ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

సచివాల‌య‌ పోస్టుల ప్రకటనపై హైకోర్టులో వ్యాజ్యం

* ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం
ఈనాడు, అమరావతి: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీచేసిన ప్రకటనను రద్దు చేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన వ్యాజ్యంలో సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి ఆగ‌స్టు 13న‌ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
వార్డు ‘సంక్షేమ, అభివృద్ధి’ కార్యదర్శి ఉద్యోగాలకు సోషల్‌ వర్క్, సోషియాలజి, ఆంత్రోపాలజీలో పట్టా ఉన్నవారు అర్హులని జీవోలో పేర్కొన్నారని.. అందుకు విరుద్ధంగా ఉగ్యోగ ప్రకటనలో ఆర్ట్స్‌ డిగ్రీ, హ్యుమానిటీస్‌ అర్హత ఉన్నవారు అర్హులేనని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన గంజి ప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల సమర్పణ గడువు ముగిశాక వ్యాజ్యంపై విచారణ జరిపి ఏం ప్రయోజనం అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయవాది బదులిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటన జారీచేసిన నేపథ్యంలో దానిని రద్దు చేయవచ్చన్నారు. దీంతో న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు.

Posted on 13-08-2019