Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఇంటర్మీడియట్

టెన్త్ తర్వాత - ఇంటర్మీడియట్ గ్రూపులు

'ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా, ఇంటర్మీడియట్‌తోనే ఆరంగేట్రం చేయాలి. అయితే ఇంటర్లో ఏయే గ్రూపులు ఉంటాయి? ఏ గ్రూపు చదివితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? అసలు గ్రూపులను ఎలా ఎంచుకోవాలి? ఇంటర్ తర్వాత ఏం చేయాలి?"... పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మనసులో మెదిలే ప్రశ్నలివి. ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు, గ్రూపు ఎంపికలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండేందుకు అందిస్తున్న సమాచారమిది.
విద్యార్థులు కాస్త తక్కువస్థాయిలోనైనా సాంకేతిక నైపుణ్యం సాధించడానికి ఐటీఐ, దీర్ఘకాలిక సాంకేతిక కోర్సులు చేయాలంటే ఇంటర్ వృత్తి విద్యాకోర్సులు, సాంకేతిక విద్యలో డిప్లొమా కోసం పాలిటెక్నిక్ రంగాలను ఎంచుకుంటారు. అయితే ఉన్నత విద్యలోకి ప్రవేశించేందుకు మాత్రం సాధారణ ఇంటర్మీడియట్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఉన్నత విద్యారంగానికి ఇది 'గేట్ వే' లాంటిది. ఉన్నత విద్యకు వారధి లాంటి ఇంటర్మీడియట్‌లో గ్రూపును ఎంచుకోవడమే అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఈ గ్రూపుమీదే మిగిలిన (ఉన్నత) విద్య అంతా ఆధారపడి ఉంటుంది. విద్యార్థి కెరీర్‌ను నిర్దేశించే కీలకమైన మలుపు కూడా ఈ కోర్సే. పాఠశాలవిద్యకూ, ఉన్నత విద్యకూ మధ్య వారధిలాంటి ఇంటర్లో ఏ గ్రూపులో చేరాలనే విషయమై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్తులో జీవిత గమనాన్ని నిర్దేశించే గ్రూపును ఎంచుకోవడంలో తప్పటడుగు ఏ మాత్రం పనికిరాదు. విద్యార్థులు ఇంటర్లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించగలరో ముందే ఒక నిర్ధరణకు రావాలి.

ఇంటర్మీడియట్‌లో చేరేముందు

విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరేముందు సొంతంగా గ్రూపును ఎంచుకునేందుకు కొన్ని పరిమితులున్నాయి. అవి..
» పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలామందికి ఇంటర్లో ఉండే గ్రూపుల గురించి సరైన అవగాహన ఉండదు. ఏ గ్రూపులో ఏయే సబ్జెక్టులు ఉంటాయో, భవిష్యత్తులో వాటికి ఉన్న ఉపాధి అవకాశాలేమిటో చాలామందికి సరిగ్గా తెలియకపోవచ్చు.
» గ్రూపుల గురించి తెలుసుకున్నా, ఏ గ్రూపులో రాణించగలరనే విషయంలో వారికి ఒక స్పష్టత ఉండకపోవచ్చు.
» సొంతంగా నిర్ణయం తీసుకునేంత వయసు, అనుభవం లేకపోవడంతో తల్లిదండ్రులు, స్నేహితులు ఇచ్చే సలహాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.
» ఇలా అయోమయ పరిస్థితుల్లో ఏదో ఒక గ్రూపును ఎంచుకుంటే తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నింటికీ మించి విలువైన కాలం వృథా అవుతుంది.
ఈ పరిమితులను అధిగమించి, సరైన నిర్ణయం తీసుకోవాలంటే, విద్యార్థి ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ముందే కొంత పరిజ్ఞానం సంపాదించాలి. అంతకంటే ముందు తన బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి అభిరుచి, సామర్థ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా ఏ గ్రూపులో చేరాలనే విషయమై అతడికి సలహా ఇవ్వాలి.

