ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నత స్థాయి ఉద్యోగానికి... ఏఎఫ్‌క్యాట్‌
* ఎంపికైన‌వారికి ఆక‌ర్షణీయ వేత‌నం...
* పైల‌ట్ అయ్యే అవ‌కాశం...
* విద్యార్థినులూ అర్హులే

సాధారణ డిగ్రీతో ఉన్న మేటి అవ‌కాశాల్లో ఏఎఫ్ క్యాట్ ఒక‌టి. ఖ‌ర్చులేకుండా పైల‌ట్ కావాల‌నుకునేవాళ్లు, ఎయిర్ ఫోర్స్‌లో కెరీర్ ఆశించేవారు త‌ప్పకుండా రాయాల్సిన ప‌రీక్ష ఇది. దీనిద్వారా భారత వైమానిక దళంలో ఫ్లైయింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్‌)ఉన్నతోద్యోగాల‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ పోస్టులకు విద్యార్థినులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో బ్రాంచ్‌ల వారీ అర్హతలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.
ఫ్లైయింగ్‌, గ్రౌండ్ డ్యూటీ (టెక్నిక‌ల్‌, నాన్ టెక్నిక‌ల్‌) బ్రాంచీల్లో ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ఏటా రెండు సార్లు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షే ఏఎఫ్‌క్యాట్. ఏటా జూన్, డిసెంబర్‌ల్లో ఈ ప‌రీక్ష ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. జూన్‌లో వెలువ‌డే ప్రక‌టన‌‌కు ఆగస్టులోనూ, డిసెంబ‌రు ప్రక‌ట‌న‌కు సంబంధించి ఫిబ్రవరిలో ప‌రీక్షలు నిర్వహిస్తారు.

బ్రాంచీల వారీ అర్హతలిలా...
ఫ్లైయింగ్‌ బ్రాంచ్‌
విద్యార్హత: ఈ విభాగంలోని పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్ చదివుండడం తప్పనిసరి. మూడేళ్ల సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.
వయోపరిమితి: జులై 1, 2018 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1994- జులై 1, 1998 మధ్య జన్మించినవారే అర్హులు.
ఎత్తు: కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండరాదు.

గ్రౌండ్ డ్యూటీ - టెక్నికల్ బ్రాంచ్
విభాగం: ఏరోనాటిక‌ల్ ఇంజినీర్ (ఎల‌క్ట్రానిక్స్‌)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా క‌మ్యూనికేష‌న్స్ లేదా కంప్యూట‌ర్ సైన్స్‌... త‌దిత‌ర‌ విభాగాల్లో ఎందులోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు. ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంట‌ర్‌/ +2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగం: ఏరోనాటిక‌ల్ ఇంజినీర్ (మెకానిక‌ల్‌)
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లేదా ఏరోస్పేస్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్స్ మెయింటెన‌న్స్ లేదా మెకానిక‌ల్ లేదా ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్ వీటిలో ఏ విభాగంలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసిన‌వాళ్లు అర్హులు. ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంట‌ర్‌/ +2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: పై రెండు పోస్టుల‌కు జులై 1, 2018 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే జులై 2, 1992- జులై 1, 1998 మధ్య జన్మించినవారే అర్హులు.
ఎత్తు: పురుషులైతే 157.5, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్
ఈ బ్రాంచ్‌లో 4 ఉప విభాగాలున్నాయి. అవి.. 
1. అడ్మినిస్ట్రేషన్ 
2. లాజిస్టిక్స్ 
3. అకౌంట్స్ 
3. ఎడ్యుకేషన్
అడ్మినిస్ట్రేషన్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
లాజిస్టిక్స్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం చదువుతున్నవిద్యార్థులూ అర్హులే.
అకౌంట్స్: 60 శాతం మార్కులతో బీకాం పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే
ఎడ్యుకేషన్: ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణతతోపాటు పీజీలో ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ రిలేష‌న్స్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ స్టడీస్‌, సైకాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్, మాస్ క‌మ్యూనికేష‌న్‌, జ‌ర్నలిజం, ప‌బ్లిక్ రిలేషన్‌, మేనేజ్‌మెంట్‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌...వీటిలో ఏదేని కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన‌వారు, ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: పై నాలుగు పోస్టుల‌కు జులై 1, 2018 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే జులై 2, 1992- జులై 1, 1998 మధ్య జన్మించినవారే అర్హులు.
ఎత్తు: పురుషులు 157.5, మహిళలైతే 152 సెం.మీ ఉండాలి.


ఎంపిక ఇలా...
పైన పేర్కొన్న ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థులందరికీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అంటే ప్రశ్నపత్రం అన్ని విభాగాలకూ ఒక్కటే. టెక్నికల్ బ్రాంచ్‌కి దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈఏటీ) రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్త్లెయింగ్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీబీఏటీ) నిర్వహిస్తారు. అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి ఎంపికవుతారు. వీరు శిక్షణ అనంతరం విధుల్లో చేరతారు.

రాత పరీక్షలో... 
వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలడుగుతారు. ప్రతి ప్రశ్నకూ నాలుగు ఆప్షన్లు ఇస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో... చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ విభాగం నుంచి... కాంప్రహెన్సన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్లిషన్, సిననిమ్స్, యాంటోనిమ్స్, ఒకాబులరీ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ విభాగంలో... సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, రేషియో అండ్ ప్రపోషన్, సింపుల్ ఇంట్రస్ట్ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలుంటాయి. రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగంలో వెర్బల్ స్కిల్స్, స్పేషియల్ ఎబిలిటీ(మెంటల్ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు.
ఈ పరీక్ష ముగిసిన వెంటనే టెక్నికల్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) నిర్వహిస్తారు. వ్యవధి 45 నిమిషాలు.

స్టేజ్ 1, 2 ఇలా...
రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. స్టేజ్ 1 లో ఇంటెలిజెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్ 2కి వెళ్తారు. స్టేజ్ 2లో సైకలాజికల్ టెస్ట్, బృంద పరీక్షలు; ఇంటర్వ్యూలు చేపడతారు. వీటిని విజయవంతంగా పూర్తిచేసుకుంటే ఉద్యోగం ఖాయమైనట్టే. అయితే ఫ్త్లెయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు ఈ దశలో అదనంగా పీఏబీటీ ఉంటుంది. వారు ఇందులో అర్హత సాధిస్తేనే పైలట్ పోస్టులకు ఎంపికవుతారు.

ఎంపికైతే...
అభ్యర్థులకు సంబంధిత బ్రాంచ్‌లో జులై 2018 మొద‌టి వారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్‌, టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీకి ఎంపికైనవారికి 52 వారాలపాటు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదునిస్తారు. ఈ శిక్షణ సమయంలో నెలకు రూ.21,000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు విధుల్లో చేరతారు. ఫ్లైయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి రూ.85372, టెక్నికల్ బ్రాంచ్‌వారికి రూ.74872, గ్రౌండ్ డ్యూటీ పోస్టులకు రూ.71872 చొప్పున ప్రతి నెలా వేతనం చెల్లిస్తారు. వీటితోపాటు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: జూన్‌ 29
ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ తేది: ఆగ‌స్టు 27 (ఆదివారం)
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
వెబ్‌సైట్:  www.careerairforce.nic.in