ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > కరెంట్‌ అఫైర్స్‌ ప్రిపరేషన్‌ విధానం

కలిపి చదివితే కలదు లాభం!

సమయం తక్కువ.. చదవాల్సింది ఎక్కువ. అన్ని సబ్జెక్టులకూ ఇదే సమస్య. అందులోనూ కరెంట్‌ అఫైర్స్‌ అధ్యయనం చేసేటప్పుడు ప్రతిదీ ప్రధానంగా కనిపిస్తుంది. ఎలా ప్రిపేర్‌ కావాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అభ్యర్థులకు ఎదురయ్యే ఆందోళన ఇది. విభాగాల ప్రకారం వర్తమాన వ్యవహారాలను విభజించి.. జనరల్‌ స్టడీస్‌తో కలిపి చదువుకోవడం ఇప్పటికి సరైన వ్యూహమని నిపుణులు సూచిస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే అన్ని పరీక్షల సిలబస్‌లో కరెంట్‌ అఫైర్స్‌ ఉమ్మడిగా ఉంది. ఇందులో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న వర్తమాన వ్యవహారాలు ఉన్నాయి. ఈ విభాగం పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం - హక్కులు, సుస్థిరాభివృద్ధి - పర్యావరణ పరిరక్షణ, విభజన సమస్యలు ఇలా అన్ని అంశాలతో ముడిపడి ఉంటుంది. రోజుల వ్యవధిలో అన్ని విభాగాలపై పట్టు సాధించడం కాస్త కష్టమే. కాబట్టి ప్రధానమైన వాటిని ముందు చదువుకోవాలి. తర్వాత మిగతా వాటిపై దృష్టి సారించాలి. అందుకోసం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. జనరల్‌ స్టడీస్‌లోని విభాగాల వారీగా వర్తమాన వ్యవహారాలను విభజించి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ పరిధిలోకి రానివాటిని విడిగా అధ్యయనం చేయాలి.

ఎన్నికలు.. ఉపగ్రహాలు
పాలిటీ: ప్రస్తుతం పాలిటీకి సంబంధించి భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఫలితాలు, వివిధ రాష్ట్రాల్లో మారిన ప్రభుత్వాలు, లోక్‌సభ - రాజ్యసభల సమావేశాలు, ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ పరిణామాలు, ఆమోదించిన కీలక బిల్లులు, సుప్రీంకోర్టు చారిత్రక తీర్పులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, కొత్త గవర్నర్లు లాంటి అంశాలపై దృష్టి సారించాలి. 73, 74వ రాజ్యాంగ సవరణలు, జిల్లా పరిపాలనాంశాలను అధ్యయనం చేయాలి.
ఎస్‌ అండ్‌ టీ: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో అంతరిక్ష పరిశోధనా సంస్థలు, అవి నెలకొని ఉన్న ప్రాంతాలు, ఇస్రో చేపట్టిన వివిధ ఉపగ్రహ ప్రయోగాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా చంద్రయాన్‌-2 గురించి తెలుసుకోవాలి. అమెరికా నాసా చేపట్టిన ప్రయోగాలు, వివాదాలకు కారణమైన వివిధ దేశాల క్షిపణి ప్రయోగాలు, మొబైల్‌ రంగంలో 5జీ సాంకేతిక విప్లవం, హైస్పీడ్‌ డేటాలో మార్పులు, వాతావరణ మార్పులు, కాలుష్య నియంత్రణ కోసం తీసుకొస్తున్న బీఎస్‌-6 ప్రమాణాలు తదితరాలు చదవాలి.

