Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

తెలివిగా తొలి అడుగు!

ప్రతి విద్యార్థికీ, ప్రతి పేరెంట్‌కీ, ప్రతి సంవత్సరం ఎదురయ్యే ప్రధానమైన ప్రశ్న... పదోతరగతి తర్వాత ఏంటి? అందరూ చదివేది చదవాలా... ఎవరికీ తెలియనిది చేరాలా! కొత్తగా చదివి స్థిరపడతారా... భిన్నంగా చదివి బోల్తా కొడతారా? వేసిన దారిలో వెళ్లాలా... మరో మార్గం ముళ్లదైనా ముందుకు సాగాలా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు. మనకు తెలిసింది కొంత, ఇతరులు చెప్పేది ఇంకొంత... కలిపి ఆలోచిస్తే కన్ఫ్యూజన్‌. ఈ నేపథ్యంలో టెన్త్‌ తర్వాత ఉన్న కోర్సుల గురించి కొన్ని వివరాలు అందిస్తున్నాం. ఎవరికి వారు తమ స్థితిగతులు, అవసరాలు, లక్ష్యాల ఆధారంగా సరైన కోర్సు ఎంచుకోడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. తెలుసుకొని, తెలివిగా తొలి అడుగు వేయడానికి సాయపడుతుంది.
ఆసక్తులు, అభిరుచులు, ఆశయాలు, ఇష్టాలు, నైపుణ్యాలు, బలాలు-బలహీనతలను కొద్దిపాటి ఓపికతో లిస్టు చేసి, సరిచూసుకుంటే తగిన కోర్సును ఎంచుకోవడం తేలికే.
ఎంపీసీ ఎంతో మంచిదని, బైపీసీతో బాధలేనని, సీఈసీ చదివితే చిన్నచూపు చూస్తారని, ఎంఈసీతో ఎటూ కాకుండా పోతామని, హెచ్‌ఈసీ హిస్టరీలో లేకుండా పోయిందని... ఎన్నో అభిప్రాయాలు, అపోహలు ఎదురవుతాయి. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి కోర్సుకీ ఒక పరమార్థం ఉంది. అవసరాలు, ఉద్యోగావకాశాలను అంచనా వేసిన తర్వాతే ప్రభుత్వం ఆయా కోర్సులను డిజైన్‌ చేసింది. ప్రతి గ్రూప్‌ ముఖ్యమైనదే. దేని ప్రత్యేకత దానిదే. ఒకదానితో ఒకటి పోల్చడానికి లేదు. మనకు తగినదేదో తేల్చుకోవడమే మన పని.

ఇంటర్‌ గ్రూప్‌లు
టెన్త్‌ తర్వాత సంప్రదాయ రీతిలో సాగిపోవడానికి ఇంటర్మీడియట్‌లో చేరాలి. తెలుగు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు దాదాపు 85 కాంబినేషన్లతో గ్రూప్‌లను అందిస్తున్నాయి. సాధారణ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీలతోపాటు జియాలజీ, హోమ్‌సైన్స్‌, లాజిక్‌, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, మ్యూజిక్‌, సైకాలజీ, పర్షియన్‌, అరబిక్‌, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్‌, ఒరియా, కన్నడ, తమిళ్‌, మరాఠీ తదితర సబ్జెక్టులతో కూడా గ్రూప్‌లను అందిస్తున్నాయి. లాజిక్‌, సైకాలజీ లాంటి సబ్జెక్టులు చదవాలనుకునే వాళ్లు ఇంటర్మీడియట్‌ నుంచే తమ ఆసక్తి మేరకు చదువుకోవచ్చు. ఇతర భాషల పట్ల అభిరుచి ఉంటే ఇప్పటి నుంచే ప్రావీణ్యాన్ని సంపాదించడానికి ఆ గ్రూప్‌లను ఎంచుకోవచ్చు.

