Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

టెన్త్‌ తర్వాత?

వృత్తి నైపుణ్య ప్రాప్తిరస్తు!

పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ముందు ఉన్న అవకాశాల్లో ఒకేషనల్‌ విద్య ఒకటి. చదువు పూర్తిచేసుకున్న వెంటనే ఉపాధి ఆశించే విద్యార్థులకు ఈ కోర్సులు తగినవి. రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు పూర్తయిన తర్వాత ఆసక్తి ఉన్నవారు ఉన్నత విద్యలోనూ చేరవచ్చు. బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేసుకుని ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, బీఎస్సీ తదితర విభాగాల్లోకి వెళ్లిపోవచ్చు. పాలిటెక్నిక్‌లో అయితే నేరుగా ద్వితీయ సంవత్సరంలో చేరిపోవచ్చు.

రోజు రోజుకీ టెక్నాలజీలో వస్తున్న మార్పులతో ప్రత్యేక నైపుణ్యాలున్న సిబ్బంది అవసరం ఎక్కువవుతోంది. అలాంటి నిపుణులను అందించడానికే వృత్తివిద్యా కోర్సులను రూపకల్పన చేశారు. టెన్త్‌ తర్వాత అలాంటి నైపుణ్యాలను నేర్చుకోడానికి ఇంటర్మీడియట్‌లోనే ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. ఏదైనా ఒక విభాగంలో ప్రత్యేక ప్రావీణ్యం ఆశించి జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునేవారు ఈ కోర్సుల్లో చేరవచ్చు. వీటిలో ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి పొందేలా వీటిని రూపొందించారు. ఇంటర్‌, డిగ్రీ స్థాయుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమలు, సేవా రంగాల అవసరాల ప్రకారం వీటిని రూపొందించారు. పది ఫలితాలు వెలువడిన తర్వాత జూన్‌లో ప్రవేశాలు ఉంటాయి. పదో తరగతి గ్రేడ్‌తో సీట్లు కేటాయిస్తారు. కోర్సు చివరలో జాబ్‌ మేళాల ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

ఇంటర్‌ బోర్డు అందిస్తున్న కోర్సులు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల వ్యవధి ఉన్న 27 ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులున్నాయి. వీటిని 6 విభాగాల్లో అందిస్తున్నారు.

అగ్రికల్చరల్‌:
* క్రాప్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
* డెయిరీయింగ్‌
* ఫిషరీస్‌
* సెరికల్చర్‌

బిజినెస్‌ అండ్‌ కామర్స్‌: ‌
* అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌ ‌
* మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌మెన్‌షిప్‌ ‌
* ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్‌ ‌
* బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ‌
* ఇన్సూరెన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ: ‌
* ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్‌ ‌
* కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ
* కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
* ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్‌
* ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ అప్లయన్సెస్‌ సర్వీసింగ్‌ ‌
* రూరల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్‌
* వాటర్‌ సప్లై అండ్‌ శానిటరీ ఇంజినీరింగ్‌
* డీటీపీ అండ్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ

హోమ్‌ సైన్స్‌:
* కమర్షియల్‌ గార్మెంట్స్‌ డిజైనింగ్‌ అండ్‌ మేకింగ్‌
* ఫ్యాషన్‌ గార్మెంట్‌ మేకింగ్‌
* హోటల్‌ ఆపరేషన్స్‌
* ప్రీ స్కూల్‌ టీచర్‌ ట్రెయినింగ్‌

హ్యుమానిటీస్‌ అండ్‌ అదర్స్‌:
* కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్‌
* టూరిజం అండ్‌ ట్రావెల్‌ టెక్నిక్‌

హెల్త్‌ అండ్‌ పారా మెడికల్‌:
* మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌
* మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌
* ఆఫ్తల్మాలిక్‌ టెక్నీషియన్‌ )ల ఫిజియోథెరపీ

