ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

సెప్టెంబ‌ర్‌ 1, 8 తేదీల్లో రాత పరీక్షలు

* ఆగ‌స్టు 2 నాటికి 7,79,812 దరఖాస్తులు రాక
* పురపాలక కమిషనర్‌ విజయ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న వారందరికీ సెప్టెంబ‌ర్‌ 1, 8 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్ ఆగ‌స్టు 2న‌ తెలిపారు. 1న ఉదయం వార్డు పరిపాలన కార్యదర్శి, మహిళా, బలహీన వర్గాల సంరక్షణ కార్యదర్శి అభ్యర్థులకు, మధ్యాహ్నం వార్డు సౌకర్యాల కల్పన కార్యదర్శి, వైద్య ఆరోగ్య కార్యదర్శి, విద్యుత్తు, రెవెన్యూ కార్యదర్శి అభ్యర్థులకు.. 8న ఉదయం వార్డు ప్రణాళిక, క్రమబద్ధీకరణ కార్యదర్శి, పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి, సంక్షేమ, అభివృద్ధి విభాగ కార్యదర్శి అభ్యర్థులకు, మధ్యాహ్నం వార్డు విద్య, డేటా ప్రోసెసింగ్‌ కార్యదర్శి అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు పరీక్ష రుసుములను మొబైల్‌ యాప్‌తో కాకుండా సిస్టం (కంప్యూటర్‌)తో చెల్లింపులు చేయాలని కమిషనర్‌ సూచించారు. ఈ ఉద్యోగాల కోసం ఆగ‌స్టు 2 సాయంత్రం వరకు 7,79,812 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. ఇతరత్రా సందేహాలుంటే సేవా కేంద్రం నంబరు 79970 06763కు ఫోన్‌ చేయాలని కమిషనర్‌ సూచించారు.
1న గ్రామ సచివాలయ అభ్యర్థులకు రాత పరీక్ష
గ్రామ సచివాలయ ఉద్యోగాలకు వస్తున్న దరఖాస్తుల్లో కొన్ని కేటగిరిల అభ్యర్థులకు సెప్టెంబ‌ర్‌ 1న రాత పరీక్ష నిర్వహించనున్నారు. మిగతా విభాగాలకు సంబంధించి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది రెండు, మూడు రోజుల్లో నిర్ణయిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని.. ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెప్పే మాటలు నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు.

Posted on 03-08-2019