Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

పదోతరగతి అర్హతతో ఆరేళ్ల బీటెక్‌

* తెలుగు రాష్ట్రాల ఆర్‌జీయూకేటీల్లోకి ప్రవేశ ప్రకటన విడుదల
ఇంజినీరింగ్‌ లక్ష్యంగా ఉన్న విద్యార్థులు పదోతరగతి పూర్తికాగానే ఆ దిశగా అడుగులు వేయవచ్చు. ఆర్‌జీయూకేటీలు అందుకు అవకాశం కల్పిస్తున్నాయి. సాంకేతిక విద్యతోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఈ సంస్థల ప్రత్యేకత.
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ యువతకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ)లను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. తెలంగాణలో ఒకటి బాసరలో, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలుల్లో ఉన్నాయి. ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ)ని ప్రధానంగా బోధనలో వినియోగించడం ఈ కేంద్రాల ప్రత్యేకత. పదోతరగతి తర్వాత ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లోకి 2018-19 విద్యాసంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఏపీలోని నాలుగు ఆర్‌జేయూకేటీలకు ఒకే దరఖాస్తు పంపవచ్చు. తెలంగాణ బాసరలోని కేంద్రానికి ప్రత్యేకంగా అప్లై చేయాలి.
అర్హతలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అభ్యర్థులు 2018లో పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. ఈ సంవత్సరం డిసెంబరు 31 నాటికి సాధారణ అభ్యర్థులకు 18; ఎస్సీ, ఎస్టీలకు 21 సంవత్సరాల వయసు నిండి ఉండకూడదు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో (ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్‌ ఆన్‌లైన్‌) పంపాలి. సంబంధిత కేంద్రాల్లో నిర్ణీత దరఖాస్తు రుసుములు చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు పంపితే చివరగా చేరిన దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక ప్రింట్‌ అవుట్‌ తీసుకొని దానికి ఫీజు రసీదు, ఇతర సర్టిఫికెట్ల కాపీలను జతచేసి నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు పంపాలి. తెలంగాణలో అందరూ ప్రింట్‌అవుట్‌లు పంపాల్సి ఉంటుంది.
ఏపీ అభ్యర్థుల్లో కేవలం ప్రత్యేక కేటగిరీ (పీహెచ్‌/సీఏపీ/ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌) వారు పంపితే సరిపోతుంది. మిగతా వాళ్లు ప్రింట్‌అవుట్‌ పోస్టు చేయాల్సిన అవసరం లేదు.
ఏపీ విద్యార్థులు నాలుగు ఆర్‌జీయూకేటీలకు ఒకే దరఖాస్తు పంపాలి. అందులో ఆ నాలుగు కేంద్రాలకు తమ ప్రాధాన్యాలను గుర్తించాలి.
ఎంపిక తీరు
పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్‌ ఏవరేజ్‌ (జీపీఏ) మెరిట్‌ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకే జీపీఏ ఉన్నవారికి సబ్జెక్టులవారీగా జీపీఏని పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. నాన్‌-రెసిడెన్షియల్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారు సాధించిన జీపీఏకి అదనంగా 0.4 డిప్రైవేషన్‌ స్కోరు కలిపి మెరిట్‌ లెక్కిస్తారు.
ఫీజు వివరాలు
ఆరేళ్ల కోర్సుకుగానూ మొదటి రెండేళ్ల వరకు ఏడాదికి తెలంగాణలో రూ.37 వేలు, ఏపీలో రూ.36 వేలు ఫీజు కట్టాలి. తర్వాత నాలుగు సంవత్సరాల బీటెక్‌కు ఏడాదికి రూ. 40 వేలు ఫీజు చెల్లించాలి.
ఏపీ, తెలంగాణ విద్యార్థులు కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లోని సంస్థల్లో చేరాలంటే రూ. 1,36,000 ఫీజు చెల్లించాలి. అదే తెలంగాణలో అయితే రూ. 1.37,000 కట్టాలి. ఎన్‌ఆర్‌ఐలకు ఏపీలో రూ. 3,00,000; తెలంగాణలో రూ. 3,01,000 ఫీజుగా నిర్ణయించారు.
స్థానికత ఆధారంగా సీట్లు
ఏపీలోని ప్రతి ఆర్‌జీయూకేటీ పరిధిలో కొన్ని జిల్లాలు ఉన్నాయి. దాని ప్రకారం ఆయా జిల్లాల అభ్యర్థులకు 85 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగతా 15 శాతం ఓపెన్‌ కేటగిరీలో భర్తీ చేస్తారు. తెలంగాణ బాసర కేంద్రంలో 85 శాతం సీట్లను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఇస్తారు. మిగతా 15 శాతం ఓపెన్‌లో మంజూరు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
తెలంగాణ
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 01-06-2018.
* ప్రింట్‌ అవుట్‌లు పంపడానికి చివరి తేదీ: 04-06-2018.
* సెలక్షన్‌ జాబితా విడుదల: 11-06-2018.
* తరగతులు ప్రారంభం: 03-07-2018.
వెబ్‌సైట్‌: www.rgukt.ac.in/
ఆంధ్రప్రదేశ్‌
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 08-06-2018.
* ప్రత్యేక కేటగిరీల వారు ప్రింట్‌ అవుట్‌లు
* పంపడానికి చివరి తేదీ: 11-06-2018.
* సెలక్షన్‌ జాబితా విడుదల: 16-07-2018.
* తరగతులు ప్రారంభం: 01-08-2018.
వెబ్‌సైట్‌: ‌www.rgukt.in/


posted on: 22-05-2018