Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఈ ఉద్యోగాలకు టెన్త్‌ చాలు!

ప్రతి విద్యార్థి చదువు పరమార్థం దాదాపుగా ఉద్యోగమే. ఎంత పెద్ద పట్టా పుచ్చుకుంటే అంత గొప్ప ఉద్యోగం రావచ్చేమో కానీ పది పాసైతే మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొలువులు ఎన్నో ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, రైల్వే, పారామిలటరీ, పోస్టల్‌, రెవెన్యూలో వీఆర్‌ఏ.. ఇలా వివిధ విభాగాలు, శాఖల్లో కేవలం టెన్త్‌తో ఉపాధి పొందవచ్చు. చిన్న వయసులోనే ఈ ఉద్యోగాలు సాధించడం ద్వారా జీవితంలో స్థిరత్వంతోపాటు, తరువాత తగిన అర్హతలు సంపాదిస్తే ఉన్నత స్థానాలకూ చేరుకోవచ్చు.
పదో తరగతి ఉత్తీర్ణత పొందడం విద్యార్థి జీవితంలో మొదటి మైలురాయిగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఉన్నత విద్యతోపాటు కొన్ని రకాల ఉద్యోగాలకూ అర్హత లభిస్తుంది. ఆర్థిక అవసరాలు, ఆసక్తుల మేరకు అభ్యర్థులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టెన్త్‌ తర్వాత ఉన్న ఉద్యోగాల గురించి తెలుసుకుందాం. ఆయా నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌
మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలనూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భర్తీ చేస్తుంది. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18-25 ఏళ్లవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ 25, జనరల్‌ ఇంగ్లిష్‌ 50, జనరల్‌ అవేర్‌నెస్‌ 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పేపర్‌-2 డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో భాగంగా ఏదైనా అంశంపై పొట్టి వ్యాసం, ఉత్తరం రాయాల్సి ఉంటుంది. నచ్చిన భాషలో రాసుకునే వెసులుబాటు ఉంది.
వెబ్‌సైట్‌: www.ssc.nic.in

ఎయిర్‌ ఫోర్స్‌
భారత వాయుసేన (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌) పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఎయిర్‌ మెన్‌ (మ్యుజీషియన్‌ ట్రేడ్‌) ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇది గ్రూప్‌ వై ట్రేడ్‌ కిందికి వస్తుంది. ఈ విధానంలో ఎంపికైనవారు ఎయిర్‌ ఫోర్స్‌ బ్యాండ్‌లో పనిచేస్తారు. ఏదో ఒక మ్యూజిక్‌ పరికరంపై ప్రావీణ్యం ఉండాలి.
అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి పాసై ఉండాలి. వయసు 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎత్తు 157 సెం.మీ., ఛాతీ సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: మొదట రాతపరీక్ష ఉంటుంది. తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరంగా ఫిట్‌నెట్‌ పరిశీలించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్‌: www.indianairforce.nic.in

ఇండియన్‌ నేవీ
చెఫ్‌, స్టివార్డ్‌, శానిటరీ హైజీనిస్ట్‌ ఉద్యోగాలను మెట్రిక్‌ రిక్రూట్‌మెంట్‌ (ఎంఆర్‌) ద్వారా నేవీలో భర్తీ చేస్తున్నారు. పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో 17 -21 ఏళ్లలోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. రాత, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌ సైట్‌: www.joinindiannavy.gov.in

రైల్వేలో...
రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) పోస్టులకు రాతపరీక్ష, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు.
రైల్వేలో వివిధ విభాగాలు, సెక్షన్లలో హెల్పర్‌, హాస్పిటల్‌ అటెండెంట్‌, అసిస్టెంట్‌ పాయింట్స్‌ మెన్‌, గేట్‌మన్‌, పోర్టర్‌, హమాల్‌, స్వీపర్‌ కమ్‌ ఆపరేటర్‌ తదితర ఉద్యోగాలు పది అర్హతతో ఉన్నాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు (పీఈటీ)ల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. టికెట్‌ ఎగ్జామినర్‌, జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్టు ఉద్యోగాలను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా భర్తీ చేస్తారు. రైల్వే పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు.
వెబ్‌ సైట్లు: ‌www.indianrailways.gov.in & www.scr.indianrailways.gov.in

ఆర్‌బీఐలో ఆఫీస్‌ అటెండెంట్లు
ఆర్‌బీఐ ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులను పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేస్తుంది. ఇందులో ప్యూన్‌, దర్వాజ్‌, మజ్దూర్‌ అనే మూడు రకాల ఉద్యోగాలు ఉంటాయి. 18-25 ఏళ్లలోపు వారు అర్హులు. ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఎంపిక చేస్తారు. రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఉద్యోగంలో చేరినవారు సీనియర్‌ ఆఫీస్‌ అటెండెంట్‌గా పదోన్నతి పొందవచ్చు. డిగ్రీ పూర్తయితే శాఖాపరమైన పరీక్షల ద్వారా ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి.