ఎక్కడి నుంచి ఎప్పటి వరకు?
కరెంట్‌ అఫైర్స్‌ ప్రిపరేషన్‌లో కాల వ్యవధి కీలకపాత్రను పోషిస్తుంది. 2019 మార్చి నుంచి ఆగస్టు 15 వరకు గల అంతర్జాతీయ, జాతీయ వర్తమాన వ్యవహారాలను చదవాలి. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, ఉత్తర-దక్షిణ కొరియాల స్నేహం, యెమెన్‌ అల్లర్లు, ఇరాన్‌-అమెరికా ఆంక్షల వ్యవహారాలు, సదస్సులు - సమావేశాలు, అంతర్జాతీయ సంస్థల నివేదికలు, వార్తల్లో వ్యక్తులు, అవార్డులు తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీలు, గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ క్రీడలపై అవగాహన పెంచుకోవాలి. జాతీయ స్థాయికి సంబంధించి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, మోదీ వివిధ దేశాల పర్యటనలు, కీలక నియామకాలు; ఐపీఎల్‌ పోటీలు, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన జాతీయ, రాష్ట్ర క్రీడాకారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

రాష్ట్రస్థాయి కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి అభ్యర్థులు 2019, మే 30 నుంచి జరిగిన వర్తమాన అంశాల గురించి తెలుసుకోవాలి. నవ్యాంధ్ర రెండో సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన మే 30 నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కీలకమైనదే. ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నింటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఇవి ఎక్కువ మార్కులు సాధించడానికి దోహదపడతాయి. రాష్ట్రస్థాయి ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడులు, ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై పట్టు సాధించాలి. ప్రతి రోజు దినపత్రికను చదువుతూ ముఖ్యమైన అంశాలతో నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం వల్ల పరీక్ష సమయంలో చదవడానికి సులభంగా ఉంటుది.

సర్వేలు.. పథకాలు
ఎకానమీ: ఆర్థిక అంశాలకు సంబంధించి 2019-20 కేంద్ర బడ్జెట్‌లోని కీలక అంశాలు - కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వ సామాజిక ఆర్థిక సర్వే, ఏపీ బడ్జెట్‌ 2019-20, ఏపీ సామాజిక ఆర్థిక సర్వేల్లోని ముఖ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర మంత్రి మండళ్ల కీలక నిర్ణయాలు, డిజిటల్‌ కరెన్సీ బిట్‌కాయిన్‌లు లాంటి వాటిని అభ్యర్థులు తెలుసుకోవాలి.
సంక్షేమ పథకాలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పెన్షన్‌ పథకాలు, కీలక పథకాల పేర్లు, ప్రారంభించిన తేదీలు, లబ్ధిదారుల అర్హతలు, ఎంపిక విధానం కీలకమైనవి. నవరత్నాల్లోని ప్రతి అంశం ముఖ్యమైనదే. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కీలక పథకాలపై కూడా దృష్టి సారించాలి. సామాజిక న్యాయం - హక్కులను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనుసంధానిస్తూ ప్రిపరేషన్‌ను సాగించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

సుస్థిరాభివృద్ధి.. విభజనాంశాలు
సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం ప్రభుత్వాల ప్రధాన లక్ష్యంగా మారిన నేపథ్యంలో వీటికి సంబంధించిన అంశాలను కూడా చదవాలి. కరెంట్‌ అఫైర్స్‌ కోణంలో ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వాటి సాధనలో వివిధ దేశాల పాత్ర, భారత్‌ స్థానం లాంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయంగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రపంచ పర్యావరణ సదస్సులు, ముఖ్య దినోత్సవాలు; భారత్‌లో చేపట్టిన ప్రముఖ పర్యావరణ కార్యక్రమాలు, పర్యావరణ వేత్తలు - సంబంధిత ఉద్యమాల గురించి తెలుసుకోవాలి. స్వచ్ఛ్‌భారత్‌ కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనించాలి.
రాష్ట్ర విభజన సమస్యలు, నదీ జలాల పంపకం, విభజన అనంతరం పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వ్యవహారాల్లో చోటు చేసుకున్న మార్పులను అధ్యయనం చేయాలి. ఇంకా కొలిక్కి రావాల్సిన విభజన సమస్యల గురించి కూడా తెలుసుకోవాలి.

