అత్యున్నత గౌరవంతో ఆకాశాన్ని అందుకోండి.. ఇది భారత వాయుసేన నినాదం. ఎయిర్‌ఫోర్స్‌లో చేరితే నిజంగా అంత స్థాయి.. అంతే ఆనందం దక్కుతాయి. ఒక అధికారిగా, యోధుడిగా భారత రాజ్యాంగాన్ని, స్వాంతంత్య్రాన్ని కాపాడే కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. ఆ అవకాశాన్ని అర్హులైన యువతకు కల్పించే ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు ప్రకటన విడుదలైంది. సాధారణ డిగ్రీ, బీటెక్‌ పూర్తిచేసిన వారు, కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవారూ పోటీ పడవచ్చు. మహిళా అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పిల్లల్లో చాలామంది పెద్దయిన తర్వాత పైలట్‌ అవుతా అంటుంటారు. విమానం అనే గొప్ప వాహనాన్ని నడిపే పెద్ద ఉద్యోగి పైలట్‌ అనే ముద్ర అప్పటికే వారి మనసుల్లో పడిపోయి ఉంటుంది. జనంలో అంత ప్రసిద్ధి పొందిన ఆ కొలువులోకి పైసా ఖర్చు లేకుండా చేరవచ్చు. అందుకు సులువైన మార్గం ఏఎఫ్‌క్యాట్‌ (ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌). ఈ నోటిఫికేషన్‌ ఏటా రెండుసార్లు వస్తుంది. మొదటిది డిసెంబరు లేదా జనవరిలో విడుదలవుతుంది. రెండోది జూన్‌లో వస్తుంది. రెండో విడద పరీక్షకు ప్రస్తుతం ప్రకటన వెలువడింది.

ఏయే ఉద్యోగాలు?
టెక్నికల్, నాన్‌-టెక్నికల్‌ ఈ రెండు విభాగాల్లోనూ పలురకాల ఉద్యోగాలు ఉంటాయి. ఫ్లయింగ్‌ విభాగంలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)కి; గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌ అండ్‌ నాన్‌-టెక్నికల్‌) బ్రాంచిలో పర్మినెంట్‌ కమిషన్‌ (పీసీ), షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టులు 256. ఫ్లయింగ్‌ విభాగంలో పోస్టులు 74 ఉన్నాయి. ఇందులో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ కూడా ఉంది. ఏఎఫ్‌ క్యాట్‌లోని 10 శాతం ఎస్‌ఎస్‌సీ పోస్టులను ఈ ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీకి కేటాయిస్తారు. గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌) పీసీ - 63, ఎస్‌ఎస్‌సీ-42; గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌-టెక్నికల్‌) పీసీ - 31, ఎస్‌ఎస్‌సీ - 24 ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు మెటియోరాలజీ విభాగానికి పీసీ - 10, ఎస్‌ఎస్‌సీ-12 పోస్టులకు ప్రకటన వెలువడింది.

అర్హతలేమిటి?
ఫ్లయింగ్‌ బ్రాంచి, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ/బీటెక్‌ లేదా ఏఎంఐఈ అభ్యర్థులూ అర్హులే. ఇంటర్‌ / ప్లస్‌-2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివి ఉండాలి. వాటిలో 50 శాతం మార్కులు తప్పనిసరి.ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సీ సర్టిఫికెట్‌ ఉండాలి.

వయసు: జులై 1, 2021 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 1997 - జులై 1, 2001 మధ్య జన్మించినవారు అర్హులు. ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి. డీజీసీఏ (ఇండియా) ద్వారా కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ పొంది ఉన్నవారి 26 ఏళ్ల గరిష్ఠ వయసు పరిమితి వర్తిస్తుంది.

గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచి: ఇందులో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎల్రక్టానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. ఇంటర్‌/ ప్లస్‌-2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.

గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచి: ఇందులో అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్‌ విభాగాలు ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్‌ ఉద్యోగాలకు 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీలో 60శాతం మార్కులు పొంది ఉండాలి. ఎడ్యుకేషన్‌ విభాగానికి 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీని 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

మెటియోరాలజీ విభాగం: 10+2 విధానంలో సైన్స్‌ విభాగంలో పీజీని మ్యాథ్స్‌/స్టాటిస్టిక్స్‌/జాగ్రఫీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఎన్వైరాన్‌మెంటల్‌ సైన్స్‌/అప్లైయిడ్‌ ఫిజిక్స్‌/ ఓషనోగ్రఫీ/మెటియోరాలజీ/అగ్రికల్చరల్‌ మెటియోరాలజీ/ ఎకాలజీ అండ్‌ ఎన్వైరాన్‌మెంట్‌/ జియో-ఫిజిక్స్‌/ ఎన్వైరాన్‌మెంటర్‌ బయాలజీ 50 శాతం మార్కులతో పొంది ఉండాలి. గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులను 55 శాతం మార్కులతో పాసై ఉండాలి.