వృత్తివిద్యా కోర్సులు
ఇంటర్‌ స్థాయిలోనే భిన్నమైన మార్గంలో వెళ్లాలనుకునే వారి కోసం వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. సుమారు 27 రకాల గ్రూప్‌లను బోర్డు అందిస్తోంది.
కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, అకౌంటింగ్‌-టాక్సేషన్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్‌ తదితర రెగ్యులర్‌ కోర్సులతోపాటు వ్యవసాయానికి సంబంధించి క్రాప్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, డెయిరీయింగ్‌, ఫిషరీస్‌, సెరీకల్చర్‌ గ్రూప్‌లు ఉన్నాయి. ఇంకా రూరల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్‌, వాటర్‌ సప్లై అండ్‌ శానిటరీ ఇంజినీరింగ్‌, గార్మెంట్‌ డిజైనింగ్‌, టూరిజం అండ్‌ ట్రావెల్‌ టెక్నిక్‌, మెడికల్‌ లాబ్‌ టెక్నీషియన్‌, ఆప్తాల్మిక్‌ టెక్నీషియన్‌, ఫిజియోథెరపీ వంటివీ ఉన్నాయి.

పాలిటెక్నిక్‌
ఎంపీసీ, బైపీసీల్లో సీట్లు దొరకలేదని పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరుతున్నారనే ఎగతాళి మాటలకు కాలం చెల్లింది. అవన్నీ అవగాహన లేని మాటలు. ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్‌స్థాయిలోనే ఇంజినీరింగ్‌లోకి చేరినట్లుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ఇంజినీరింగ్‌ కలకు ఇక్కడే మొదటి అడుగుపడుతుంది. సాధారణ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ తదితరాలతోపాటు ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్‌, మైనింగ్‌ ఇంజినీరింగ్‌, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌సైన్స్‌, మెటలర్జికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, లెదర్‌ టెక్నాలజీ, ఫుట్‌వేర్‌, టెక్స్‌టైల్‌, ప్రింటింగ్‌, ప్యాకేజింగ్‌, సిరామిక్‌ వంటి ఎన్నో గ్రూప్‌లను ప్రభుత్వం అందిస్తోంది. ఈ కోర్సులు పూర్తిచేయగానే ఉద్యోగాలకు అర్హత రావడం వీటి ప్రత్యేకత. ఉన్నత విద్యకూ అవకాశాలు చాలా ఉన్నాయి.

పారిశ్రామిక శిక్షణ
రాష్ట్రస్థాయిలో టెక్నికల్‌ బోర్డుల ఆధ్వర్యంలో పారిశ్రామిక శిక్షణలో కొన్ని కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇందులో ఫిట్టర్‌, వెల్డర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రికల్‌ మొదలైన రెగ్యులర్‌ విభాగాలతో పాటు ఫుడ్‌ ప్రొడక్షన్‌ వంటి వాటిలో కూడా నిర్ణీత కాలానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ ఇస్తారు. తర్వాత వీరు లేటరల్‌ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా రెండో సంవత్సరంలోకి చేరవచ్చు.

వ్యవసాయ కోర్సులు
టెన్త్‌ అర్హతతో పాలిటెక్నిక్‌ కళాశాలలు అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్నాలజీ తదితరాల్లో డిప్లొమాలు అందిస్తున్నాయి. దీనికి అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. ఇంటర్‌ లేదా ఆపై డిగ్రీలు ఉన్నవారికి ఈ కోర్సుల్లోకి ప్రవేశం ఇవ్వరు.

నేరుగా ఇంజినీరింగ్‌
తెలుగు రాష్ట్రాల్లో ఆరు ట్రిపుల్‌ ఐటీలు ఉన్నాయి. పదోతరగతి మార్కుల ఆధారంగా వీటిలోకి ప్రవేశం కల్పిస్తారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ విద్యను ఈ సంస్థల్లో అభ్యసించవచ్చు. నాణ్యమైన సాంకేతిక విద్యకు ట్రిపుల్‌ ఐటీలు చిరునామాలుగా నిలిచాయి.

భిన్నంగా ఇగ్నో నుంచి
ఇగ్నో వంటి దూరవిద్యా సంస్థలు పదోతరగతి అర్హతతో విజువల్‌ ఆర్ట్స్‌-పెయింటింగ్‌, విజువల్‌ ఆర్ట్స్‌-అప్లైడ్‌ ఆర్ట్‌, కథక్‌, భరతనాట్యం, హోమ్‌బేస్‌డ్‌ హెల్త్‌కేర్‌, కమ్యూనిటీ రేడియో, సెరీకల్చర్‌, వాటర్‌ హార్వెస్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ, గైడెన్స్‌, ఎనర్జీ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి విభాగాల్లో సర్టిఫికెట్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. టెన్త్‌ తర్వాత ఆయా రంగాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇవి ప్రామాణిక కోర్సులు.

