Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

పాలిటెక్నిక్

ధీమానిచ్చే డిప్లొమాలు!

పదోతరగతి తరువాత వృత్తివిద్యను అభ్యసించాలనుకునే వారికి పాలిటెక్నిక్‌ కోర్సులు ఓ చక్కటి ప్రత్యామ్నాయం. వీటిలో కొన్ని డిప్లొమా పూర్తవడంతోనే మంచి ఉద్యోగావకాశాలనూ కల్పిస్తున్నాయి. అందుకే విద్యార్థులు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. స్పెషలైజ్‌డ్‌ కోర్సులుగా పిలిచే వాటిలో ప్రధానమైన వాటిని తెలుసుకుందాం!

మూస ధోరణిలోనే కాకుండా కొత్త దారుల్లో కెరియర్‌ను మలచుకోవాలనుకుంటున్నవారు తాము ఎంచుకున్న రంగంలో ముందుకు సాగడానికి అదనపు అనుభవం, ముందస్తు పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటివారికి అనుకూలమైనవి డిప్లొమా కోర్సులు! మనదేశంలో పాలిటెక్నిక్‌ కోర్సులకు పరిధి, గిరాకీ ఎక్కువ. పదో తరగతి అర్హతతో పాలీసెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. చాలావరకూ పాలిటెక్నిక్‌ కళాశాలలు తమ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలతోపాటు ప్రాక్టికల్‌ జ్ఞానాన్నీ అందిస్తున్నాయి దీంతో పది పూర్తైన తరువాత ఈ డిప్లొమా కోర్సులు పూర్తిచేసి నేరుగా ఉద్యోగాల్లోకి ప్రవేశించగలుగుతున్నారు. సంప్రదాయ సాంకేతిక కోర్సులకు భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ప్రత్యేక కోర్సుల వివరాలు చూద్దాం.

ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్‌
ఇది ఒకరకంగా సివిల్‌ ఇంజినీరింగ్‌కు కొనసాగింపే! ఈ కోర్సులో బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్‌, పర్యవేక్షణ మొదలైనవాటి గురించి అధ్యయనం చేస్తారు. స్థలాన్ని తక్కువ శ్రమ, మార్పులతో ఎక్కువ ప్రయోజనకరంగా మార్చడం తెలుసుకుంటారు. ప్రధానంగా బిల్డింగ్‌ నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన మెటీరియల్‌ ప్రాథమిక సమాచారం, ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌కు అవసరమైన సామగ్రి గురించిన పరిజ్ఞానం లభిస్తుంది. ఈ కోర్సు ఎంచుకుని, పూర్తిచేసినవారికి.. డిజైన్‌- డ్రాయింగ్‌ డిపార్ట్‌మెంట్లలో, ఆర్కిటెక్చర్‌లో డ్రాఫ్ట్‌మెన్‌గా ఉపాధి అవకాశాలుంటాయి. మున్సిపల్‌ ఆఫీసుల్లో లైసెన్స్‌డ్‌ డిజైనర్‌గానూ చేరొచ్చు. బీఆర్క్‌లో చేరొచ్చు. అందిస్తున్న కొన్ని కళాశాలలు:
ఉస్మానియా: 1. శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ విమెన్స్‌ టెక్నికల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, హైదరాబాద్‌, 2. కె.ఎన్‌. పాలిటెక్నిక్‌, హైదరాబాద్‌

కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌
కామర్స్‌, కంప్యూటర్‌, బేసిక్‌ అకౌంటింగ్‌ల కలయికగా ఈ కోర్సు ఉంటుంది. ఆఫీస్‌ ప్రొసీజర్స్‌, అకౌంటింగ్‌ ప్రొసీజర్స్‌, ఆటోమేషన్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లను/ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించడం ద్వారా ఆఫీసు వర్క్‌లో ముఖ్య పాత్ర దీనికి ఉంటుంది. స్టెనోగ్రఫీ, డేటా ఎంట్రీ, అకౌంటింగ్‌, టైప్‌ రైటింగ్‌ కూడా కోర్సులో భాగంగా నేర్పుతారు. ఈ కోర్సును ఎంచుకుని, పూర్తిచేసినవారు.. ప్రభుత్వ శాఖల్లో స్టెనో, టైపిస్ట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌లుగా చేరొచ్చు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మంచి అవకాశాలుంటాయి. చిన్న బిజినెస్‌ ఆంత్రపెన్యూర్‌షిప్‌నూ ప్రారంభించుకోవచ్చు. పైచదువులను అభ్యసించాలనుకుంటే బీకాం ఐఐవైఆర్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్‌, ఎంబీఏ కోర్సుల్లో కొనసాగించొచ్చు. ఇవి అందిస్తున్న కొన్ని కళాశాలలు:
ఆంధ్ర యూనివర్సిటీ: 1. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, శ్రీకాకుళం 2. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ ఫర్‌ విమెన్‌, కాకినాడ, 3. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ ఫర్‌ విమెన్‌, గుంటూరు, 4. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ ఫర్‌ విమెన్‌, విశాఖపట్నం, 5. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, నందిగామ
ఉస్మానియా: 1. కేడీఆర్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, వనపర్తి, 2. ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, సిరిసిల్ల, 3. కె.ఎన్‌. పాలిటెక్నిక్‌, హైదరాబాద్‌, 4. ఎస్‌జీ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, ఆదిలాబాద్‌
ఎస్‌వీయూ: 1. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, నెల్లూరు, 2. శ్రీ పద్మావతి విమెన్స్‌ పాలిటెక్నిక్‌, తిరుపతి

ప్యాకేజింగ్‌ టెక్నాలజీ
ప్యాకేజింగ్‌కు ఎన్నో సంవత్సరాలుగా గిరాకీ ఉంది. ఇది ఉత్పాదనకూ, సరఫరాకూ మధ్య వారధిగా ఉంటోంది. ప్యాకేజింగ్‌ లేకుండా వస్తువును చెడిపోకుండా రవాణా చేయడం కష్టమే. పైగా ఈరోజుల్లో మోడర్న్‌ ప్యాకేజింగ్‌ టెక్నిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు పెరుగుతుండటంతో కొత్త రీతిలో టెక్నాలజీని ఉపయోగించి మరింత అందంగా, ఆకర్షణీయంగా కస్టమర్‌కు వస్తువును అందించడంపై సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. ఈ కోర్సులో స్టోరేజీ, వస్తువుపై అట్టపై ఉండాల్సిన ప్రింటింగ్‌లతోపాటు వస్తువును సరిగా, క్షేమంగా ప్యాక్‌ చేయడం వంటివాటిపై అధ్యయనం చేస్తారు.

వీరికి ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తిచేసినవారికి ఫార్మాస్యూటికల్‌, ఫుడ్‌, బెవరేజ్‌, పేపర్‌, ప్లాస్టిక్‌ మొదలైనవాటికి సంబంధించిన అన్ని ప్యాకేజింగ్‌ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బీటెక్‌- మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌, మెకట్రానిక్స్‌ కోర్సుల్లో ఉన్నత చదువులు చేయొచ్చు. అందిస్తున్న కళాశాల:
ఉస్మానియా: 1. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, హైదరాబాద్‌

బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌
ఈ కోర్సులో ఎలక్ట్రానిక్స్‌, వైద్య పరికరాలతో అనుసంధానంగా ఉండే ఎలక్ట్రానిక్‌ వస్తువుల గురించి తెలుసుకుంటారు. వైద్య పరిశ్రమలో వివిధ రోగ నిర్ధారణ, థెరపీలకు సంబంధించిన సంస్థల్లో వీరికి మంచి అవకాశాలుంటాయి. వైద్యరంగంలో ఎలక్ట్రానిక్స్‌కు కొనసాగింపు ఇది. మెడికల్‌, దాని సంబంధిత రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి కోర్సు. అయితే వీరికి మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న టెక్నాలజీలపై ఆసక్తి ఉండాలి. వీరికి ఏడాది పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారికి మెడికల్‌ రిసెర్చ్‌ సంస్థలు, ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బీటెక్‌-ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీమాటిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ల్లో వీరు ఉన్నత చదువులు చదవొచ్చు. ఇవి అందిస్తున్న కొన్ని కళాశాలలు:
ఎస్‌వీయూ: 1. జి. పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్‌, బి. తాండ్రపాడు 2. ఎస్‌వీ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, తిరుపతి

