Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీలో డిప్లొమా

చేనేత పరిశ్రమకు భారతదేశం ప్రసిద్ధి చెందింది. ఈ రంగం అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన ఉత్పత్తులే కీలకం. వీటికోసం మంచి మానవ వనరుల సేవలు అవసరం. ఈ దిశగా ఆలోచించి ఏర్పాటు చేసినవే హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ ఇన్‌ స్టిట్యూట్‌లు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు సంబంధించి ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో ఉంది. 1992లో వెంకటగిరిలో ఈ సంస్థను ప్రారంభించారు. ఇక్కడి ‘డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు 47 సీట్లు కేటాయించారు. వెంకటగిరితోపాటు హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ కోర్సు అందిస్తున్న సంస్థలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో తమిళనాడులోని సేలంలో 11, కర్ణాటకలోని గడగ్‌ లో 4 సీట్లు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత టెక్స్‌టైల్స్‌ తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇక్కడ చేరిన విద్యార్థులకు మొదటి ఏడాది రూ.1,000, రెండో సంవత్సరం రూ. 1,100, మూడో ఏట రూ. 1,200 ఉపకార వేతనంగా అందిస్తారు. బాలురకు వసతి గృహం అందుబాటులో ఉంది.

శిక్షణ ఇలా..: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆరు కేంద్ర సంస్థలు కాగా నాలుగు రాష్ట్రస్థాయివి. వెంకటగిరిలోని ఈ సంస్థ రాష్ట్ర స్థాయి కిందకి వస్తుంది. చేనేతకు సంబంధించి పరిశోధన, ప్రయోగాలు చేసి, నాణ్యమైన ఉత్పత్తులు అందించడానికి వీటిని నెలకొల్పారు. ఈ సంస్థలన్నీ మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌ టైల్స్‌ ఆధ్వర్యంలో ఉంటాయి. మూడేళ్ల డిప్లొమాలో స్పిన్నింగ్‌, డైయింగ్‌, ప్రింటింగ్‌, ఫినిషింగ్‌, డిజైన్‌, క్వాలిటీ పరీక్షలు, మార్కెటింగ్‌ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. మూడో సంవత్సరం కోర్సులో అదనంగా అపారెల్‌ గార్మెంట్రీ మేకింగ్‌ టెక్నాలజీ శిక్షణ ఇస్తున్నారు. పలు రకాలు వస్త్రాల తయారీలో మెలకువలు నేర్పుతారు. బ్యాగులు, ఇతర వస్తువుల తయారీలోనూ తర్ఫీదు అందిస్తారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చేనేత, జౌళి రంగంలోని పరిశ్రమల్లో కొలువులు సాధిస్తున్నారు. కోర్సు పూర్తి కాగానే కళాశాలలోనే వివిధ చేనేత, జౌళి పరిశ్రమలు ప్రాంగణ నియామకాలు చేపట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు అనుభవంతో విదేశాల్లోనూ అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన జౌళి, చేనేత విభాగాలు, సహకార సంఘాలు... మొదలైనవాటిలో వీరికి ఉపాధి లభిస్తుంది.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: జులై 1, 2018 నాటికి బీసీ, జనరల్‌ కేటగిరీలకు 15 - 23 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు

దరఖాస్తు: వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని పూరించాలి. దాంతోపాటు రూ. వంద డీడీ జతచేసి సంస్థ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్‌ 10


వెబ్‌సైట్‌: http://iihtvgr.com/index.htm


posted on: 04-06-2018