ఎంచుకునే ముందు?
సరైన గ్రూప్‌ను ఎంచుకునే ముందు ఈ కింది అంశాలను పరిశీలించాలి.
* మొదటి ప్రాధాన్యం అభ్యర్థిదే. అవగాహన ఉండి ఫలానా కోర్సు పట్ల ఆసక్తి ఉందని స్పష్టంగా చెప్పగలిగితే ఆ గ్రూప్‌లో చేర్చడమే ఉత్తమం.
* విద్యార్థి అభిరుచులు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవాలి.
* ఇతరుల అనుభవాలను, ఆలోచనలను సేకరించి విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. గుడ్డిగా పక్కవారిని అనుసరించకూడదు.
* ఫలానా గ్రూప్‌ ఎందుకు తీసుకుంటున్నారు, తర్వాత ఏం చేయాలి, లక్ష్యం ఏమిటి తదితర అంశాలను ఈ దశలోనే విశ్లేషించుకోవాలి. వాటిపై స్పష్టత తెచ్చుకోవాలి.
* విద్యార్థి బలాలు, బలహీనతలను బేరీజు వేయాలి. ఏయే సబ్జెక్టుల్లో బలంగా ఉన్నారు, వేటి పట్ల బలహీనంగా ఉన్నారో గ్రహించాలి.
* ఉపాధ్యాయుల సలహాలను తీసుకోవాలి. అవసరం అనుకుంటే ఆయా రంగాల్లో నిపుణులను కూడా సంప్రదించవచ్చు.
* తల్లిదండ్రులు తమ వ్యక్తిగత అభిరుచులను పిల్లలపై రుద్దకూడదు. అనవసరమైన ఒత్తిడిని వారికి కలిగించడం మంచిదికాదు.
* తొందరపాటు లేకుండా విద్యార్థుల, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, నిపుణుల అభిప్రాయాలను, సూచనలను విశ్లేషించి సమగ్ర అవగాహనతో తుది నిర్ణయం తీసుకోవాలి.