మైనింగ్‌ ఇంజినీరింగ్‌
ఇది సైన్స్‌, టెక్నాలజీల మేలు కలయిక. ఈ కోర్సును ఎంచుకున్నవారు కఠిన, ప్రతికూల వాతావరణంలో పనిచేయడానికి సుముఖంగా ఉండగలగాలి. కొంత పై స్థాయికి చేరుకున్నాక కంట్రోల్‌ రూంలో చేయొచ్చు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో భాగమైన సర్వేయింగ్‌, డ్రాయింగ్‌, జియాలజీ సైన్స్‌లో ఎర్త్‌ సైన్స్‌కు సంబంధించిన అంశాలను లోతుగా చదువుతారు. కెమిస్ట్రీ కూడా ఒక భాగంగా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఖనిజాలు దొరుకుతాయో కనిపెట్టడం, తరువాత ఆచరించాల్సిన ప్రాథమిక విధులు మొదలైనవి తెలుసుకుంటారు. ఖనిజాలు, వాటిని వెలికి తీసేప్పుడు, తీసిన తర్వాత, రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైనవి ఈ కోర్సులో భాగం. కోర్సు పూర్తిచేసిన వారికి ఓపెన్‌ కాస్ట్‌, అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌లు, ఎస్‌సీసీఎల్‌, ఎన్‌ఎండీసీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కోర్సు అనంతరం కావాలనుకుంటే బీటెక్‌-మైనింగ్‌ ఇంజినీరింగ్‌, మైనింగ్‌ మెషినరీ ఇంజినీరింగ్‌ల్లో చదువు కొనసాగించొచ్చు.

ఇవి అందిస్తున్న కొన్ని కళాశాలలు:
ఆంధ్ర యూనివర్సిటీ: 1. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, నర్సీపట్నం
ఉస్మానియా: గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, బెల్లంపల్లి
ఎస్‌వీయూ: 1. గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, గూడూరు, 2. లయోలా పాలిటెక్నిక్‌, పులివెందుల

ఇవే కాకుండా లెదర్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, సెరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హోం సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీడియో ఇంజినీరింగ్‌, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ వంటి కోర్సులూ తెలుగు రాష్ట్రాల పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి.

గార్మెంట్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ
అప్పటికే అందుబాటులో ఉన్న వస్త్రాన్ని కాస్ట్యూమ్స్‌గా రూపొందించడం ఈకోర్సులో భాగంగా నేర్చుకుంటారు. డిజైనింగ్‌లో సైంటిఫిక్‌, ఇంజినీరింగ్‌ సూత్రాలను ఉపయోగించడం, ఫైబర్‌, టెక్స్‌టైల్‌, అపరెల్‌ ప్రాసెసెస్‌, ప్రొడక్ట్స్‌, మెషినరీపై పట్టు ఏర్పరచుకుంటారు. డిజైన్స్‌, ప్రింటింగ్‌లు, లేఅవుట్‌లు, కలర్‌ కాంబినేషన్ల పరిజ్ఞానం ఏర్పరచుకుంటారు. దీనిలో మూడు, మూడున్నర ఏళ్ల వ్యవధి గల కోర్సులున్నాయి. మూడున్నరేళ్ల కోర్సు ఎంచుకున్నవారికి ఏడాదిపాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. వీరికి టెక్స్‌టైల్‌ మిల్లులు, వస్త్ర దిగుమతి పరిశ్రమలు, ఫిలిం, ఫ్యాషన్‌ టెక్నాలజీ, షోరూమ్‌ అవుట్‌లెట్లలో అవకాశాలుంటాయి. వర్క్‌ ఫ్రం హోం చేసుకునే వీలూ ఉంటుంది. వీరికి ఎక్కువగా ప్రైవేటు రంగంలో అవకాశాలున్నాయి. కన్సల్టెంట్లుగా కూడా చేయవచ్చు. ఫ్యాషన్‌ సంబంధిత కోర్సుల్లో గ్రాడ్యుయేషన్‌, బీటెక్‌- టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌, పెట్రోలియమ్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీల్లో ఉన్నత చదువులు అభ్యసించొచ్చు.

టెక్స్‌టైల్‌ టెక్నాలజీ
ఆంధ్ర యూనివర్సిటీ: గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, గుంటూరు,
ఉస్మానియా: ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, సిరిసిల్ల

గార్మెంట్‌ టెక్నాలజీ
ఆంధ్ర యూనివర్సిటీ: గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ ఫర్‌ విమెన్‌, గుంటూరు,
ఉస్మానియా: కేఎన్‌ పాలిటెక్నిక్‌, హైదరాబాద్‌.