జన్‌ధన్‌ ఖాతాల్లోకి రూ.లక్ష కోట్లు
* 2019 జులై 3 నాటికి ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) కింద 36.06 కోట్ల ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు రూ.1,00,495.94 కోట్లుగా ఉన్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. ( ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2014 ఆగస్టు 28న ప్రారంభించింది. ( ఇవన్నీ జీరో బ్యాలన్స్‌ సదుపాయంతో కూడిన బేసిక్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ ఖాతాలు. ( ఖాతాదారులకు రూపే డెబిట్‌ కార్డుతో పాటు, బ్యాలన్స్‌ లేకపోయినా రూ.10 వేల ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.

ప్రపంచ కప్‌ - 2019
* మే 30 నుంచి జులై 14 వరకు క్రికెట్‌ 12వ ప్రపంచ కప్‌ 2019 మ్యాచ్‌లు జరిగాయి. ( ఆతిథ్య దేశం ఇంగ్లడ్‌. మొత్తం జట్లు 10. ( భారత్‌ మొత్తం 9 మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలు సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మరో పోటీ వర్షం కారణంగా రద్దయింది. ( ఇంగ్లడ్‌తో తలపడిన ఒకసారి మన జట్టు ఓడిపోయింది. మరోసారి జులై 9న జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయాన్ని పొందింది ( ఆఫ్ఘనిస్థాన్‌ ప్రపంచకప్‌లో మొదటిసారి పాల్గొంది. ( జులై 14న లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఇంగ్లండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది.( ఫైనల్‌ మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. అది కూడా టైగా ముగిసింది. దీంతో ఎక్కువ బౌండరీలు చేసిన ఇంగ్లండ్‌ జట్టును విజేతగా ప్రకటించారు. స్టోక్స్‌కు మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ( అత్యధిక పరుగులు- రోహిత్‌శర్మ (ఇండియ)-648, వికెట్‌లు- మైఖేల్‌స్వార్చ్‌ (ఆస్ట్రేలియా)- 27. ( ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా) -166.

సప్తశిఖరాల ఛాలెంజ్‌
* సప్తశిఖరాల ఛాలెంజ్‌ని పూర్తిచేసిన భారత మొదటి ఐపీఎస్‌ అధికారిణిగా అపర్ణా కుమార్‌ రికార్డు సృష్టించారు.
* ఈమె ఇప్పటికే ఆరు శిఖరాలను అధిరోహించడంతో పాటు దక్షిణ ధృవాన్ని సైతం చేరుకున్నారు.
* ఈమె తాజాగా ఉత్తర అమెరికాలోని 20,310 అడుగుల ఎత్తైన మౌంట్‌ డెనా ను అధిరోహించారు.
* ఈమె ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌) అధికారిణి.

మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల విడుదలైన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌) - 2017 గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధిక సంఖ్యలో దంపతులున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది?
1) ఆంధ్రప్రదేశ్‌ 2) తెలంగాణ 3) కేరళ 4) తమిళనాడు

2. రాణా ప్రతాప్‌, మొరుబొత్తాస్‌, శేష ఝలక్‌, అష్టశిఖ, మానసి పుస్తకాలను ఎవరు రచించారు?
1) తెలంగాణ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ 2) ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 3) మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 4) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

3. కల్‌రాజ్‌ మిశ్రా ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు?
1) గుజరాత్‌ 2) హిమాచల్‌ప్రదేశ్‌ 3) ఛత్తీస్‌గఢ్‌ 4) మహారాష్ట్ర

4. రిలెంట్‌ లెస్‌ అనే పుస్తకం ఎవరి ఆత్మకథ?
1) మన్మోహన్‌ సింగ్‌ 2) ప్రణబ్‌ ముఖర్జీ 3) యశ్వంత్‌ సిన్హా 4) అరుణ్‌ జైట్లీ

5. దేశంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా అమల్లోకి వచ్చింది?
1) 101 2) 102 3) 103 4) 104

6. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1965 2) 1967 3) 1969 4) 1971

7. 2018-19 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల సొమ్ములో అత్యధిక, అత్యల్ప మొత్తాలు వరుసగా ఏ జిల్లాల్లో ఉన్నాయి?
1) గుంటూరు, అనంతపురం 2) తూర్పుగోదావరి, చిత్తూరు 3) విశాఖపట్నం, శ్రీకాకుళం 4) కృష్ణా, విజయనగరం

8. గుంటూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ పొగాకు బోర్డు ఛైర్మన్‌గా కేంద్రం ఇటీవల ఎవరిని నియమించింది?
1) కామినేని శ్రీనివాస్‌ 2) యడ్లపాటి రఘునాథబాబు 3) ఐవైఆర్‌ కృష్ణారావు 4) కన్నా లక్ష్మీనారాయణ

9. 2019-20 ఏపీ బడ్జెట్‌లో డ్వాక్రా సంఘాలకు ఎంత మొత్తం కేటాయించారు?
1) రూ.1,688 కోట్లు 2) రూ.1,788 కోట్లు 3) రూ.1,888 కోట్లు 4) రూ.1,988 కోట్లు

10. ఆంధ్రప్రదేశ్‌ ఆహారశుద్ది సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎవరు నియమితులయ్యారు?
1) ఎల్‌.శ్రీధర్‌రెడ్డి 2) కె.సూర్యప్రకాష్‌ 3) ఆర్‌.రామ్‌శాస్త్రి 4) పి.అనిల్‌కుమార్‌

11. లోక్‌సభ ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన వైకాపా ఎంపీ ఎవరు?
1) శ్రీకృష్ణదేవరాయలు 2) బాలశౌరి 3) అవినాష్‌ రెడ్డి 4) మిథున్‌ రెడ్డి

12. ప్రపంచంలోనే 100 మంది అత్యంత సంపాదనపరులతో ఫోర్బ్స్‌ పత్రిక ఇటీవల విడుదల చేసిన జాబితాలో 33వ ర్యాంకు పొంది, భారత్‌ నుంచి స్థానం పొందిన ఏకైక వ్యక్తి ఎవరు?
1) షారుక్‌ ఖాన్‌ 2) అమితాబ్‌ బచ్చన్‌ 3) సల్మాన్‌ ఖాన్‌ 4) అక్షయ్‌ కుమార్‌

13. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయే నాటికి రూ.1,30,654.34 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణభారం 2019 నాటికి ఎంత మొత్తానికి చేరుకున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు?
1) రూ.2,41,302.81 కోట్లు 2) రూ.2,51,302.81 కోట్లు 3) రూ.2,61,302.81 కోట్లు 4) రూ.2,71,302.81 కోట్లు

14. భారత్‌కు సి-17 విమానాలను విక్రయించడానికి 670 మిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాన్ని ఇటీవల ఏ దేశం కుదుర్చుకుంది?
1) రష్యా 2) ఫ్రాన్స్‌ 3) ఇజ్రాయెల్‌ 4) అమెరికా

15. 54వ జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారాన్ని 2019 జూన్‌లో ప్రముఖ రచయిత అమితవ్‌ ఘోష్‌కు ప్రదానం చేశారు. ఏ భాషలో ఈయన సాహిత్య సేవలకు ఈ పురస్కారం దక్కింది?
1) ఆంగ్లం 2) కన్నడ 3)మలయాళం 4) హిందీ

సమాధానాలు
1-1; 2-2; 3-2; 4-3; 5-3; 6-3; 7-4; 8-2; 9-2; 10-1; 11-2; 12-4; 13-3; 14-4; 15-1


సీహెచ్‌ కృష్ణప్రసాద్‌
విషయ నిపుణులు
Posted on 20-08-2019