గ్రూపులు - కాంబినేషన్లు

ఇంటర్మీడియట్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. అయితే ఇందులో ఏడెనిమిది కాంబినేషన్లలో మాత్రమే చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. కాలేజీలూ వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి.
కొన్ని ప్రధానమైన గ్రూపులు
» ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
» బీపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
» సీఈసీ (కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్)
» ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్)
» హెచ్ఈసీ (హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్)
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కాంబినేషన్ గ్రూపులు చాలా తక్కువ కళాశాలల్లోనే ఉన్నాయి. ఉదాహరణకు మ్యూజిక్ సబ్జెక్టు విశాఖపట్నంలో మాత్రమే ఉంది. ఈ తరహా కాంబినేషన్లు కొన్ని..
» హిస్టరీ, ఎకనమిక్స్, కామర్స్
» హిస్టరీ, సివిక్స్, సోషియాలజీ
» హిస్టరీ, ఎకనమిక్స్, మ్యూజిక్
» హిస్టరీ, ఎకనమిక్స్, సైకాలజీ
» హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ
» ఎకనమిక్స్, సివిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.
బోర్డు అందిస్తున్న గ్రూపుల్లో పైన పేర్కొన్న పదకొండు గ్రూపుల్లోనే విద్యార్థులు చేరుతున్నారు. వీటిలో ఏ గ్రూపు ఎంచుకోవాలో నిర్ణయించుకునే ముందు విద్యార్థి వివిధ కోణాల్లో ఆలోచించాలి. ముందుగా 'తన అభిరుచి ఏమిటి? లక్ష్యం ఏమిటి? అది సాధించేందుకు ఇప్పటి నుంచి ఏం చేయాలి తదితర ప్రశ్నలకు విద్యార్థి సంతృప్తికరమైన సమాధానాలను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత తన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న గ్రూపును ఎంచుకోవాలి.

ఎంపీసీ

ప్రధానంగా ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకునేవారు; సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి ఎంపీసీ పునాది.
జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి పరీక్ష (జేఈఈ - మెయిన్) రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. బిట్స్‌పిలానీల్లో ప్రవేశానికి జరిగే 'బిట్‌శాట్' రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు.
ఎంసెట్: ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థికి నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో సీటు వస్తుంది. సుమారు 27 ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో ప్రవేశానికి ఎంసెట్ పునాదిలాంటిది.
బి.ఎస్‌సి.: ఇంటర్మీడియట్ తర్వాత బి.ఎస్‌సి.లో చేరాలనుకుంటే మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్.... ఇలా వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.

బీపీసీ

డాక్టర్‌గా లేదా వైద్యసంబంధిత ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చరల్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ చేస్తే ఉన్నత విద్యావకాశాలకూ కొదవ లేదు.
బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఈ శతాబ్దపు పరిశోధనా రంగాలుగా పేర్కొనవచ్చు. రానున్న యుగం బయాలజీదే.
వైద్యవిద్యా కోర్సుల్లో చేరదల్చిన విద్యార్థులు ‘నీట్‌’ ర్యాంకు పొందడం తప్పనిసరి. గతంలో వివిధ పరీక్షలు వివిధ విశ్వవిద్యాలయాలకు జరిగేవి కానీ ఇప్పుడు ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దేశం మొత్తంలో జరిగే పరీక్షలు మూడే. అవి..1) నీట్‌ 2) ఎయిమ్స్‌ 3) జిప్‌మర్‌. నీట్‌తో పోలిస్తే ఎయిమ్స్‌, జిప్‌మర్ ద్వారా ఉండే సీట్ల సంఖ్య చాలా తక్కువ. దేశంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు సంబంధించిన మొత్తం 52,305 సీట్లు నీట్‌ - యూజీలో అర్హులైన విద్యార్థులతోనే భర్తీ చేయాల్సి వుంటుంది. మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు పొందాలన్నా నీట్‌లో అర్హత పొందాల్సిందే. తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థులు వైద్య, దంతవైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం తప్పనిసరిగా నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాయాల్సివుంది. మొదట ఏఐపీఎంటీ రూపంలో ఉన్న ఈ పరీక్ష 2016 నుంచి ‘నీట్‌’గా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు లేదా డీమ్డ్‌ యూనివర్సిటీల్లో సీట్లకు మైనారిటీ సంస్థలతో కలిపి నీట్‌-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరి అయింది.

ఎంఈసీ, సీఈసీ

సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ; కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు; ఇన్స్యూరెన్స్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు.
గణనీయంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం ప్రధానపాత్ర పోషిస్తోంది. దీంతో కామర్స్ విద్యార్థులకు ఎంతో గిరాకీ పెరిగింది. మ్యాథమేటిక్స్, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం మరింత మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నత విద్యకూ అవకాశం ఉంది. ఈ రంగాలపై గత అయిదారేళ్లుగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.

ఆర్ట్స్ గ్రూపులు

పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ తగ్గింది. అయితే, కార్పొరేట్ జూనియర్ కళాశాలలూ యూపీఎస్‌సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తూ ఉండటం మొదలైంది.
దీంతో ఆర్ట్స్ గ్రూపులకు మళ్లీ ఆదరణ పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్ట్స్ గ్రూపుల విషయంలో చరిత్ర పునరావృతమవుతోందా? అనే సందేహం కలుగుతుంది. యూపీఎస్‌సీ నిర్వహించే కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నెన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది.