Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

NIMCET - 2017

ఎన్ఐటీల్లో ఎంసీఏకు... నిమ్‌సెట్‌

ప్రసిద్ధ సంస్థల్లో ఎంసీఏ కోర్సు చ‌ద‌వాల‌నుకునేవారికి అత్యుత్తమ మార్గం నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్స్ ఎంసీఏ కామ‌న్ ఎంట్రెన్స్‌ టెస్ట్ (నిమ్‌సెట్‌). ఈ ప‌రీక్ష ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న 11 నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌)ల్లో ప్రవేశం ల‌భిస్తుంది. వీటిలో వ‌రంగ‌ల్ ఒక‌టి. దేశంలో 31 జాతీయ సాంకేతిక విద్యా శిక్షణ‌ సంస్థ (నిట్‌)ల్లో 11 ఎంసీఏ కోర్సును అందిస్తున్నాయి. ఈ 11 సంస్థలూ ఉమ్మడి ప‌రీక్ష ద్వారా విద్యార్థుల‌ను ఎంపిక‌చేసి ఎంసీఏ కోర్సులోకి ప్రవేశం క‌ల్పిస్తున్నాయి. ఈ ఏడాది నిమ్‌సెట్‌ను ఎన్ఐటీ దుర్గాపూర్ నిర్వహిస్తోంది.

ఎంసీఏ కోర్సు అందిస్తోన్ననిట్‌లు:
అగ‌ర్తలా, అల‌హాబాద్‌, భోపాల్‌, కాలిక‌ట్‌, దుర్గాపూర్‌, జంషెడ్పూర్‌, కురుక్షేత్ర, రాయ్‌పూర్‌, సూర‌త్కల్‌, తిరుచిరాప‌ల్లి, వ‌రంగ‌ల్‌.

అర్హత‌:
బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీటెక్/ బీఈ వీటిలో ఏదైనా డిగ్రీలో క‌నీసం 60 శాతం మార్కుల‌తో (ఎస్సీ, ఎస్టీలైతే 55 శాతం) ఉత్తీర్ణత సాధించాలి. ఆఖ‌రు సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

సీట్ల సంఖ్య ఇలా:
ఎంసీఏ కోర్సు అందిస్తోన్న 11 ఎన్ఐటీల్లోనూ మొత్తం 815 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లన్నీ రాత‌ ప‌రీక్షలో చూపిన ప్రతిభ‌, రిజ‌ర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న అఖిల భార‌త స్థాయిలో భ‌ర్తీ చేస్తారు. ఆయా నిట్లవారీ రాష్ట్రాల కోటా లేదు. మొత్తం 815 సీట్లలో 396 సీట్లు ఓపెన్ కేట‌గిరీ ద్వారా భ‌ర్తీ అవుతాయి. ఓసీ కోటాలో భ‌ర్తీచేసే సీట్లకు ప‌రీక్ష రాసిన విద్యార్థులంద‌రూ పోటీ ప‌డొచ్చు. 226 సీట్లు ఓబీసీల‌కు, 119 ఎస్సీ విద్యార్థుల‌కు, 59 ఎస్టీల‌కు కేటాయించారు. దివ్యాంగుల‌కు 25 సీట్లు ఉన్నాయి. వ‌రంగ‌ల్ నిట్‌లో మొత్తం 46 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రశ్నప‌త్రం:
మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ప‌రీక్ష వ్యవ‌ధి రెండు గంట‌లు. అంటే ప్రతి ప్రశ్నకు నిమిషం స‌మ‌యం కేటాయించుకోవ‌చ్చు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. స‌బ్జెక్టుల వారీ మ్యాథ‌మెటిక్స్ 50 ప్రశ్నలు, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ & లాజిక‌ల్ రీజ‌నింగ్ 40, కంప్యూట‌ర్ అవేర్‌నెస్ 10, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నల‌డుగుతారు. ప్రతి స‌రైన జ‌వాబుకు 4 మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. త‌ప్పుగా గుర్తించిన ప్రతి స‌మాధానానికీ ఒక మార్కు త‌గ్గిస్తారు.