త్వరగా స్థిరపడాలనుకునేవారికి అనుకూలం
సంప్రదాయ కోర్సులు కాకుండా కొత్తగా, ఆసక్తిమేరకు ఎంచుకోవాలనుకున్నవారికి ఈ స్పెషలైజ్‌డ్‌ కోర్సులు ఉపయోగకరం. ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’ వీటిలో ప్రధానాంశం. ఈ జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులకు సైన్స్‌ పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలూ అవసరమవుతాయి. త్వరగా జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఈ కోర్సులు అనుకూలం. విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచుల ఆధారంగా వీటిని ఎంచుకోవచ్చు. వీటిని పూర్తిచేసినవారికి మంచి ఉద్యోగావకాశాలూ ఉంటాయి. అయితే మన దగ్గర సాంప్రదాయిక కోర్సులకు ఉన్న ప్రాచుర్యం వీటికి అంతగా లేదనే చెప్పొచ్చు. అవగాహన లోపమే ఇందుకు కారణం. సంప్రదాయ కోర్సులకు ఉన్న పోటీ కారణంగా అవి చదివినవారికంటే వీరికి మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయని గమనించాలి. ఈ స్పెషలైజ్‌డ్‌ కోర్సుల్లో నైపుణ్యాల శిక్షణదే ప్రధాన పాత్ర! - ఎర్రగుంట్ల శివరామయ్య, ప్రిన్సిపల్‌, ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌, నల్లపాడు, గుంటూరు జిల్లా

Posted on 18-04-2018

టెన్త్ తర్వాత - పాలిటెక్నిక్

పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉన్నా, మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా పాలిటెక్నిక్ డిప్లొమాపైనే ఆధారపడతారు. పాలిటెక్నిక్‌లో ఏయే బ్రాంచ్‌లు ఉంటాయి? ఏ బ్రాంచ్‌లో చేరితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యావకాశాలుంటాయి? తదితర అంశాల గురించి తెలుసుకుందాం.

పదోతరగతి పూర్తయ్యాక మూడేళ్లకే ఇంజినీరింగ్ డిప్లొమా పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అత్యంత అనువైనవి. ఇవి డబ్బు, సమయం వృథా కాకుండా సాంకేతిక విద్యార్హత సాధించడానికి ఉపకరిస్తాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తోంది పాలిటెక్నిక్. పదోతరగతి పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియట్, నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదవాలి. ఆర్థికంగా అంత స్థోమత లేనివాళ్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పదోతరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లొమా పొందడానికి పాలిటెక్నిక్‌ను ఎంచుకుంటారు. మరోవైపు పారిశ్రామిక రంగం ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో దీటుగా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థులకూ ప్రాధాన్యం ఇస్తోంది. కొన్ని రకాల నైపుణ్యాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తే, పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు ఇవ్వగలమంటూ ప్రభుత్వానికి హామీ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది. ఫలితంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్ అవకాశాలు పెరుగుతున్నాయి. గ్రామీణ, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు చక్కటి అవగాహనతో పని చేయడం, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి రావడం లాంటి కారణాలతో పారిశ్రామిక రంగం పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు పెంచింది. డిప్లొమా కోర్సుల్లో ప్రాథమిక అంశాలపై అవగాహన కలిగించేలా రూపొందించిన కోర్సులు కూడా కంపెనీలను ఆకట్టుకోవడానికి దోహదం చేస్తున్నాయి. వీటి వల్ల ఈ కోర్సులకు ఎల్లవేళలా ఆదరణ ఉంటోంది. సివిల్, మెకానికల్ లాంటి ప్రాథమిక తరహా కోర్సులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చేసిన వారితో పోలిస్తే, పాలిటెక్నిక్ చేసిన వారికి ఉపాధి అవకాశాలూ ఎక్కువే.