పోస్టల్‌
పోస్టల్‌ శాఖలో పోస్టుమ్యాన్‌, మెయిల్‌ గార్డు ఉద్యోగాలను పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తున్నారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. వంద మార్కులకు నిర్వహించే ఆప్టిట్యూడ్‌ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, తెలుగు అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
* గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) - బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), మెయిల్‌ డెలివరర్‌ (ఎండీ), ప్యాకర్‌ పోస్టులను పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు. శాఖాపరమైన పరీక్షల ద్వారా వీరు పోస్టుమేన్‌, మెయిల్‌ గార్డు మొదలైన పదోన్నతులు పొందవచ్చు.
వెబ్‌సైట్‌: ‌www.indiapost.gov.in

చాలా ఉద్యోగాలకు కనీస వయసు పద్దెనిమిదేళ్లు నిండాలి. పదో తరగతి పూర్తయినవారికి ఆ వయసు ఉండదు కాబట్టి చదువు ఆపేయకుండా ఏదో ఒక కోర్సులో చేరడం మంచిది. అలా చేరడం వీలుకానివాళ్లు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ లేదా ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత పద్దెనిమిదేళ్లు నిండినవారు ఇంటర్‌ లేకుండానే నేరుగా డిగ్రీలోకి దూరవిద్య ద్వారా ప్రవేశం పొందవచ్చు. అన్ని యూనివర్సిటీలూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఎస్‌ఎస్‌సీ-కానిస్టేబుల్స్‌
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకు ప్రకటన విడుదల చేస్తుంది. పదో తరగతి అర్హతతో ఎక్కువ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్‌ ద్వారానే భర్తీ అవుతున్నాయి. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ ( ఎస్‌ఎఫ్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ వంటి విభాగాల్లో ఖాళీలను ఎస్‌ఎస్‌సీ ఉమ్మడి రాతపరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది.

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత. వయసు 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.

ఎంపిక: మూడు దశల్లో ఎంపిక చేపడతారు. మొదటి దశలో ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అయిదు కిలోమీటర్లు పరుగెత్తాలి. రెండో దశలో రాతపరీక్ష ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు. మూడో దశలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగానికి ఎంపికచేస్తారు.

వీఆర్‌ఏ
రాష్ట్రంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి గ్రామస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించే విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ) ఉద్యోగాలను పొందాలంటే టెన్త్‌ అర్హత సరిపోతుంది. ఇటీవల రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు రాతపరీక్షల ద్వారా ఈ భర్తీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
వెబ్‌సైట్‌: ‌www.psc.ap.gov.in & www. tspsc.gov.in

అటవీ శాఖ
రాష్ట్ర అటవీ శాఖల్లో బంగ్లా వాచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎత్తు: పురుషులకు 163 సెం.మీ., స్త్రీలకు 150 సెం.మీ.
ఎంపిక: తగిన శారీరక ప్రమాణాలను కలిగి ఉన్నవారికి రాతపరీక్ష ఉంటుంది. అందులో అర్హులైన వారికి నడక పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో నాలుగు గంటల లోపు పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని, మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని నడవాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్‌: www.forests.ap.gov.in & www.forests.telangana.gov.in

ఇండియన్‌ ఆర్మీ
ఇండియన్‌ ఆర్మీ పదో తరగతి అర్హతతో వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలను చేపట్టి అర్హులను ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. పదో తరగతితో ఆర్మీలో సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగాలు లభిస్తున్నాయి. సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ ఉద్యోగానికి 17 1/2 -21 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగానికి 17 1/2 - 23 ఏళ్లలోపువారు అర్హులు. ఈ ఉద్యోగంలోకి చేరినవారు తరువాత సిపాయి, నాయిక్‌, హవల్దార్‌ వంటి ప్రమోషన్లు పొందవచ్చు. రాత, దేహదార్ఢ్య పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు ఉంటాయి. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్య పరీక్షలు కూడా ఉంటాయి. ఏటా భర్తీ కార్యక్రమాలు (రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు) జరుగుతాయి.
వెబ్‌సైట్‌: www.indianarmy.nic.in

మరికొన్ని విభాగాలు
ఐటీబీపీఎఫ్‌: ఇండో - టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీఎఫ్‌)లో కానిస్టేబుల్‌ హోదాలోనే కుక్‌, వాషర్‌మన్‌, బార్బర్‌, వాటర్‌ క్యారియర్‌, సఫాయి కర్మచారి తదితర ఉద్యోగాలు లభిస్తాయి. పురుషులు మాత్రమే అర్హులు. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వెబ్‌సైట్‌: https://.itbpolice.nic.in

* ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో లేబర్‌ పోస్టులు పదో తరగతి విద్యార్హతతోనే భర్తీ చేస్తారు. అలాగే బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్‌ పోస్టులకు ఈ విద్యార్హతతోనే పోటీ పడవచ్చు.
* సీఐఎస్‌ఎఫ్‌లో కుక్‌, వాటర్‌ క్యారియర్‌, వాషర్‌, సఫాయీ కర్మచారి, బార్బర్‌ తదితర పోస్టులకు పదో తరగతే అర్హత. 18-23 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: www.cisf.gov.in/

* ఏపీఎస్‌/టీఎస్‌ ఆర్‌టీసీల్లో కండక్టర్‌ పోస్టులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పదో తరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తున్నారు.
* పదో తరగతి విద్యార్హతతోపాటు హెవీ వెహికిల్‌ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ మొదలైనవాటిలో డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ ఉద్యోగానికి ఈ లైసెన్స్‌ ఉన్నవారు అర్హులే.