వయసు: గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌-టెక్నికల్‌ పోస్టులకు జులై 1, 2021 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 1995 - జులై 1, 2001 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేసే పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ. ఎత్తు ఉండటం తప్పనిసరి.

ఎంపిక ఎలా?
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ను ఆధార్‌ కార్డు తప్పనిసరి. అన్ని పోస్టులకూ రాత పరీక్ష ఒకటే ఉంటుంది. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్, వెర్బల్‌ ఎబిలిటీ ఇన్‌ ఇంగ్లిష్, న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి 300 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు. వ్యవధి రెండు గంటలు. టెక్నికల్‌ బ్రాంచీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాయాల్సి ఉంటుంది. ఇందులో సంబంధిత ఇంజినీరింగ్‌ బ్రాంచి నుంచి 50 ప్రశ్నలను 150 మార్కులకు ఇస్తారు. సమయం 45 నిమిషాలు. ఈ రెండు పరీక్షల్లోనూ ప్రశ్నలను ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే ఇస్తారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా సమాధానం గుర్తించిన ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కోత విధిస్తారు.

సిలబస్‌
వెర్బల్‌ ఎబిలిటీ ఇన్‌ ఇంగ్లిష్‌: కాంప్రహెన్షన్, ఎర్రర్‌ డిటెక్షన్, సెంటెన్స్‌ కంప్లీషన్, ఫిల్లింగ్‌ సిననిమ్స్, యాంటనిమ్స్, ఒకాబులరీ, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌.
జనరల్‌ అవేర్‌నెస్‌: హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, పాలిటిక్స్, కరెంట్‌ అఫైర్స్, ఎన్వైరాన్‌మెంట్, బేసిక్‌ సైన్స్, ఆర్ట్, కల్చర్, స్పోర్ట్స్‌ మొదలైనవి.
న్యూమరికల్‌ ఎబిలిటీ: డెసిమల్‌ ఫ్రాక్షన్, టైమ్‌ అండ్‌ వర్క్, యావరేజి, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, పర్సెంటేజి, రేషియో అండ్‌ ప్రపోర్షన్, సింపుల్‌ ఇంట్రస్ట్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌ (ట్రెయిన్స్‌/బోట్స్‌ అండ్‌ స్ట్రీమ్స్‌).
రీజనింగ్‌ అండ్‌ మిలటరీ ఆప్టిట్యూడ్‌: వెర్బల్‌ స్కిల్స్, స్పేషియల్‌ ఎబిలిటీ (మెంటల్‌ ఎబిలిటీ)ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఇస్తారు. మిగిలినవి డిగ్రీ స్థాయిలో ఉంటాయి.

మరో రెండు దశల్లో..!
రాత పరీక్షలో ఉత్తీర్ణులకు స్టేజ్‌ 1, 2 పరీక్షలు ఉంటాయి. వీటిని ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. 10 పుష్‌-అప్స్, 3 చిన్‌-అప్స్‌ తీయగలగాలి. స్టేజ్‌ -1 స్క్రీనింగ్‌ టెస్టు. ఇందులో ఆఫీసర్‌ ఇంటలిజెన్స్‌ రేటింగ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్‌మెంట్స్, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దానిపై విశ్లేషణ చేయమంటారు. ఇందులో అర్హత సాధించినవారినే స్టేజ్‌ -2కి తీసుకుంటారు. స్టేజ్‌ -2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయి. అనంతరం ఇండోర్, అవుట్‌డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటిలో మానసిక, శారీరక పరీక్షలు ఉంటాయి. అనంతరం వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు.ఫ్లయింగ్‌ బ్రాంచికి దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ తర్వాత కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష ఉంటుంది.ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి ఆరోగ్య పరీక్షలు చేపడతారు. అందులోనూ విజయవంతమైతే మెరిట్‌ లిస్టు తయారుచేసి శిక్షణ కోసం ఎంపిక చేస్తారు.

శిక్షణ, ప్రోత్సాహ‌కాలు
జులై, 2021 నుంచి ఎంపికైన అభ్యర్థుల్లో ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌) విభాగాలకు 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌-టెక్నికల్‌) వారికి 52 వారాలు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ. 56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విధుల్లో చేరిన తర్వాత రూ. 56,100 మూలవేతనంతోపాటు డీఏ తదిత అలవెన్స్‌లు ఉంటాయి. దాంతోపాటు మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌సీ) నెలకు రూ. 15,500 ఇస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచి పైలట్లకు ప్రత్యేక అలవెన్స్‌గా రూ. 25,000 అందుతాయి. టెక్నికల్‌ ఉద్యోగులకూ ప్రత్యేక అలవెన్స్‌ ఉంటుంది. వాటితో పాటు ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 14, 2020.
పరీక్షల తేదీ: సెప్టెంబరు 19/20.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, తిరుపతి.
వెబ్‌సైట్‌: https://afcat.cdac.in
https://careerindianairforce.cdac.in/

#Government Jobs #Air Force #Pilot #AFCAT Preparation #AFCAT Model Papers #AFCAT Notification #Technical #Non-technical


Posted on 15-06-2020