ఏ గ్రూప్‌ తర్వాత ఏమిటి?
టెన్త్‌ తర్వాత ఏ గ్రూప్‌ తీసుకోవాలన్నా ముందుగా మన లక్ష్యాన్ని నిర్వచించుకోవాలి. ప్రతి గ్రూప్‌కి ఉన్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల గురించి సమగ్రంగా ఇప్పుడే తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. స్థూలంగా ఏ గ్రూప్‌ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉన్నాయో పరిశీలిద్దాం.
* ఎంపీసీ గ్రూప్‌లో సాధారణంగా ఇంజినీరింగ్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నవారు చేరతారు. ఇంటర్‌ పూర్తికాగానే జేఈఈ, ఎంసెట్‌ రాసి ఇంజినీరింగ్‌ చేయాలనుకుంటే ఎంపీసీ తీసుకోవాలి. అందరూ ఇంజినీరింగే చేస్తున్నారు మనకేం ఉద్యోగాలు వస్తాయని నిరాశపడాల్సిన పనిలేదు. నైపుణ్యాలు ఉంటే ఎంతమందికైనా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇంజినీరింగ్‌ రంగంలో ఉంది. లేదంటే బీఎస్సీ, ఎమ్మెస్సీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నించవచ్చు. బీఎడ్‌ చేసి ఉపాధ్యాయులుగా చేరవచ్చు. పీజీ తర్వాత నెట్‌ వంటివి రాసి అధ్యాపకులుగా జాబ్‌ పొందవచ్చు. ఫార్మసీ కోర్సులు చేయడానికి కూడా వీలుంది.
* బైపీసీ తీసుకుంటే నీట్‌, ఎంసెట్‌ రాసి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో చేరవచ్చు. వీటికి కొంత ఆర్థిక స్థోమత కూడా అవసరం. బీఎస్సీ నర్సింగ్‌, ఫిజియోథెరపీ, ఆప్టోమెట్రీ, ఫార్మసీ తదితర కోర్సులు చేయగలిగే అవకాశం ఉంది. సంబంధిత పరీక్షలు రాస్తే ప్రభుత్వ రంగంలోనూ, ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా ఉద్యోగాలు పొందవచ్చు.
* ఎంఈసీలో చేరాలనుకుంటే అటు బీఎస్సీ మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ వంటి కోర్సుల్లో పీజీల వరకు వెళ్లవచ్చు. ఇటు కామర్స్‌కు సంబంధించి సీఏ, సీఎస్‌ తదితర రంగాలను ఎంచుకోవచ్చు. సాధారణ డిగ్రీతో లభించే అన్ని ఉద్యోగాలకు, కోర్సులకు వీరికి అర్హత ఉంటుంది.
* సీఈసీ తర్వాత నేరుగా బీకామ్‌లోకి చేరవచ్చు. ఎకనామిక్స్‌ లేదా కామర్స్‌ ప్రత్యేకంగా పీజీల వరకు వెళ్లవచ్చు. లా, ఎంబీఏ, సీఏ, సీఎస్‌ వంటి కోర్సుల్లోకీ ప్రవేశం లభిస్తుంది. ట్యాలీ లాంటివి నేర్చుకుంటే వెంటనే ఉద్యోగాలు వస్తాయి.
* హెచ్‌ఈసీలో చేరినవారు సాధారణంగా సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని చేరతారు. ఆ సర్వీసుల్లో చేరాలనే లక్ష్యంపట్ల స్పష్టత ఉంటే ఈ గ్రూప్‌లో చేరవచ్చు. తర్వాత ఆయా స్పెషలైజేషన్లతో బీఏ డిగ్రీ ఉంటుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో లభించే కోర్సులు, ఉద్యోగాలన్నింటికీ వీరికి అర్హత ఉంటుంది.
* లాజిక్‌, మ్యూజిక్‌, సైకాలజీ, జియాలజీ, జాగ్రఫీ, ఇతర భాషల గ్రూప్‌లు తీసుకున్న వారు ఆయా విభాగాల్లో ప్రత్యేక డిప్లొమాలు, డిగ్రీలు చేయవచ్చు. ఆర్ట్స్‌లో సాధారణ డిగ్రీలు చేసుకోవచ్చు.
* ఇంటర్‌ ఒకేషనల్‌ గ్రూప్‌లు, ఐటీఐల్లో చేరినవారు తర్వాత నేరుగా పాలిటెక్నిక్‌ డిప్లొమా రెండో సంవత్సరంలోకి ప్రవేశించవచ్చు. ఆయా కోర్సులు పూర్తిచేయగానే కొన్ని రకాల ఉద్యోగాలు వెంటనే లభిస్తాయి.
* పాలిటెక్నిక్‌ కోర్సులు చేసినవారికి ఇంజినీరింగ్‌ డిగ్రీ రెండో సంవత్సరంలోకి అడ్మిషన్‌ దొరుకుతుంది. డిప్లొమాలు పూర్తికాగానే రైల్వే వంటి సంస్థల్లో సంబంధిత ఉద్యోగాలు లభిస్తాయి.
* టెన్త్‌ తర్వాత వ్యవసాయ కోర్సులు చేసిన వారికి వెంటనే ఉద్యోగాలు ఉంటాయి. సంబంధిత విభాగంలో ఉన్నత విద్యకూ అవకాశాలు ఉన్నాయి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాభివృద్ధి సంస్థల వంటి వాటిలో వీరికి ఉద్యోగాలు ఉంటాయి.

ఎవరికి ఏది?

