ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > సుస్థిరాభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ

యూఎన్‌ఓ - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

జనాభా విస్ఫోటం, అడవుల నిర్మూలన, పారిశ్రామికీకరణ, భూతాపం, భూగర్భ జలాలు అంతరించిపోవడం.. తదితర ఎన్నో పరిణామాల వల్ల పర్యావరణానికి ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ.. భావితరాల భవిష్యత్తును రక్షించేందుకు సుస్థిరాభివృద్ధి పేరుతో సాగుతున్న ప్రపంచ దేశాల ప్రయత్నాలపై అభ్యర్థులు అవగాహన ఏర్పరచుకోవాలి.

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా 20వ శతాబ్దం మధ్యకాలంలో శాంతి, స్వాతంత్య్రం, అభివృద్ధి, పర్యావరణం అనే నాలుగు అంశాలను ప్రపంచ సమాజం ప్రముఖంగా ప్రకటించింది. 1950ల్లో అమెరికాలో ప్రత్యేకంగా వ్యవసాయ సాగులో విరివిగా డీడీటీ (డైక్లోరో డైఫినాయిల్‌ ట్రైక్లోరో ఈథేన్శ్‌ క్రిమిసంహారక మందును ఎక్కువ మోతాదులో వాడారు. దీంతో పర్యావరణానికి హాని జరగడం మొదలైంది. దీనికి వ్యతిరేకంగా 1962లో అమెరికాకు చెందిన రెచెల్‌ కార్సన్‌ ‘నిశ్శబ్ద వసంతం’ (సైలెంట్‌ స్ప్రింగ్శ్‌ అనే పుస్తకం రాశారు. దానిలో ఆర్థికాభివృద్ధి - పర్యావరణానికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని తెలియజేశారు. దీంతో పర్యావరణ హానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది. క్రమంగా పర్యావరణాన్ని నిలకడ ఉన్న అభివృద్ధి ద్వారా సాధించాలనే తపనతో సుస్థిరాభివృద్ధి వెలుగులోకి వచ్చింది.

ఐరోపా అడవుల్లో..
‘సుస్థిరత్వం’ అనే పదాన్ని 19వ శతాబ్దపు మధ్యకాలంలో ఐరోపా అటవీ అధికారులు ప్రవేశపెట్టారు. ఆనాటి యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అడవులే ప్రధాన చోదక శక్తులు. అక్కడి అడవుల్లో చెట్లు తరిగిపోయినా, వాటిని కొట్టివేసినా తిరిగి ఆ ప్రాంతంలో చెట్లను నాటి ఆ సంఖ్యను భర్తీచేసి కాపాడేవారు. ఇలా భావితరాల వారికి అడవుల క్షీణత ఉండకూడదనే సంకల్పమే సుస్థిరత్వ ఆవిర్భవానికి దారితీసింది.

సుస్థిరాభివృద్ధి అంటే?
పర్యావరణానికి ప్రమాదం లేకుండా జరిగే అభివృద్ధిని ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు. ఈ అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణ విలీనం భాగమవుతుంది. ప్రజలు ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ, భావితరాల క్షేమానికి రాజీలేని మార్గం ద్వారా అభివృద్ధి కొనసాగించడాన్నే ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు. దీన్నే ‘నిలకడ ఉన్న’ లేదా ‘కొనసాగించగలిగే అభివృద్ధి’ అని పిలుస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా
* స్టాక్‌హోం ప్రపంచ మానవ పర్యావరణ సదస్సులో (1972) సుస్థిరత్వం అనే పదాన్ని ఉపయోగించారు.
* ‘ప్రకృతి, సహజవనరుల రక్షణ అంతర్జాతీయ సంఘం’ (IUCNNR) (International Union for the Conservation of Nature and Natural Resources) 1980లో మొదట సుస్థిరాభివృద్ధి అనే భావనను తెలియజేసింది.
* గ్రొహర్లెమ్‌ బ్రుంట్‌లాండ్‌ అధ్యక్షతన ‘ప్రపంచ పర్యావరణ అభివృద్ధి సంఘం’ (The World Commission on Environment and Development) (WCED) 19871987లో ‘మన ఉమ్మడి భవిష్యత్తు’ (Our Common Future) అనే నివేదికలో సుస్థిరత్వం అనే పదానికి అర్థాన్ని ఇచ్చారు. ఈ సుస్థిరత్వం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

1. అవసరాలు (needs)
2. అభివృద్ధి (Development)
3. భవిష్యత్తు (Future)

* అవసరాలు అంటే వనరుల పంపిణీలో సంబంధాన్ని కలిగి ఉండడం, అభివృద్ధి అంటే సామాజిక, ఆర్థిక విషయాల్లో మెరుగుదలను సూచించడం. భవిష్యత్తు అంటే రాబోయే తరాలవారికి స్థిరత్వం
కొనసాగించడం అని నిర్వచించవచ్చు.
* 1992 జూన్‌లో బ్రెజిల్‌ రియో-డి-జెనిరోలో పృథీÅ్వ సదస్సులో ఐక్యరాజ్యసమితి ‘ఎజెండా-21’ అనే ప్రపంచ ప్రణాళిక ద్వారా సుస్థిరాభివృద్ధిని కొనసాగించడానికి దోహదపడే విధంగా ప్రణాళికలు రూపొందించింది.
* 2002లో దక్షిణాఫ్రికా జోహెన్స్‌బర్గ్‌ సదస్సులో మొదటి సుస్థిరాభివృద్ధి సమావేశాన్ని నిర్వహించి సుస్థిరత్వం అనే భావనను ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చారు.

