ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > సుస్థిరాభివృద్ధి - పర్యావరణ పరిరక్షణ ప్రిపరేషన్‌

గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు ప్రకటించిన అన్ని పరీక్షల్లోనూ జనరల్‌ స్టడీస్‌లో భాగంగా ‘సుస్థిరాభివృద్ధి -పర్యావరణ పరిరక్షణ’ అంశం ఉంది. దీనిపై తప్పకుండా ప్రశ్నలు వస్తాయి. పరిధి కొంత ఎక్కుగానే ఉంది. సమాచారం అంతా ఒకే చోట లభించకపోవచ్చు. గత పరీక్షల ఆధారంగా సిలబస్‌ అంశాలను గుర్తించి అభ్యర్థులు ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి.
ప్రపంచ దేశాల్లో సుస్థిరాభివృద్ధిని సాధించడంలో భాగంగా ఐక్యరాజ్య సమితి మొదటిసారి 2000 సంవత్సరంలో సహస్రాభివృద్ధి లక్ష్యాలను (మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌) ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఆకలి నిర్మూలన, శిశు మరణాలను తగ్గించడం, మాతా సంరక్షణ; ఎయిడ్స్‌, మలేరియా లాంటి వ్యాధులను అరికట్టడం, పర్యావరణ సుస్థిరాభివృద్ధిని సాధించడం, ప్రపంచ దేశాల భాగస్వామ్యం తదితర లక్ష్యాలను తీర్మానించింది. అభ్యర్థులు ఈ అంశాలపై దృష్టిపెట్టాలి. ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తే ప్రశ్న ఏవిధంగా వచ్చినా సమాధానం గుర్తించడానికి వీలవుతుంది.
ఎలిమినేషన్‌ విధానం
అన్ని దేశాల్లో అభివృద్ధి లోపించడం, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం అధికమవడంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రధానంగా పేదరికం, ఆకలిని నిర్మూలించడానికి 2015 సెప్టెంబరు 25న ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రకటించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తెలుసుకోవాలి. అవి నాలుగు రకాలుగా ఉంటాయి. విడివిడిగా సాధారణ అవగాహన పెంచుకోవాలి. ఇక్కడ అభ్యర్థులు ప్రధానంగా ఒక విషయాన్ని గమనించాలి. గత పరీక్షల ప్రశ్నలను పరిశీలిస్తే కొన్ని ఎలిమినేషన్‌ విధానంలో వస్తున్నాయి. అంటే నాలుగు ఐచ్ఛికాల్లో రెండు ప్రశ్నకు ప్రతికూలంగా ఉంటాయి.మిగిలిన రెండింటిలో సమాధానం ఉంటుంది. మౌలికాంశాలపై పట్టు ఉంటే ఈ విషయాన్ని తేలిగ్గా గ్రహించవచ్చు. అప్పుడే అనుకూల, ప్రతికూల జవాబుల విభజన చేయడం అభ్యర్థికి సాధ్యమవుతుంది. సమాధానాన్ని గుర్తించడం సులువవుతుంది.
సమస్యలు, చట్టాలు
21వ శతాబ్దంలో వేగంగా వస్తున్న మార్పుల వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవించి పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా అణ్వస్త్రాల ప్రయోగం, కిరణ ధార్మిక విస్ఫోటాలు; వాయు, జల, శబ్ద కాలుష్యాలు పెరగడం వల్ల పర్యావరణ పరిరక్షణ అవసరం ఏర్పడింది. ఆ సమస్యలు, వాటి ఫలితాలు, పరిష్కార మార్గాలను అధ్యయనం చేయాలి. ఇదే నేపథ్యంలో మన దేశంలో జరిగిన చిప్కో ఉద్యమం, బిష్ణోయి ఉద్యమం, బాలియపాల్‌ క్షిపణి వ్యతిరేక ఉద్యమం, నర్మదా బచావో లాంటి పర్యావరణ ఉద్యమాల వివరాలను తెలుసుకోవాలి. వాటితోపాటు ఈ ఉద్యమాల ఫలితంగా అమల్లోకి వచ్చిన పర్యావరణ చట్టాలను తెలుసుకోవాలి. పరీక్ష సమయం తక్కువ ఉంది కాబట్టి లోతైన అధ్యయనం కంటే స్థూలంగా, స్మార్ట్‌గా ప్రిపేర్‌ కావడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
సదస్సులు, సమావేశాలు
పర్యావరణ పరిరక్షణ ఒక బలీయమైన భావనగా ప్రపంచ వ్యాప్తం కావడంతో ఎప్పటికప్పుడు సమావేశాలు, సదస్సులు జరిగాయి. 1972 యూఎన్‌వో స్వీడన్‌ స్టాక్‌హోం పర్యావరణ సదస్సు మొదలు 2018 మార్చి 11న దిల్లీలో జరిగిన అంతర్జాతీయ సౌరకూటమి సదస్సు వరకు అన్నింటి వివరాలు, లక్ష్యాలను అధ్యయనం చేయాలి. ప్రపంచ వాతావరణ మార్పులను సమీక్షించడానికి ఏర్పాటైన యూఎన్‌ఎఫ్‌సీసీసీ (United Nations Framework Convention on Climate Change) బాన్‌ (జర్మనీ) కేంద్రంగా ఏటా వివిధ దేశాలను వేదికగా చేసుకొని సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. ఆ వేదికలు, ఏర్పాటు చేసే లక్ష్యాలను తెలుసుకోవాలి.
రిఫరెన్స్‌ పుస్తకాలు
* 10వ తరగతి పర్యావరణ అంశాలు
* డిగ్రీ రెండో సంవత్సరం తెలుగు అకాడమీ పర్యావరణం
* పోటీ పరీక్షల కోసం విడుదల చేసిన తెలుగు అకాడమీ పుస్తకం
* డిగ్రీ రెండో సంవత్సరం అర్థశాస్త్రం - తెలుగు అకాడమీ
* పోటీ పరీక్షల కోసం సుస్థిరాభివృద్ధి-పర్యావరణం, తెలుగు అకాడమీ

 
Posted on 16-08-2019