ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

6న‌ సచివాలయ పరీక్షల కాలపట్టిక విడుదల

ఈనాడు-అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నవారికి నిర్వహించే రాత పరీక్షల కాలపట్టిక (షెడ్యూల్‌)ని ఆగ‌స్టు 6న‌ ప్రకటిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఆగ‌స్టు 4న‌ ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ- ఒకే అభ్యర్థి రెండు, మూడు పరీక్షలు రాసే వీలున్నందున, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్‌లతోనూ చర్చిస్తున్నామని చెప్పారు. ‘కేటగిరి రెండు, మూడులో ఉద్యోగాలకు ప్రశ్నపత్రాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ముద్రించే విషయాన్ని పరిశీలిస్తాం. సాంకేతిక పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడం కష్టం. తప్పులు దొర్లే అవకాశాలుంటాయి. ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ రూపొందిస్తున్న ప్రశ్నపత్రాలనూ పరిశీలిస్తాం. పదో తరగతికి ముందు ఏడేళ్ల కాలంలో ఎక్కడ ఎక్కువ కాలం చదివితే అదే అభ్యర్థి జిల్లా స్థానికత (లోకల్‌) అవుతుంది. ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అన్ని పోస్టులకూ కలిపి ఇంతవరకు 10.60 లక్షలకుపైగా దరఖాస్తులొచ్చాయి. సందేహ నివృత్తి కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు రోజూ పెద్దఎత్తున అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు’ అని ఆయన వివరించారు.

Posted on 05-08-2019