ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

1 నుంచి సచివాలయ ఉద్యోగార్థులకు రాతపరీక్షలు

* ఆరు రోజులపాటు నిర్వహణ
* పోటీపడనున్న 21.69 లక్షల మంది అభ్యర్థులు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన 21,69,719 మందికి సెప్టెంబ‌రు 1 నుంచి ఆరు రోజులపాటు రాత పరీక్షలు నిర్వహించనున్నారు. 2, 5 తేదీల్లో సెలవులు కావడంతో 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో పరీక్షలకు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం దరఖాస్తులను మూడు దశలుగా విభజించి ఈ క్రతువు పూర్తి చేయనున్నారు. వివిధ కేటగిరిల్లో ఉద్యోగాలకు అత్యధికంగా వచ్చిన దరఖాస్తుదారులకు 1, 3 తేదీల్లో, మిగతా వారందరికీ తదుపరి రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ వివరాలను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల అధికారులు మంగళవారం అధికారికంగా వెల్లడించనున్నారు.
ఒకటో తేదీన కేటగిరి-1లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన దాదాపు 15.50 లక్షల మందికి పరీక్ష నిర్వహించనున్నారు. 13 జిల్లాల్లోని అన్ని తాలూకా, మండల కేంద్రాల్లో కలిపి ఉదయం 12.54 లక్షలు, రెండో పూట 2.96 లక్షల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ ఇంజినీరింగ్‌ కార్యదర్శి, వార్డు సౌకర్యాల కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసిన 1,33,800 మందికి, గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) పోస్టులకు అర్జీలు పెట్టిన మరో 1.55 లక్షల మందికి 3, 4 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. మిగతా కేటగిరిల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారందరికీ రోజుకు లక్ష మందికి చొప్పున 6, 7, 8 తేదీల్లో నిర్వహిస్తారు. 1న తాలూకా, మండల కేంద్రాల్లో, మిగతా తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
50 వేలకు పైగా పరీక్ష గదులు
పరీక్ష కేంద్రాలు మూడు విభాగాలుగా ఉంటాయి. 16 మంది అభ్యర్థులకో గది, 24, 48 మందికో గది చొప్పున పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందుకోసం 50 వేలకుపైగా గదులను సిద్ధం చేస్తున్నారు. ఇదివరకే పరీక్షల తేదీలను ప్రాథమికంగా ఖరారు చేసినా అత్యధికంగా వచ్చిన దరఖాస్తులను దృష్టిలో పెట్టుకొని అధికారులు మళ్లీ మార్పులు చేస్తున్నారు.

Posted on 13-08-2019