కోర్సులు

» మూడేళ్ల కోర్సులు
సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్.
» మూడున్నరేళ్ల కోర్సులు
మెటలర్జికల్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ.
» ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు
ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో క‌లిపి 248 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 70620 సీట్లున్నాయి. వీటికోసం ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది పోటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

డిప్లొమా చేసిన తర్వాత అవకాశాలు

పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలను ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ఉద్యోగం, ఉన్నత విద్య.
ఉద్యోగం:
ఇందులోనూ రెండు మార్గాలున్నాయి. ఒకటి స్వయం ఉపాధి; రెండోది ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగం పొందడం. ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి.
బ్రాంచిల ఆధారంగా ఉద్యోగావకాశాలున్న రంగాలు: ఇంజినీరింగ్ డిప్లొమా (పాలిటెక్నిక్) కోర్సుల్లో వేటికి ఏ రంగంలో ఉద్యోగావకాశాలు ఉంటాయో పేర్కొంటూ సాంకేతిక విద్యాశాఖ అధికారులు రూపొందించిన జాబితా కింది విధంగా ఉంది.
1. సివిల్ ఇంజినీరింగ్: నీటిపారుదల, పబ్లిక్ హెల్త్, రోడ్లు, భవనాలు, రైల్వే, సర్వే, డ్రాయింగ్, నీటిసరఫరా, తదితర ప్రభుత్వ/ ప్రైవేటు రంగాలు.
2. ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్: డిజైన్, డ్రాయింగ్ శాఖలు, మునిసిపాలిటీల్లో లైసెన్స్ డిజైనర్, డ్రాఫ్ట్స్‌మెన్.
3. మెకానికల్ ఇంజినీరింగ్: మెషినరీ, ట్రాన్స్‌పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్లలో వర్క్‌షాపులు, గ్యారేజీల్లో అవకాశాలు.
4. ఆటోమొబైల్ ఇంజినీరింగ్: ఏపీఎస్ఆర్టీసీ, రవాణా రంగం, ఆటోమొబైల్ షోరూమ్‌లు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ.
5. ప్యాకేజింగ్ టెక్నాలజీ: ఫార్మాస్యూటికల్, ఫుడ్, బెవరేజ్, పేపర్, ప్లాస్టిక్ తదితర రంగాల్లో ప్యాకేజింగ్ విభాగాల్లో అవకాశాలు.
6. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కో, డీసీఎల్ లాంటి సంస్థల్లో ఉపాధి.
7. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో అవకాశాలు.
8. అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్: ప్రాసెస్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో.
9. కంప్యూటర్ ఇంజినీరింగ్: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ ట్రెయినింగ్ తదితర రంగాల్లో.
10. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: అన్ని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీల్లో.
11. మైనింగ్ ఇంజినీరింగ్: గనులు, ఎస్.సి.సి.ఎల్., ఎన్.ఎం.డి.సి., తదితర సంస్థల్లో.
12. కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ): పేపర్, సుగర్, పెట్రో కెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో.
13. ప్రింటింగ్ టెక్నాలజీ: కంపోజింగ్ డీటీపీ, ఫిల్మ్ మేకింగ్, ప్రింటింగ్ రంగాల్లో.
14. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్టెనో, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్; రీటైల్ వ్యాపార రంగంలో అవకాశాలు. (1 నుంచి 14 కోర్సులకు కాలవ్యవధి మూడేళ్లు.)
15. ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు:
ఎంబెడెడ్ సిస్టమ్స్: ఎలక్ట్రానిక్ ఐసీ సర్క్యూట్ల తయారీ రంగం.
కంప్యూటర్ ఇంజినీరింగ్: కంప్యూటర్ మెయిన్‌టెనెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ శిక్షణ సంస్థల్లో.
కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: ప్రాసెస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు.
ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రానిక్ ఐసీ సర్క్యూట్స్ తయారీ రంగం, ప్రాసెస్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు.
టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్: ఆలిండియా రేడియో, దూరదర్శన్, ప్రైవేటు టీవీ ఛానెళ్లు, ప్రభుత్వ-కార్పొరేట్ హాస్పిటళ్లలో.
బయోమెడికల్ ఇంజినీరింగ్: మెడికల్ రిసెర్చ్ సంస్థలు, హాస్పిటళ్లు.
16. మెటలర్జికల్ ఇంజినీరింగ్: ఫౌండ్రీలు, స్టీల్ ప్లాంట్స్, ఫోర్జ్ షాప్స్, రోలింగ్ మిల్లులు, హీట్ ట్రీట్‌మెంట్ షాప్స్, డిఫెన్స్ సంస్థల్లో...
17. టెక్స్‌టైల్ టెక్నాలజీ: టెక్స్‌టైల్ మిల్లులు, వస్త్రాల ఎగుమతి పరిశ్రమల్లో.
18. కెమికల్ ఇంజినీరింగ్: కెమికల్, రిఫైనరీ, పెట్రోకెమికల్ పరిశ్రమలు.
19. కెమికల్ ఇంజినీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ): రిఫైనరీ, పేపర్, సుగర్, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్, ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు.
20. కెమికల్ ఇంజినీరింగ్ (పెట్రో కెమికల్): రిఫైనరీ, పెట్రో కెమికల్, కెమికల్ పరిశ్రమలు.
21. కెమికల్ ఇంజినీరింగ్ (ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్): కెమికల్ పాలిమర్, ప్లాస్టిక్ పరిశ్రమలు.
22. సిరామిక్ టెక్నాలజీ: రిఫ్రాక్టరీ, ఇటుకబట్టీలు, సిమెంట్, గ్లాస్, సిరామిక్, శానిటరీ వేర్ తదితర రంగాలు.
23. లెదర్ టెక్నాలజీ: ట్యానరీ, ఫుట్‌వేర్ పరిశ్రమలు.
24. ఫుట్‌వేర్ టెక్నాలజీ (లెదర్): ఫుట్‌వేర్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లెదర్ టెక్నాలజీ.
(15 - 24 వరకు ఉన్న కోర్సులకు కాలవ్యవధి మూడేళ్లు.)

