ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > ఇంట‌ర్వ్యూలు

అభ్య‌ర్థుల సందేహాల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ క‌మిష‌న‌ర్ గిరిజా శంక‌ర్ స‌మాధానాలు

ఆంగ్ల ప్రశ్నలే ప్రామాణికం!

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల తేదీలు సమీపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల మాధ్యమాలు, ఓఎంఆర్‌ షీట్లకు సంబంధించిన జాగ్రత్తలు, రిజర్వేషన్లు, ఫలితాలు తదితర విషయాలపై అభ్యర్థులు వ్యక్తంచేస్తున్న పలు సందేహాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ సమాధానాలు ఇచ్చారు. ప్రధానంగా ప్రశ్నపత్రంలో ఆంగ్లంలో ఇచ్చిన ప్రశ్నలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.

* పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
ఓఎంఆర్‌ షీట్లు జిల్లాలకు పంపిణీ చేసే ప్రక్రియ పూర్తయ్యే దశలో ఉంది. ప్రశ్నపత్రాలను నిర్దేశిత సమయానికి జిల్లాలకు పంపిస్తాం. ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా పరిషత్‌ సీఈఓ కస్టోడియన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాల రాత పరీక్షలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, విద్యా శాఖ సలహాలు, సూచనలు, వాటి పూర్వ అనుభవాలను పరిగణనలోనికి తీసుకుని పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏకకాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా జరపడాన్ని అధికారులందరూ సవాలుగా స్వీకరించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రాల గుర్తింపులో ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు ఉన్న వాటినే కేంద్రాలుగా గుర్తించాం. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేందుకు నిర్దేశిత ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని ఇప్పటికే జిల్లా అధికారుల ద్వారా విజ్ఞప్తులు వెళ్లాయి.

* ప్రశ్నపత్రాలు ఏ మాధ్యమాల్లో ఉంటాయి? దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి?
రాత పరీక్షల్లో ప్రశ్నపత్రాలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటాయి. ఇంగ్లిష్‌ పేపర్‌ను తెలుగులోకి అనువాదం చేశారు. అందుకే ఆంగ్లంలో ఉన్న ప్రశ్నలనే ప్రామాణికంగా తీసుకోవాలి. తెలుగు అనువాదాన్ని అభ్యర్థులు తమ అవగాహన కోసం ఉపయోగించుకుంటే మంచిది.

* పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రశ్నపత్రాలను ఎన్ని సిరీస్‌ల్లో ఇస్తారు?
నాలుగు సిరీస్‌ల్లో (ఎ, బి, సి, డి) ప్రశ్నపత్రాలు ఉంటాయి. అన్నింటిలోనూ ప్రశ్నలు, జవాబులు ఒకటే. కానీ అవి జంబ్లింగ్‌ అవుతాయి.

* హాల్‌టికెట్‌లు ఎప్పటి నుంచి జారీచేస్తారు?
ఈ నెల 25 నుంచి అభ్యర్థులకు హాల్‌ టికెట్‌లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

* పరీక్షల ‘కీ’లు ఎప్పుడు ఇస్తారు? ఫలితాలను ఎప్పటికి ఆశించవచ్చు?
పరీక్ష జరిగిన రోజు సాయంత్రమే ‘కీ’లు విడుదల చేయడానికి పరిశీలిస్తున్నాం. మూడు రోజుల పాటు వాటిపై అభ్యంతరాలు స్వీకరించి నిపుణులతో చెక్‌ చేయిస్తాం. సెప్టెంబరు 23 నుంచి 25 మధ్య ఫలితాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తగిన సమయంలో అధికారిక తేదీలు ప్రకటిస్తాం.

