ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > కరెంట్‌ అఫైర్స్‌

స్థానిక అభ్యర్థులకే ఉపాధి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యాంశాలు
* రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలను కనుక్కునేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ను 2019 జులై 1న ఏర్పాటుచేసింది. దీనికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌గా రైతు నాయకుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి వ్యవహరిస్తారు.
* ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థపై రూపొందించే శ్వేతపత్రాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వెలగపూడి సచివాలయంలో 2019 జులై 10న విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో జన్మించిన శిశువు సహా ప్రతి ఒక్కరిపై ప్రస్తుతం తలసరి రుణభారం రూ.42,500గా ఉంది.
* కర్నూలు జిల్లాలోని వైఎస్సార్‌ స్మృతివనం విశేషాలపై రూపొందిన ‘మహానేతకు హరితహారం’ పుస్తకాన్ని 2019 జులై 5న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అమరావతిలో ఆవిష్కరించారు.
* రాష్ట్రంలో పరిశ్రమలు, కర్మాగారాల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘ఏపీ పరిశ్రమలు, కర్మాగారాల్లో స్థానిక అభ్యర్థులకు ఉపాధి బిల్లు - 2019’ని జులై 24న శాసనసభ ఆమోదించింది.
* ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి భారత విదేశాంగ కార్యాలయం 2019 జులై 20న డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును జారీచేసింది.
* దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో జులై 8న నిర్వహించిన రైతు దినోత్సవ బహిరంగసభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.
* ఆగస్టు 15న విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానంలో నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సెర్ప్‌, ఎక్సైజ్‌, వ్యవసాయ శాఖల శకటాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి.
* గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే నేరుగా ప్రభుత్వ సేవలను అందించే కార్యక్రమాన్ని ఆగస్టు 15న సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు.
* జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అమరావతి బెంచ్‌ను 2019 జులై 29న హైదరాబాద్‌ బెంచ్‌ కొనసాగుతున్న భవనంలోనే ప్రారంభించారు. అమరావతిలో కొత్త భవనం సిద్ధమయ్యేవరకు ఇది హైదరాబాద్‌లోనే కొనసాగనుంది.
* 2019 - 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,32,287 కోట్ల అంచనాతో ద్రవ్య వినిమయ బిల్లు జులై 30న ఉభయసభల ఆమోదం పొందింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి జులై 12న శాసనసభలో రూ.2,27,975 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తర్వాత కొన్ని లెక్కల్లో మార్పుల కారణంగా ద్రవ్య వినిమయ బిల్లులో అంచనా రూ.4312 కోట్ల మేర పెరిగింది.

పెరిగిన పులుల సంఖ్య
2018 పులుల గణాంకాల నివేదికను 2019 జులై 29న ప్రధాని మోదీ విడుదల చేశారు. 2006లో దేశవ్యాప్తంగా పులుల సంఖ్య 1411 ఉండగా 2018 నాటికి 2967కు పెరిగింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వాటిసంఖ్య 95 నుంచి 74కు పడిపోయింది. 2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నట్లు వెల్లడైంది. దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 526 పులులు ఉన్నాయి.

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు
సుప్రీంకోర్టులో పెరుగుతున్న పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి కాకుండా 30 మంది (మొత్తం 31 మంది) న్యాయమూర్తులు ఉన్నారు. ఇకపై న్యాయమూర్తుల సంఖ్యను 33కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరగనుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న 31 పదవులు భర్తీ అయ్యాయి.


Posted on 25-08-2019