ఉన్నత విద్యావకాశాలు

పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ, రెగ్యులర్ కోర్సులు చేయవచ్చు. తద్వారా కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడే ఉన్నత సాంకేతిక విద్యావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
» ఈసెట్ (ఎఫ్.డి.హెచ్.): ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -ఫర్ డిప్లొమా హోల్డర్స్ (ఈసెట్-ఎఫ్‌డీహెచ్)గా వ్యవహరించే ఈ ప్రవేశపరీక్ష ద్వారా ఇంజినీరింగ్ చేయవచ్చు. కాల వ్యవధి మూడేళ్లు. లేటరల్ ఎంట్రీ అని పిలిచే ఈ విధానంలో నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరవచ్చు. అయితే ఈ విధానం ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లోనే ఉంది. యూనివర్సిటీల అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచి చదవాల్సిందే. పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో 10 శాతం సీట్లను ఈసెట్ (ఎఫ్‌డీహెచ్)కు కేటాయించారు.
» పాలిటెక్నిక్ చదివినవారు ఎంసెట్ రాయడానికీ అర్హులే. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా తమకు ఆసక్తి ఉన్న బ్రాంచీల్లో చేరవచ్చు.
» జేఈఈ(మెయిన్) రాసి, ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్ లేదా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేయవచ్చు.
'ఎస్‌డీసీ' శిక్షణ: ఎంసెట్ కోచింగ్ తీసుకుంటూ ఇంటర్మీడియట్ చదివి, ఇంజినీరింగ్‌లో చేరిన విద్యార్థులతో పోలిస్తే పాలిటెక్నిక్ చేసి లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్ డిగ్రీలో చేరిన విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలు తక్కువే అనేది పారిశ్రామిక వర్గాలు తరచూ వెల్లడించే అభిప్రాయం. అందుకే పాలిటెక్నిక్ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, ఆంగ్లభాషణ లాంటి అంశాల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను చేపట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో పోలిస్తే, టెక్నికల్ సబ్జెక్టుల్లో దీటుగా ఉన్నా, సాఫ్ట్ స్కిల్స్ లాంటి కొన్ని నైపుణ్యాల్లో వెనుకబడి ఉంటారు. ఈ లోపాన్ని సవరించడానికి పాలిటెక్నిక్ కళాశాలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను (ఎస్‌డీసీ) ఏర్పాటుచేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నందువల్ల వారికి సాఫ్ట్‌స్కిల్స్, ఇతర అవసరమైన అంశాల్లో శిక్షణనిచ్చి పారిశ్రామిక వర్గాల అంచనాలకు అనుగుణంగా తయారుచేయడమే ఈ కేంద్రాల లక్ష్యం.