ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

ఏడేళ్లు ఎక్కడ చదివితే అక్కడే

* గ్రామ సచివాలయ ఉద్యోగుల స్థానికతపై ప్రభుత్వం స్పష్టీకరణ
* 15 రోజుల్లోనే ఫలితాలు

ఈనాడు - అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగార్థులకు  సెప్టెంబ‌రు 1, 8 తేదీల్లో రెండు విడతల్లో నిర్వహించే రాతపరీక్ష ఫలితాలు 15రోజుల్లో ప్రకటించనున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటగిరి-1లోని ఐదు పోస్టులకు 1న ఉదయం.. రెండు, మూడు కేటగిరిల్లోని పోస్టులకు మధ్యాహ్నం రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరి-3లోనే వార్డు ప్రణాళిక-క్రమబద్ధీకరణ కార్యదర్శి, పారిశుద్ధ్యం-పర్యావరణ కార్యదర్శి, సంక్షేమ-అభివృద్ధి కార్యదర్శి పోస్టులకు 8న ఉదయం, అదేరోజు మధ్యాహ్నం వార్డు ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి పోస్టుకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చి జిల్లా, రాష్ట్రస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానిస్తున్నారు. బెంచిపై పక్కపక్కనే అభ్యర్థులు కూర్చున్నా వేర్వేరు ప్రశ్నపత్రాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేటగిరి-1లోని ఉద్యోగాలకు పరీక్ష రాసే వారందరికీ తెలుగులోనే ప్రశ్నపత్రాలు సిద్ధం చేస్తున్నారు. మిగతా కేటగిరిల్లో ఉద్యోగాలకు ఆంగ్లభాషలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఎనర్జీ అసిస్టెంట్లకు రాతపరీక్ష లేదు
తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో 7,966 ఎనర్జీ అసిస్టెంట్ల(జూనియర్‌ లైన్‌మన్‌) పోస్టులకు రాత పరీక్ష నిర్వహించడం లేదు. విద్యుత్తు స్తంభం ఎక్కడం, మీటర్‌ రీడింగ్‌ తీయడం, సైకిల్‌ తొక్కడం వంటివి నిర్వహించి వీటిలో ఎంపికైన వారందరి విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి ఫలితాలు ప్రకటిస్తారు. ప్రక్రియను సెప్టెంబ‌రు 16లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
10 రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో..
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఆగ‌స్టు 10న రాత్రి 11.59గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి రోజైనందున పోర్టల్‌పై ఒత్తిడి పెరిగి, సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కేటగిరి-1 పోస్టులపైనే మొగ్గు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో కేటగిరి-1 పోస్టులకే నిరుద్యోగులు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. జులై 19న ఉద్యోగ ప్రకటన వెలువడ్డాక ఇప్పటివరకు మొత్తం పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 9,20,644 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేశారు. వీరిలో 5,47,614 (59.48 శాతం) మంది కేటగిరి-1లోని పోస్టులకే దరఖాస్తు చేయడం విశేషం. గడువు ముగిసేలోగా ఇదే కేటగిరిలో మరో ఐదు లక్షలకుపైగా దరఖాస్తులొచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేటగిరి-3లో పోస్టులకూ స్పందన
కేటగిరి-3లోనూ 11 రకాల పోస్టులను భర్తీ చేయడంతో వీటికి ఇప్పటివరకు 2,41,663 దరఖాస్తులొచ్చాయి. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పట్టు పరిశ్రమ, పశుసంవర్థక వైద్య ఆరోగ్య శాఖల ఉద్యోగాలతోపాటు పట్టణ పారిశుద్ధ్యం-పర్యావరణ, ప్రణాళిక- క్రమబద్ధీకరణ, సంక్షేమ-అభివృద్ధి, విద్య సంబంధిత కార్యదర్శుల పోస్టులు ఈ కేటగిరిలో ఉన్నాయి. ఆయా విభాగాల్లో డిప్లమో, ఇతర నైపుణ్య కోర్సులు చేసిన వారంతా రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో పొరుగుసేవల, ఒప్పంద కేటగిరిల్లో వీరంతా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ‌ల్లో సేవలందిస్తున్నారు. ఇప్పటికి సరైన అవకాశం వచ్చిందన్న భావనతో వీరంతా భారీగా దరఖాస్తులు చేస్తున్నారు.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు
కేటగిరి-1 5,47,614
కేటగిరి-2 (ఎ) 54,419
కేటగిరి-2 (బి) 76,948
కేటగిరి-3 2,41,663
మొత్తం 9,20,644
ఏడేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు
పదో తరగతికి ముందు ఏడేళ్ల పాటు ఎక్కడ చదివితే అదే జిల్లా స్థానికత అవుతుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారంతా ఈ విషయాన్ని గమనించాలని శనివారం ఓ ప్రకటనలో సూచించారు. వివాహం తర్వాత జిల్లా మారిన మహిళా అభ్యర్థులను ఆ జిల్లాలో స్థానికేతరులుగానే(నాన్‌ లోకల్‌) పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన వారంతా విధిగా గ్రామ స్థాయిలోనే నివాసం ఉండాలని పేర్కొన్నారు.

Posted on 05-08-2019