Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టెన్త్‌ తర్వాత?

ఉపాధికి వారధి!

ఏం చదివినా... ఎంతటి పుస్తక పరిజ్ఞానాన్ని సంపాదించినా.. ఆచరణాత్మక శిక్షణ ఇచ్చే ఆత్మవిశ్వాసం వేరు. సరిగ్గా ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు (ఐటీఐ). ఇవి నైపుణ్యాభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. వీటిలో చేరిన అభ్యర్థులకు ప్రాక్టికల్‌ శిక్షణతో నైపుణ్యాలను పెంచుతున్నాయి. పదోతరగతి అర్హతతో ఈ ట్రెయినింగ్‌ అందుకొని సరాసరి పరిశ్రమల్లోకి చేరి చిన్న వయసులోనే ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు. కాదనుకుంటే స్వయం ఉపాధితో గౌరవప్రదమైన జీవితాన్ని గడపవచ్చు.
కొత్తతరం చదువులు ఎన్ని వచ్చినా వన్నె తగ్గని కోర్సు ఐటీఐ. చిన్నవయసులోనే చింతలేని జీవితాన్ని పారిశ్రామిక శిక్షణ కోర్సులు ప్రసాదిస్తాయి. కేంద్రంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌, మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఆధ్వర్యంలో ఐటీఐలు నడుపుతున్నారు.

టెన్త్‌ మెరిట్‌తో ప్రవేశం
పదోతరగతి అర్హతతో ఏడాది, రెండేళ్ల వ్యవధితో పలు రకాల (ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌) కోర్సులు అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 130కి పైగా స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. పదిలో సాధించిన మార్కుల (గ్రేడ్‌)తో కోర్సులో చేరడానికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రవేశ ప్రకటనలు సాధారణంగా జూన్‌లో వెలువడతాయి. ఐటీఐ శిక్షణ అనంతరం ఆలిండియా ట్రేడ్‌ టెస్టులో ఉత్తీర్ణులకు నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ట్రేడ్‌లు
రెండేళ్ల వ్యవధితో: అటెండెంట్‌ ఆపరేటర్‌ (కెమికల్‌ ప్లాంట్‌), డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌/ మెకానికల్‌), ‌ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌, ఇన్ స్ట్రుమెంట్స్ మెకానిక్‌, ఇన్ స్ట్రుమెంట్స్‌ మెకానిక్‌ (కెమికల్‌ ప్లాంట్‌), మెషినిస్ట్‌, మెషినిస్ట్‌ (గ్రైండర్‌), మెరైన్‌ ఫిట్టర్‌, మెకానిక్‌ (మోటార్‌ వెహికల్‌/ రెఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌), మెకానిక్‌ మెషీన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌, పెయింటర్‌ జనరల్‌, టర్నర్‌, వెసెల్‌ నేవిగేటర్‌, వైర్‌మెన్‌
ఏడాది వ్యవధితో: కార్పెంటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగామింగ్‌ అసిస్టెంట్‌, డ్రెస్‌ మేకింగ్‌, ఫౌండ్రీమెన్‌, మాసన్‌ (బిల్డింగ్‌ కన్‌స్ట్రక్టర్‌), ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ ఆపరేటర్‌, ప్లంబర్‌, వెల్డర్‌, సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌ (ఇంగ్లిష్‌), సూయింగ్‌ టెక్నాలజీ, షీట్‌ మెటల్‌ వర్కర్‌, స్టెనోగ్రాఫర్‌ అండ్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌), మెకానిక్‌ (డీజిల్‌/ఆటో బాడీ పెయింటింగ్‌/ ఆటో బాడీ రిపేర్‌)

