ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > జ‌న‌ర‌ల్ మెంట‌ల్ ఎబిలిటీ, రీజ‌నింగ్‌

మెంటల్‌ఎబిలిటీ, రీజనింగ్‌, క్యూఏ ప్రిపరేషన్‌ ప్లాన్‌

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి దాదాపు అన్నింటి సిలబస్‌లోనూ జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌తో కూడిన క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ఉన్నాయి. వీటి నుంచి కనీసం 20 నుంచి 30 ప్రశ్నలను ఆశించవచ్చు. బేసిక్స్‌పై పట్టు సాధించి వీలైనన్ని నమూనా ప్రశ్నలను సంక్షిప్త పద్ధతులతో సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కేటాయించిన మొత్తం మార్కులను సొంతం చేసుకోడానికి వీలైన విభాగాలివి.

అభ్యర్థుల్లోని సమస్యా పరిష్కార శక్తిని, లాజికల్‌ ఆలోచనా విధానాన్ని, వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యాన్ని పరీక్షించడానికి మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగాల నుంచి ప్రశ్నలను ఇస్తుంటారు. వీటిని పరిష్కరించడానికి సైన్సేతర విద్యార్థులతో సహా కొందరు సైన్స్‌ వాళ్లు కూడా ఇబ్బంది పడుతుంటారు. కానీ ప్రశ్నల స్థాయి అందరూ సాధించగలిగిన విధంగానే ఉంటుంది. పదోతరగతి వరకు నేర్చుకున్న గణిత ప్రక్రియల ఆధారంగా చేయగలిగిన విధంగానే ప్రశ్నలను రూపొందిస్తారు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు కొంత కఠిన స్థాయి ప్రశ్నలనూ సాధన చేయాల్సి ఉంటుంది. గతంలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్‌వో వంటి పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను పరిశీలించాలి. గ్రూప్‌-1, 2 జనరల్‌ స్టడీస్‌లో భాగంగా వచ్చిన మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నలను సాధన చేయాలి. సిలబస్‌లో పేర్కొన్న విభాగాలపై పట్టు సాధించడానికి 6, 7, 8 తరగతుల్లోని గణిత పాఠ్యాంశాలు; టాటా మెక్‌గ్రాహిల్‌, ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ పుస్తకాలను చదవాలి.

మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ విభాగాన్ని అర్థం చేసుకొని సాధన చేస్తే 100% మార్కులను సాధించవచ్చు. ముఖ్యంగా వర్గాలు, ఘనాలు, ఆంగ్ల వర్ణమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌తో కూడిన డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో శాతాలు, లాభనష్టాలతో పాటు సగటుకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతారు. సంఖ్యల ముఖ విలువలు, స్థాన విలువలు; బారువడ్డీ, చక్రవడ్డీల్లో వడ్డీరేటు, కాలం, వడ్డీని కనుక్కోవాల్సి ఉంటుంది. బారువడ్డీ, చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం 2, 3 సంవత్సరాలకు లెక్కించే ప్రశ్నలను సాధన చేయాలి. కాలం - పని, పని - వేతనం, కాలం - దూరం, సాపేక్ష వేగం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. నిష్పత్తి - అనుపాతం, భాగస్వామ్యం, గడియారం, క్యాలెండరుకు సంబంధించిన లెక్కలు ఎక్కువగా సాధన చేయడం ద్వారా సులువుగా మార్కులను పొందవచ్చు. దీనికోసం కానిస్టేబుల్‌, ఆర్‌ఆర్‌బీ, వీఆర్‌వో గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఇందులో ముఖ్యమైన అంశం ‘పై చిత్రాలు’. ఇవి వృత్తాకారంలో ఉంటాయి కాబట్టి 360ా కోణాన్ని కలిగి ఉంటాయి. ఈ వృత్తాన్ని 100%గా లెక్కిస్తారు. శాతాలపై అవగాహన ఉంటే దీనికి సంబంధించిన సమస్యలను సులభంగా సాధించవచ్చు.

రీజనింగ్‌లో...
* వెర్బల్‌ రీజనింగ్‌లో శ్రేణులు, భిన్న పరీక్ష, పోలిక పరీక్ష, కోడింగ్‌ - డీకోడింగ్‌, ర్యాంకింగ్‌ పరీక్ష, గణిత పరీక్ష, దిశాత్మక పరీక్ష, లాజికల్‌ వెన్‌ చిత్రాలు, మిస్సింగ్‌ నెంబర్స్‌
* నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌లో దర్పణ, నీటి ప్రతిబింబాలు, శ్రేణులు, పోలిక, భిన్న పరీక్షలు బొమ్మల లెక్కింపు, పాచికలు
* లాజికల్‌ విభాగంలో ఊహలు, ప్రకటనలు, తీర్మానాలు లాంటి అంశాలు ఉంటాయి.

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 4 రకాలుగా ఉంటుంది
1) పట్టికను తయారుచేయడం (Tabulation)
2) బార్‌గ్రాఫ్‌లు 3) పై చిత్రాలు (Pie-charts)
4) రేఖా చిత్రాలుబిజ్జుల విష్ణువర్థన్ రెడ్డి
Posted on 20-08-2019