Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టెన్త్‌ తర్వాత?

అగ్రి కొలువులకు డిప్లొమార్గాలు!

కండలు కరిగించి.. శ్రమ ధారలు కురిపించి.. పొలాల్లో పచ్చదనం పరిచి.. అందరి కడుపులు నింపే అన్నదాతకు అండగా నిలిచే వృత్తి ఎంత సంతృప్తినిస్తుందో కదా! మొక్కల పెంపకంతో మొదలు పెట్టి.. మట్టి రకాలను గుర్తుపట్టి.. విత్తనాలను వృద్ధి చేసి.. అధిక పంట ఉత్పత్తిని అందించడంలో రైతుకు అడుగడుగునా సాయం చేసే కొలువులకు ఇప్పుడు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కోర్సులతో ఆ అవకాశాలను అందుకోవచ్చు. అలాంటి పలు రకాల డిప్లొమాలను పదో తరగతి తర్వాత కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.

కాలానుగుణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో ఇవి కేవలం మానవ వనరులపైనే ఆధారపడేవి. క్రమేణా దానిలో సాంకేతిక పరిజ్ఞానం, కొత్త విధానాలు చోటు చేసుకున్నాయి. ఉత్పాదకతను పెంచడంలో.. విభిన్న పనిముట్లు, ఫెర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌, బయాలజీ సంబంధిత అంశాల వంటి వాటి పాత్ర పెరిగింది. దీంతో తగిన సమాచారాన్ని, జాగ్రత్తలను అందించడానికి నిపుణుల అవసరం ఎక్కువైంది.ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో పాలిటెక్నిక్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక విభాగాల్లోని ఈ కోర్సులను పూర్తిచేస్తే అగ్రి ఇంజినీర్‌, అగ్రి మేనేజర్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, అగ్రి ఇన్‌స్పెక్టర్‌, హేచరీ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాల్లో చేరవచ్చు. వాటిని ఫుడ్‌ ప్రొడక్షన్‌ సంస్థలు, ప్రభుత్వ వ్యవసాయ సంబంధిత సంస్థలు, ఫెర్టిలైజర్లు, హేచరీలు, పాల ఉత్పత్తి సంస్థలు అందిస్తాయి.

వ్యవసాయం.. ఉద్యానం
డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌
కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఏడాదికి రెండు సెమిస్టర్లుంటాయి. తెలుగు మాధ్యమంలో ఉంటుంది. కోర్సులో భాగంగా అగ్రానమీ, మొక్కల జన్యువులు, వివిధ రకాల పెంపకం, మట్టి రకాలు, అగ్రికల్చరల్‌ కెమిస్ట్రీ, ఎంటమాలజీ, ఫామ్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ మొదలైన అంశాల గురించి తెలుసుకుంటారు.కోర్సు అందిస్తున్న సంస్థలు..
ఆంధ్రప్రదేశ్‌: గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అనకాపల్లి (విశాఖపట్నం); రంపచోడవరం (తూర్పుగోదావరి); మారుటేరు (పశ్చిమగోదావరి జిల్లా); గరికపాడు, ఘంటశాల (ఈ రెండూ కృష్ణాజిల్లాలోనివి); దర్శి (ప్రకాశం జిల్లా); నెల్లూరు, సోమశిల (నెల్లూరు జిల్లా); కలికిరి, తిరుపతి (చిత్తూరు); ఊటుకూరు (కడప), నంద్యాల (కర్నూలు), రెడ్డిపల్లి, మడకశిర, రామగిరి (అనంతపురంలోనివి) అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలు.
తెలంగాణ: హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ పరిధిలో పాలెం (నాగర్‌కర్నూలు; నల్గొండ; బసంత్‌పూర్‌ (సంగారెడ్డి); వరంగల్‌; మధిర (ఖమ్మం); సంగుపేట (సంగారెడ్డి); జమ్మికుంట (కరీంనగర్‌); నంగిరెడ్డిపేట (కరీంనగర్‌); కామారెడ్డి, మాల్తుమ్మెడా (కామారెడ్డి); తోర్నాల (సిద్ధిపేట); శారదాపుర (రాజన్న సిరిసిల్ల) అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు.

అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ & టెక్నాలజీ
వ్యవసాయ సంబంధ ఉత్పాదకతను పెంచడంలో అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ది ప్రధాన పాత్ర. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఆంగ్లమాధ్యమంలో ఉంటుంది. ఏడాదికి రెండు సెమిస్టర్లు. కోర్సులో భాగంగా ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, అగ్రానమీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, లాండ్‌ సర్వేయింగ్‌, సాయిల్‌ సైన్స్‌, గ్రీన్‌హౌజ్‌ టెక్నాలజీ, సోలార్‌, విండ్‌ ఎనర్జీ, బయో ఎనర్జీ, అగ్రి ఎకనామిక్స్‌ మొదలైన అంశాలను నేర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కోర్సు అందిస్తున్న సంస్థలు...
ఆంధ్రప్రదేశ్‌: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో అనకాపల్లి, కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలలు.
తెలంగాణ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్‌ (హైదరాబాద్‌) పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌.

డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌
కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఏడాదికి రెండు సెమిస్టర్లుంటాయి. మాధ్యమం తెలుగు.సేంద్రియ పద్ధతుల్లో పంటల పెంపకం, వివిధ పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనాలు, రకాలు మొదలైన విషయాలను నేర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కోర్సు అందిస్తున్న సంస్థలు..
ఆంధ్రప్రదేశ్‌: అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌, చింతపల్లి, విశాఖపట్నం
తెలంగాణ: గింగుర్తి

డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌
వివిధ రకాల పండ్లు, పూల మొక్కలకు సంబంధించిన కోర్సు ఇది. మొక్కల పెంపకం, పెంపకంలో జాగ్రత్తలు, వ్యాధులు మొదలైన వాటన్నింటి గురించీ తెలుసుకుంటారు. తోటలు, ఉద్యానవనాల పెంపకంపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, ఔషధాలు, డెకరేటివ్‌ పూలు మొదలైనవాటి పెంపకం ఇందులో భాగం. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధన ఉంటుంది. పదో తరగతి మెరిట్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కోర్సును అందిస్తున్న సంస్థలు..
ఆంధ్రప్రదేశ్‌: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో బీ ఎస్‌కేపీపీ హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌, రామచంద్రాపురం, తూర్పు గోదావరి బీ హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌, నూజివీడు, కృష్ణా జిల్లా బీ ఎస్‌ఎస్‌పీజీ హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌, మడకశిర, అనంతపురం బీ హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌, కలికిరి, చిత్తూరు
తెలంగాణ: శ్రీ కొండాలక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో దస్నాపూర్‌ (ఆదిలాబాద్‌), రామగిరి ఖిల్లా (కరీంనగర్‌) ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలలు.

మెరిట్‌ ఆధారంగా సీట్లు
వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేకంగా రాతపరీక్ష ఏమీలేదు. నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా జూన్‌లో ప్రకటనలు వెలువడతాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలతోపాటు ప్రైవేటు (అఫ్లియేటెడ్‌) పాలిటెక్నిక్‌ సంస్థలూ కోర్సులను అందిస్తున్నాయి. పది లేదా తత్సమాన విద్య పూర్తి చేసుండాలి. పదోతరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అలాగే ఒకటి నుంచి పదో తరగతి మధ్యలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. పదోతరగతి కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైనవారూ, ఇంటర్‌ చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ పూర్తయినవారు మాత్రం అనర్హులు. వయసు 15 నుంచి 22 మధ్య ఉండాలి.

జంతువులు, చేపలు
డిప్లొమా ఇన్‌ యానిమల్‌ హజ్బెండరీ
పశువులు, కోళ్లు, బాతుల వంటివాటికి సంబంధించిన కోర్సు ఇది. ప్రాథమిక పశు అంతర్నిర్మాణం, పశువులు, కోళ్ల పరిశ్రమల యాజమాన్యం, హేచరీలు, పాల సేకరణ, రవాణా మొదలైన అంశాలను విద్యార్థులు తెలుసుకుంటారు. కాలవ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధన ఉంటుంది. కోర్సును అందిస్తున్న సంస్థలు...
ఆంధ్రప్రదేశ్‌: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, తిరుపతి పరిధిలో పలమనేరు (చిత్తూరు), మడకశిర, రాపూరు (నెల్లూరు), గరివిడి (విజయనగరం జిల్లా), వెంకట్రామన్నగూడెం (పశ్చిమగోదావరి జిల్లా), రామచంద్రాపురం (తూర్పుగోదావరి జిల్లా), బనవాసి (కర్నూల్‌ జిల్లా)ల్లోని యానిమల్‌ హజ్బెండరీ కాలేజీలు.
తెలంగాణ: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ పరిధిలోని కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్ధిపేట, మమ్మూరు (వరంగల్‌ జిల్లా)ల్లోని యానిమల్‌ హజ్బెండరీ పాలిటెక్నిక్‌ కళాశాలలు.

ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌
చేపలు, రొయ్యల పెంపకం, సేకరణ పద్ధతుల గురించి ఈ కోర్సు ఉంటుంది. వివిధ రకాల నీరు/ మెరైన్‌ వాతావరణంలో వాటిని ఎలా పెంచవచ్చో అభ్యర్థులు తెలుసుకుంటారు. కాలవ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధిస్తారు.
ఆంధ్రప్రదేశ్‌: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, తిరుపతి పరిధిలో ఫిషరీ పాలిటెక్నిక్‌, భావదేవరపల్లి, కృష్ణా

డెయిరీ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌
పాలు, పాల సంబంధ ఉత్పత్తులకు సంబంధించిన కోర్సు ఇది. ఇందులో భాగంగా డెయిరీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, డెయిరీ ఇంజినీరింగ్‌, డెయిరీ టెక్నాలజీ, క్వాలిటీ అస్యూరెన్స్‌ అంశాలను నేర్చుకుంటారు. కాలవ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధిస్తారు. నాలుగో సెమిస్టర్‌లో ఇన్‌ప్లాంట్‌ శిక్షణ కూడా ఉంటుంది. ఒకే ఒక ప్రైవేటు సంస్థలో కోర్సు అందుబాటులో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధిలోని డెయిరీ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌, గుంటూరు.

posted on: 09-04-2019