్ణయిస్తాయి. ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఇక్కడ రెండేళ్ల పీజీ కోర్సులకు అన్నీ కలిపి సుమారు రూ.40-50 లక్షలు అవసరమవుతాయి. ఒక్కో సంస్థకు దరఖాస్తు చేసుకోవడానికి మన కరెన్సీలో దాదాపు రూ.అయిదు వేల వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పీజీ కోర్సులకు సగటున 20,000 నుంచి 60,000 ఆస్ట్రేలియన్‌ డాలర్ల ఫీజు ఉంటుంది. భారత కరెన్సీలో దాదాపు రూ.పది లక్షల నుంచి రూ.ముప్పై లక్షలు వెచ్చించాలి. వెటర్నరీ, మెడికల్‌, మరికొన్ని కోర్సులకు ఇంతకంటే పెద్ద మొత్తంలోనే అవసరం కావచ్ఛు వసతి, భోజనం, ఇతర దైనందిన ఖర్చుల కోసం ఏడాదికి రూ.పది లక్షలు అవసరమవుతాయి.

ప్రసిద్ధి పొందిన విభాగాలు
కంప్యూటర్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, బయో మెడికల్‌ సైన్స్‌, డేటా సైన్స్‌, ప్రొఫెషనల్‌ ఇంజినీరింగ్‌, న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌, ఫార్మసీ, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, ఎనలిటిక్స్‌, ఇన్ఫర్మేటిక్స్‌, హెల్త్‌ సైన్స్‌, అకౌంటెన్సీ, యాక్చూరియల్‌ సైన్స్‌, ఆర్కిటెక్చర్‌, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌, కోర్‌ ఇంజినీరింగ్‌, ఎర్త్‌ సైన్సెస్‌, సైకాలజీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో కోర్సులు ప్రసిద్ధి పొందాయి. చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

కావాల్సిన అర్హతలు
ఇంజినీరింగ్‌ కోర్సులకు బ్యాచిలర్స్‌ స్థాయిలో (బీటెక్‌) కనీసం 65 శాతం మార్కులు ఉండాలి. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ కోర్సులకు 55 శాతం అవసరమవుతాయి. మూడేళ్ల బ్యాచిలర్‌ కోర్సులు చదివినవారికి పీజీలో చేరడానికి అవకాశం ఉంది. ఆంగ్ల ప్రావీణ్యానికి సంబంధించి టోఫెల్‌ 80 లేదా ఐఈఎల్‌టీఎస్‌ 6.5 లేదా పీటీఈ 58 స్కోర్‌ ఉండాలి. ఎంచుకున్న కోర్సు, సంస్థను బట్టి పర్సంటేజీలు, స్కోర్ల విలువల్లో మార్పులు ఉంటాయి. మేటి సంస్థల్లో ప్రవేశాలకు ఇంతకంటే ఎక్కువ స్కోరు అవసరమవుతుంది. ఇక్కడ ఎంఎస్‌ కోర్సులకు జీఆర్‌ఈ తప్పనిసరి కాదు.

1100 సంస్థలు... 22000 కోర్సులు...
విదేశీ విద్యార్థుల ప్రాధాన్యాల్లో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. చైనా తర్వాత భారత్‌ నుంచే ఎక్కువ మంది ఈ దేశంలో చదవడానికి వెళ్తున్నారు. మొత్తం 1200+ సంస్థలు దాదాపు 22,000 కోర్సులు అందిస్తున్నాయి. ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, క్లినికల్‌, ప్రి క్లినికల్‌ అండ్‌ హెల్త్‌ కోర్సులు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాయి. విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏటా 20 కోట్ల ఆస్ట్రేలియన్‌ డాలర్లను స్కాలర్‌షిప్పుల రూపంలో అందిస్తోంది. ఆస్ట్రేలియన్‌ అవార్డ్స్‌, స్కాలర్‌షిప్స్‌, ఎండీవర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌ అవార్డ్స్‌, ఇంటర్నేషనల్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ రిసెర్చ్‌ స్కాలర్‌షిప్స్‌, డెస్టినేషన్‌ ఆస్ట్రేలియా అవార్డ్స్‌, రిసెర్చ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌ స్కాలర్‌షిప్స్‌.. అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీల వారీ స్కాలర్‌షిప్పులూ ఉన్నాయి. మెరిట్‌ ప్రదర్శిస్తే వాటిని దక్కించుకోవచ్ఛు

మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్‌బేన్‌, కాన్‌బెర్రా, అడిలైడ్‌, పెర్త్‌, గోల్డ్‌ కోస్టు టాప్‌-100 స్టూడెంట్‌ ఫ్రెండ్లీ సిటీస్‌లో చోటు దక్కించుకున్నాయి. వీటిలో మెల్‌బోర్న్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. సిడ్నీ-9, బ్రిస్‌బేన్‌-22, కాన్‌బెర్రా -23 స్థానాలు పొందాయి. ఫినాన్షియల్‌, బిజినెస్‌ కన్సల్టింగ్‌, మెటల్‌, మైనింగ్‌, ఎనర్జీ, యుటిలిటీస్‌, మెటీరియల్‌, హెల్త్‌కేర్‌ విభాగాల్లో పలు సంస్థలు ఈ దేశంలో వెలిశాయి.

ఆస్ట్రేలియాలో రెండు సీజన్లలో ప్రవేశాలు ఉంటాయి. అవి ఫాల్‌ / ఆటమ్‌, వింటర్‌ / స్ప్రింగ్‌. ఫాల్‌ కోర్సులు ఫిబ్రవరి- మార్చిలో, వింటర్‌ కోర్సులు జులై-ఆగస్టులో మొదలవుతాయి. కొన్ని ప్రొఫెషనల్‌ కోర్సులు ఫాల్‌ సీజన్‌ లోనే అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరిలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. మొదటి సెమిస్టర్‌ ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు, రెండో సెమిస్టర్‌ జులై నుంచి నవంబరు వరకు ఉంటుంది.

ఆస్ట్రేలియాలోని కోర్సుల పూర్తి సమాచారాన్ని www.studyinaustralia.gov.au నుంచి పొందవచ్ఛు.

Posted on 29.10.2019

 

Ask the Expert
Click Here..