కొన్ని ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సుల్లో చేరినవాళ్లు బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసుకుని ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ కోర్సుల్లో చేరవచ్చు. బీఏ, బీకాం కోర్సులనూ చేసుకోవచ్చు. బీఎస్సీలో చేరడానికి బ్రిడ్జ్‌ కోర్సు అర్హత తప్పనిసరి.
http://bieap.gov.in/ Vocationalcourses.aspx
http://bie.telangana.gov.in/vocational_courses.html

ఇతర సంస్థల్లో
ఓపెన్‌ స్కూలింగ్‌...
కాలేజీకి వెళ్లి చదవడం సాధ్యం కానివారికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ చక్కని మార్గం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థ ఇది. పదో తరగతి పూర్తిచేసుకున్నవారు ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌, ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌, రేడియో అండ్‌ టీవీ టెక్నీషియన్‌, రెఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, ఫర్నిచర్‌ అండ్‌ క్యాబిన్‌ మేకింగ్‌, ఎల‌్రక్టోప్లేటింగ్‌, ఎల్డర్లీ కేర్‌, కమ్యూనిటీ హెల్త్‌, యోగా అసిస్టెంట్‌, హౌస్‌ కీపింగ్‌, క్యాటరింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హోటల్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌, ప్రిజర్వేషన్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటేబుల్స్‌ తదితర కోర్సుల్లో చేరవచ్చు. ఎన్‌ఐఓఎస్‌కు హైదరాబాద్‌, విశాఖపట్నంలో ప్రాంతీయ కేంద్రాలున్నాయి.
వెబ్‌సైట్‌: https://www.nios.ac.in/

స్వామీ రామానంద తీర్థ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌
టైలర్‌, జర్దోసీ, ఆర్నమెంటలిస్టు, జిగ్‌జాగ్‌ మెషిన్‌ ఎంబ్రాయిడరీ, యాక్సెసరీస్‌ డిజైనర్‌, బేసిక్‌ ఆటోమోటివ్‌ సర్వీసింగ్‌ (2, 3 వీలర్‌), డొమెస్టిక్‌ ఎలక్ట్రీషియన్‌, రిపయిరింగ్‌ ఆఫ్‌ పర్సనల్‌ ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌, సూయింగ్‌ మెషిన్‌ ఆపరేటర్‌ తదితర కోర్సులను స్వామీ రామానంద తీర్థ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, భూదాన్‌పోచంపల్లి, యాదగిరి భువనగిరి జిల్లా అందిస్తోంది. ఇవన్నీ 3 లేదా 4 నెలల వ్యవధితో పూర్తయ్యే స్వల్పకాల వ్యవధి కోర్సులే. స్వయం ఉపాధి లక్ష్యంగా వీటిని రూపొందించారు. ఏటా 3 విడతల్లో వీటిలో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. ఉచితంగా భోజనం, వసతి కల్పిస్తారు. ఎలాంటి ఫీజూ వసూలు చేయరు. కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి లేదా ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే అర్హులు.
వెబ్‌సైట్‌: http://www.srtri.com/

సెట్విన్‌..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ సంస్థ పనిచేస్తోంది. 8, 10 పాస్‌, ఫెయిల్‌; ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలతో ఇక్కడ పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నెల నుంచి ఏడాది వ్యవధితో వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులకు సెట్విన్‌ డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ కోర్సు 6 నెలల వ్యవధితో అందిస్తోంది. 3 నెలల వ్యవధితో అడ్వాన్స్‌డ్‌ బ్యుటీషియన్‌ కోర్సు ఉంది. గార్మెంట్‌ మేకింగ్‌లో 6 నెలల కోర్సు నిర్వహిస్తున్నారు. వెబ్‌ డిజైనింగ్‌, యాంకరింగ్‌, ఫొటోగ్రఫీలో శిక్షణ ఇస్తున్నారు.
వెబ్‌సైట్‌: http://www.setwin.in/

Posted on: 11-04-2019