అప్రెంటిస్‌
ప్రభుత్వం 2015లో ప్రారంభించిన స్కిల్‌ ఇండియా కార్యక్రమం ద్వారా ఐటీఐ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుని దేశ, విదేశాల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఐటీఐ తర్వాత అప్రెంటిస్‌ చేయడానికి పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. https://apprenticeshipindia.org లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. చదువు పూర్తయిన తర్వాత సంబంధిత ట్రేడుల్లో అప్రెంటిస్‌ చేసినవాళ్లు లోతైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఉద్యోగ నియామకాల్లోనూ అప్రెంటిస్‌ ఉన్నవారికి కొంత ప్రాధాన్యం లభిస్తుంది.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు కంపెనీలు సైతం పెద్దఎత్తున అప్రెంటీస్‌ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. భారతీయ రైల్వే వేల సంఖ్యలో అప్రెంటిస్‌లను తీసుకుంటోంది. మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు సైతం అప్రెంటిస్‌ అవకాశాలు పెంచాయి. ఈ విధానంలో చేరినవారికి ప్రతినెలా కొంత మొత్తంలో స్టయిపెండ్‌ చెల్లిస్తున్నాయి. తాజాగా వెలువడిన రైల్వే లెవెల్‌-1 పోస్టుల్లో 20 శాతం ఖాళీలను రైల్వేలో అప్రెంటీస్‌ పూర్తిచేసుకున్నవారికోసం కేటాయించారు. 20 వేలకుపైగా పోస్టులు అప్రెంటీస్‌లతోనే భర్తీ కానున్నాయి.

ఉన్నత చదువులు
ఐటీఐ అనంతరం ఉన్నత చదువుల దిశగా అడుగులేయాలనుకున్నవారు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కొన్ని బ్రాంచీల్లో నేరుగా ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంది. డిప్లొమా తర్వాత ఆసక్తి ఉంటే ఈసెట్‌ ద్వారా నేరుగా రెండో సంవత్సరం బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.నాన్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో ఐటీఐ ట్రేడ్‌లు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ కోర్సులు చదువుకోవచ్చు.

ఉద్యోగావకాశాలు
ఐటీఐ విద్యార్హతతో ఎక్కువగా రైల్వేల్లో సాంకేతిక పోస్టులు భర్తీ చేస్తున్నారు. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చదువుకున్నవారితోనే ప్రధానంగా టెక్నికల్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
రైల్వేల్లో: అసిస్టెంట్‌ లోకో పైలట్‌, టెక్నీషియన్‌ పోస్టులను వేల సంఖ్యలో భర్తీ చేస్తున్నారు. ఈ రెండు పోస్టులకూ కలిపి ప్రకటన వెలువడుతుంది. ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌/ ఫిట్టర్‌/ టర్నర్‌/ వైర్‌మెన్‌...తదితర విభాగాల్లో ఎందులోనైనా ఐటీఐ కోర్సులు పూర్తిచేసుకున్నవారు అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ఐటీఐ చేసినవాళ్లు టెక్నీషియన్‌ ఉద్యోగాలకు పోటీపడవచ్చు.
రాష్ట్రస్థాయిలో: సర్వేయర్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు ఎక్కువ గిరాకీ ఉంది. ఎలక్ట్రికల్‌ లేదా వైర్‌మెన్‌ ట్రేడుల్లో ఐటీఐ చేస్తే జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్వేయింగ్‌ ఒక సబ్జెక్టుగా డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌) ట్రేడ్‌ రెండేళ్ల కోర్సు పూర్తయితే డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్మీలో: సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులను ఐటీఐ విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు. ప్రకటనలు ఏటా వెలువడుతున్నాయి. పారా మిలటరీ విభాగాల్లో ఐటీఐ చదివినవారికి అవకాశాలు లభిస్తున్నాయి.
ఐటీఐల్లో కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్లలో (ఏటీఐ పేరు ఎన్‌ఎస్‌టీఐగా మారింది) శిక్షణ పొందవచ్చు. ఐటీఐల్లో ఇన్‌స్ట్రక్టర్లుగా సేవలు అందించాలనుకునేవారికి క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ట్రైనింగ్‌ స్కీం అందుబాటులో ఉంది. విద్యానగర్‌ (హైదరాబాద్‌)లో ఎలక్ట్రీషియన్‌, వైర్‌మెన్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, మోటార్‌ వెహికల్‌ మెకానిక్‌, వెల్డర్‌ ట్రేడ్‌ల్లో ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సు అందిస్తున్నారు. ప్రభుత్వ ఐటీఐల్లో క్యాంపస్‌ నియామకాలు సైతం నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌), ఓవర్‌సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఓమ్‌క్యాప్‌) విదేశీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.

posted on: 10-04-2019