తల్లిదండ్రులు తమ సాధారణ పరిశీలనతో పిల్లలకు ఏ చదువు సరిపోతుందో గ్రహించవచ్చు.
* ఉదాహరణకు ఒక విద్యార్థి యంత్రాలంటే ఆసక్తిగా ఉంటే పాలిటెక్నిక్‌ లేదా ఒకేషనల్‌ కోర్సుల్లో చేర్చవచ్చు.
* ఇంజినీరింగ్‌లోనే చేర్చాలని అనుకుంటే పిల్లలకు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల పట్ల ఆసక్తి, పట్టు ఉన్నాయో లేదో చూడాలి. తర్వాత నేర్చుకుంటారులే అని గుడ్డిగా వెళితే దెబ్బతినాల్సి వస్తుంది.
* మొక్కలు, జంతువులను పెంచే అభిరుచి, వైద్యరంగ పదజాలాన్ని వెంటనే గ్రహించే నైపుణ్యాలను గుర్తిస్తే బైపీసీ వైపు వెళ్లవచ్చు.
* కొనుగోళ్లు, అమ్మకాల పట్ల ఉత్సాహం చూపుతూ ఏ పని ఇచ్చినా చక్కటి లెక్కలతో అప్పగిస్తుంటే కామర్స్‌ రంగాన్ని ఎంచుకోవచ్చు.
* కథల పట్ల ఆసక్తి, చరిత్ర అంటే మక్కువ చూపిస్తుంటే ఆర్ట్స్‌ గ్రూప్‌లు తీసుకోవచ్చు.
ఇవి విద్యార్థుల ఆసక్తిని, అభిరుచులను గ్రహించడానికి ఇచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. సహజమైన ఇంట్రెస్ట్‌ పిల్లల్లో ఉంటే వాటిని అభివృద్ధి చేసి, నిపుణులుగా తీర్చిదిద్దడం తేలిక. అందుకని ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఇతర కోర్సులు కొన్ని

డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ, గార్మెంట్‌ మేకింగ్‌, అడ్వాన్స్‌డ్‌ బ్యూటీషియన్‌, ప్రీప్రైమరీ టీచర్‌ ట్రెయినింగ్‌, యాంకర్‌, ఫొటోగ్రాఫర్‌ కోర్సులను పదో తరగతి అర్హతతో హైదరాబాద్‌లోని సెట్విన్‌ అందిస్తోంది.
సీఎన్‌సీ ఆపరేటర్‌ టర్నింగ్‌, బేసిక్‌ ఆటోమోటివ్‌ సర్వీసింగ్‌ (2, 3 వీలర్లు), డొమెస్టిక్‌ ఎలక్ట్రిషియన్‌, పర్సనల్‌ ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ రిపేర్‌ అండ్‌ మెయిన్‌టెనెన్స్‌ తదితర కోర్సులను నల్గొండ జిల్లాలోని స్వామీ రామానంద తీర్థ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫర్‌ చేస్తోంది.
జ్యూట్‌ ప్రొడక్షన్‌ టెక్నాలజీ, ఎంఎస్‌వర్డ్‌, కార్పెంటర్‌, టైప్‌రైటింగ్‌, సోలార్‌ ఎనర్జీ టెక్నీషియన్‌, బయోగ్యాస్‌ ఎనర్జీ టెక్నీషియన్‌, లాండ్రీ సర్వీసెస్‌, బేకరీ అండ్‌ కన్ఫెక్షనరీ మొదలైన కోర్సులను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ నుంచి చేయవచ్చు.
పదో తరగతి తర్వాత ఇంటిగ్రేటెడ్‌ విధానంలో డిప్లొమా+ బీటెక్‌ డిగ్రీని ఆరేళ్ల వ్యవధితో గుజరాత్‌లోని గనపట్‌ యూనివర్సిటీ, ముంబైలోని ముఖేష్‌ పటేల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, రాయ్‌పూర్‌లోని ఐటీఎం యూనివర్సిటీ, వడోదరలోని ఐటీఎం ఒకేషనల్‌ యూనివర్సిటీ ఇస్తున్నాయి.
అరుణాచల్‌ ప్రదేశ్‌ ఈటానగర్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ టెన్త్‌ తర్వాత ఒక ప్రవేశ పరీక్ష ద్వారా మాడ్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ అనే సర్టిఫికెట్‌ కోర్సులోకి తీసుకుంటోంది. ఈ కోర్సులో ఉత్తీర్ణులైతే ఇంజినీరింగ్‌ వరకు ఈ సంస్థలోనే చదువుకునే అవకాశం ఉంది.