మూడు భాగాలు
కొనసాగించగలిగే అభివృద్ధిలో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన స్వతంత్రమైన అంశాలు. ఆర్థిక, సామాజిక, పర్యావరణం అనే ఈ మూడు అంశాల మధ్య సమతూకాన్ని సాధించడం ద్వారానే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది.


2015 సెప్టెంబరు 25-27 న్యూయార్క్‌ సర్వప్రతినిధుల సభలో ఐక్యరాజ్యసమితి 2015-30 కాలానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తీర్మానించి ప్రకటించింది. వీటిని ప్రపంచ దేశాలు 2030 లోగా సాధించాలి. వీటిలో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి. 17 లక్ష్యాలు...1. పేదరికాన్ని రూపుమాపడం. 2. ఆకలిని పోగొట్టి, ఆహార భద్రతను సాధించడం. 3. మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడం. 4. సమ్మిళిత, సమానత్వంతో కూడిన, నాణ్యమైన విద్యను అందించడం. 5. లింగపరమైన సమానత్వం, స్త్రీల సాధికారికతను సాధించడం. 6. తాగునీరు, పరిశుభ్రతను అందుబాటులోకి తీసుకురావడం. 7. శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాలను పెంపొందించడం. 8. అందరికీ పూర్తిస్థాయి ఉత్పాదక, ఉద్యోగితను కల్పించడం. 9. పారిశ్రామికీకరణ, నవకల్పనలను ప్రోత్సహించడం. 10. ప్రపంచ దేశాల మధ్య అసమానతలను తగ్గించడం. 11. పట్టణాలు, మానవ ఆవాసాలు సురక్షితంగా ఉండేటట్లు చేయడం. 12. ఉత్పత్తి నమూనాలు, వినియోగం అందుబాటులోకి తేవడం. 13. వాతావరణ మార్పులను అరికట్టడానికి సత్వర చర్యలు తీసుకోవడం. 14. సముద్ర వనరులను పరిరక్షించడం. 15. జీవావరణాన్ని పరిరక్షిస్తూ అడవుల పరిరక్షణ, ఎడారీకరణ, నేల క్షీణతను అరికట్టడం. 16. అందరికీ న్యాయం, శాంతి అందుబాటులోకి తేవడం. 17. అభివృద్ధి సాధనకు ప్రపంచ దేశాలను భాగస్వాములుగా చేయడం.

సహస్రాభివృద్ధి లక్ష్యాలు
2000 సెప్టెంబరు 20 నుంచి 22 వరకు జరిగిన ఐక్యరాజ్యసమితి న్యూయార్క్‌ సాధారణ సభలో మిలీనియం డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇందులో 8 లక్ష్యాలు ఉన్నాయి. వీటిని 2015 సెప్టెంబరు 25 నాటికి సాధించాలని నిర్ణయించింది.


మాదిరి ప్రశ్నలు

1. ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దం’ను ఐక్యరాజ్యసమితి ఏ కాలంలో ప్రకటించింది? (డిప్యూటీ సర్వేయర్‌-2017)
      1) 2000-10       2) 2005-15       3) 2015-25       4) 2020-30
2. ‘ఎజెండా-21’ దేనికి సంబంధించింది? (డీఎల్‌, 2007)
      1) ఎడారీకరణ       2) అడవుల పరిరక్షణ       3) సుస్థిరాభివృద్ధి       4) జీవవైవిధ్యం
3. కింది వాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానివి? (గ్రూప్‌-3, 2017)
      1) పేదరిక నిర్మూలన       2) ప్రపంచశాంతి, న్యాయాన్ని కాపాడడం       3) అందరికీ నాణ్యమైన విద్య       4) క్రీడా నైపుణ్యాలు పెంచడం
4. 2015 న్యూయార్క్‌ సాధారణ సభలో మొత్తం ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించారు? (ఏఈ, 2016)
      1) 10       2) 15       3) 17       4) 18
5. యూఎన్‌వో సాధారణ సభ 70వ సదస్సులో సెప్టెంబరు-2015లో ఏ తీర్మానాన్ని ప్రకటించారు? (గురుకుల్‌ పీజీటీ - 2018)
      1) మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు       2) వాతావరణ మార్పు లక్ష్యాలు       3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు      4) విపత్తు తగ్గింపు లక్ష్యాలు
6. సుస్థిరాభివృద్ధిపై మొదటి సదస్సును ఎక్కడ నిర్వహించారు?
      1) రియో-డి-జెనిరో       2) జోహెన్స్‌బర్గ్‌       3) స్టాక్‌హోం       4) సెండాయ్‌
సమాధానాలు: 1-2 2-3 3-4 4-3 5-3 6-2


కొత్త గొవ‌ర్థ‌న్‌రెడ్డి
Posted on 16-08-2019