* ఓఎంఆర్‌ షీట్లకు సంబంధించి ఏమైనా సూచనలు ఉన్నాయా?
ఓఎంఆర్‌ షీటులో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు ముద్రించి ఉంటాయి. నిర్దేశించిన పెన్నుతోనే ఓఎంఆర్‌లోని వృత్తాలను నింపాలి. ఇన్విజిలేటర్లు కూడా అభ్యర్థులను అప్రమత్తం చేస్తారు. జూనియర్‌ అసిస్టెంట్‌/సెకండరీ గ్రేడ్‌ టీచర్ల హోదా కలిగిన వారిని మాత్రమే ఇన్విజిలేటర్లుగా నియమిస్తున్నాం. ప్రతి జిల్లాలో కనీసం అయిదువేల మందికిపైగా ఉద్యోగులు పరీక్షల నిర్వహణలో పాల్గొంటారు. పరీక్షల నిర్వహణలో పాల్గొనే సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

* అభ్యర్థులు హాల్‌ టికెట్‌ తెచ్చుకుంటే సరిపోతుందా? ఏమైనా గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలా?
హాల్‌టికెట్‌తోపాటు అభ్యర్థులు ఆధార్‌ వంటి గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలి. తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతారు. పరీక్ష రోజున ఉదయం 6 నుంచి సాయత్రం 6 వరకు జిరాక్స్‌ సెంటర్లు ఉండవు. అందుకే అభ్యర్థులు తమకు కావాల్సిన కాపీలను ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. పారదర్శక చర్యల్లో భాగంగానే ఈ ఏర్పాట్లు చేస్తున్నాం.

* టెక్నికల్‌ సబ్జెక్టుల ప్రశ్నలు తెలుగులో ఉంటాయా?
పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-6 డిజిటల్‌ అసిస్టెంట్, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2), వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష పార్ట్‌-బిలోని ప్రశ్నలు ఆంగ్లంలోనే ఉంటాయి. ఎఎన్‌ఎం/వార్డు హెల్త్‌ సెక్రటరీ రాత పరీక్ష పార్ట్‌-బి ప్రశ్నలు తెలుగులో ఉంటాయి. మిగిలిన పరీక్షల్లోని ప్రశ్నలను తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు.

* ఏపీపీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల్లో అనువాదంపరంగా తప్పులు దొర్లాయి. భారీ స్థాయిలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. అదీ తక్కువ సమయంలో నిర్వహిస్తున్నారు. గ్రామీణ అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
తప్పులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆంగ్ల పదాలను తెలుగులోకి అనువాదం చేయడంలోనే ఒక్కోసారి తప్పులు దొర్లుతున్నాయి. అందుకే ఇంగ్లిష్‌లో ఇచ్చిన పదాలనే ప్రామాణికంగా తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నా. తెలుగు ప్రశ్న చదివినప్పుడు అర్థంకాకపోయినా, ఏమైనా సందేహాలు వచ్చినా ఇంగ్లిష్‌ ప్రశ్నను తప్పకుండా చదవాలి. ప్రశ్నలు అందరికీ అర్థమయ్యే స్థాయిలోనే ఉంటాయి.

* పరీక్షలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. తనిఖీల పేరుతో జాప్యం జరిగితే అభ్యర్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
పోలీసుల సహకారాన్ని తీసుకుంటున్నాం. తగినంత మంది తనిఖీ సిబ్బందిని నియమిస్తున్నాం. మహిళా హోంగార్డులు సరిపోకపోతే అంగన్‌వాడీ కార్యకర్తల సేవలను వినియోగించుకుంటాం. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వీడియోల చిత్రీకరణ జరుగుతుంది. పరీక్షా కేంద్రాల్లో ఉండే అభ్యర్థుల ప్రతి కదలిపై నిఘా ఉంటుంది. రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థుల జవాబుల గుర్తింపులో అప్రమత్తంగా వ్యవహరించాలి. సిబ్బంది తప్పిదాలకు పాల్పడకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యుఎస్‌ కోటాను అమలు చేస్తారా?
ఈ పోస్టుల భర్తీలో ఈడబ్ల్యుఎస్‌ కోటా అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అభ్యర్థుల విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. అధికారికంగా తీసుకునే నిర్ణయాలను అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయి.

- ఈనాడు, అమరావతి
Posted on 22-08-2019