మార్కుల వెయిటేజీ:
మొత్తం మార్కుల‌ను 1000గా ప‌రిగ‌ణిస్తారు. అంటే మ్యాథ్స్‌లో మొత్తం మార్కుల‌కు 3 రెట్లు, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ & లాజిక‌ల్ రీజ‌నింగ్ మార్కుల‌కు ఒక‌టిన్నర రెట్లు, కంప్యూట‌ర్ అవేర్‌నెస్ విభాగంలో మార్కుల‌కు 2 రెట్లు, ఇంగ్లిష్ మార్కుల‌ను య‌థావిధిగా ఉంచి లెక్కిస్తారు. ఈ లెక్కన మ్యాథ్స్‌కు 600 మార్కుల‌న్నమాట‌. (50 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కాబ‌ట్టి మొత్తం 200 మార్కులు. వీటికి 3 రెట్లు అంటే 600 మార్కులు) అలాగే ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌కి 240 (మొత్తం 40 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కాబ‌ట్టి 160 మార్కులు. వీటికి ఒక‌టిన్నర రెట్లు అంటే 160+80=240 మార్కులు), కంప్యూట‌ర్ అవేర్‌నెస్‌కు 80 (10 ప్రశ్నల‌కు 40 మార్కులు దానికి రెట్టింపు 80), ఇంగ్లిష్ విభాగానికి 80 (20 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కాబ‌ట్టి 80) మార్కులు కేటాయించారు.

ప్రక‌ట‌న స‌మాచారం
ప‌రీక్ష ఫీజు: ఓపెన్‌, ఓబీసీ అభ్యర్థుల‌కు రూ.2000. ఎస్సీ, ఎస్టీల‌కు రూ.1000
ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్లకు చివ‌రి తేదీ: మార్చి 20
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ: మార్చి 31
ప‌రీక్ష: మే 28 (ఆదివారం) ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: వ‌రంగ‌ల్‌
ఫ‌లితాలు: జూన్ 6న ప్రక‌టిస్తారు.
వెబ్‌సైట్‌: http://nimcet2017.nitdgp.ac.in/

ప్రిప‌రేష‌న్ ఇలా..
మొత్తం 1000 మార్కుల్లో 600 మార్కులు అంటే 60 శాతం గ‌ణితానికే కేటాయించారు కాబ‌ట్టి ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించిన‌వాళ్లే సీటు పొంద‌గ‌ల‌రు. ఇంట‌ర్ స్థాయిలో మ్యాథ్స్ అంశాల‌పై ప‌ట్టున్నవారికి ఈ ప‌రీక్షా విధానం ఎంతో సానుకూలాంశం. ఎందుకంటే మ్యాథ్స్ సెక్షన్‌లో ప‌రీక్షకు కేటాయించిన‌ చాప్టర్లన్నీ ఇంట‌ర్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరాల్లోనివే. సిల‌బ‌స్‌లో పేర్కొన్న చాప్టర్లను ఎంసెట్‌, జేఈఈ మెటీరియ‌ల్ సాయంతో చ‌దువుకుంటే పూర్తిస్థాయిలో మార్కులు పొంద‌డం ఖాయ‌మే.

డిగ్రీ స్థాయిలో కంప్యూట‌ర్ సైన్స్ కోర్సు చ‌దువుకున్న విద్యార్థులు కంప్యూట‌ర్ అవేర్‌నెస్ గురించి ప్రత్యేకంగా చ‌ద‌వాల్సిన ప‌నిలేదు. మిగిలిన అభ్యర్థులంతా కంప్యూట‌ర్, ఇంట‌ర్నెట్‌ ప్రాథ‌మికాంశాల‌ను చ‌దువుకోవాలి.

జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, ఎన‌లిటిక‌ల్ ఎబిలిటీ & లాజిక‌ల్ రీజ‌నింగ్ ఈ రెండు అంశాల‌నూ ఐసెట్ స‌న్నద్ధత‌తో ఎదుర్కోవ‌చ్చు. ఈ అంశాల‌పై నిమ్‌సెట్‌తోపాటు ఐసెట్ పాత‌ప్రశ్నప‌త్రాలు, బ్యాంకుల (ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ) ప్రశ్నప‌త్రాల‌ను అధ్యయ‌నం చేస్తే ఎక్కువ మార్కులు సాధించే అవ‌కాశం ఉంది.