ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

స‌చివాల‌య పరీక్షలకు 25 నుంచి హాల్‌టికెట్ల జారీ

* సెప్టెంబరు 1 నుంచి 6 రోజులపాటు పరీక్షల నిర్వహణ
* కేటగిరి-1లో ఉద్యోగాలకు అత్యధిక స్పందన
* అవినీతిపరులను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దు
* ఏపీ పంచాయతీరాజ్, పురపాలక కమిషనర్లు గిరిజా శంకర్, విజయకుమార్‌

ఈనాడు-అమరావతి: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాలకు సెప్టెంబ‌రు ఒకటి నుంచి నిర్వహించే రాతపరీక్షల కోసం దరఖాస్తుదారులంతా ఆగ‌స్టు 25 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలకశాఖల కమిషనర్‌లు గిరిజాశంకర్, విజయకుమార్‌ సూచించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌ సుధాకర్‌తో కలిపి వీరు ఆగ‌స్టు 13న‌ విలేకరులతో మాట్లాడారు. http://gramasachivalayam.ap.gov.in/ http://vsws.ap.gov.in/ htpp://wardsachivalayam.ap.gov.in పోర్టల్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ఆరు రోజులపాటు రెండుపూటలా నిర్వహించే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 21,69,719 మంది హాజరవుతారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్ష కేంద్రాలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. పరీక్ష నిర్వహించిన రోజున అదే ప్రశ్నపత్రానికి సంబంధించి సాయంత్రం విడుదల చేసే ప్రాథమిక ‘కీ’పై మూడు రోజుల్లో అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, హాజరయ్యే అభ్యర్థులకు పంచాయతీరాజ్, పురపాలకశాఖల కమిషనర్‌లు చేసిన సూచనలు వారి మాటల్లోనే....
* మూడు విభాగాల్లో పోస్టులకు మొత్తంగా 21,69,719 దరఖాస్తులొచ్చాయి. వీటిలో కేటగిరి-1లోని పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-5), మహిళా పోలీస్, సంక్షేమ-విద్య అసిస్టెంట్, వార్డు పరిపాలన కార్యదర్శి ఉద్యోగాలకు అత్యధికంగా 12,54,034 దరఖాస్తు చేశారు. మిగతా విభాగాల్లో డిజిటల్‌ అసిస్టెంట్లకు 2,95,907, వీఆర్‌వో/గ్రామ సర్వే అసిస్టెంట్లకు 1,55,168, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌/వార్డు ఎమినిటీస్‌ కార్యదర్శులకు 1,33,811 దరఖాస్తులొచ్చాయి. 9,886 పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు 6,265 మాత్రమే దరఖాస్తులు చేశారు. దీన్ని పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాం. తదుపరి నిర్ణయం ఆధారంగా మరోసారి దరఖాస్తులు ఆహ్వానించే విషయాన్ని పరిశీలిస్తాం.
* నిర్వహించే 14 పరీక్షల్లో పది ఆంగ్ల, తెలుగు భాషల్లో.. మరో నాలుగు పరీక్షల్లో ప్రశ్నపత్రాలు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంటాయి.
* కలెక్టర్ల పర్యవేక్షణలో పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లుచేశాం. అభ్యర్థులు ఇతరుల మాయలో పడి మోసపోవద్దు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేలా కృషిచేయాలి.
* ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన పర్యవేక్షకుడు/ప్రత్యేక అధికారి, మూడు నుంచి నాలుగు పరీక్ష కేంద్రాలకో పర్యవేక్షకుడు, కేంద్రానికో ఇన్వెజిలేటర్, 5 నుంచి 6 పరీక్ష కేంద్రాలకో రూట్‌ ఆఫీసర్, ఒకటి, రెండు మండలాలకో జిల్లా ప్రత్యేక అధికారి-ఫ్లయింగ్‌ స్క్వేడ్‌ ఏర్పాటుచేశాం.
* బహుళ ఐచ్ఛిక ప్రశ్నలతో ఒక్కో పరీక్ష రెండు పార్టులుగా రెండున్నర గంటలు ఉంటుంది. పార్టు-ఎలో సాధారణ అంశాలు, పార్టు-బిలో టెక్నికల్‌ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి రుణాత్మక మార్కుకి 0.25 నెగిటివ్‌ మార్కు ఉంటుంది. ఎ.బి.సి.డి. సిరీస్‌లో ప్రశ్నపత్రాలు ముద్రించి జంబ్లింగ్‌ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నందున చూచిరాతలకు ఆస్కారం లేదు. నేత్రాలు, చేతులు సహకరించని దివ్యాంగుల తరఫున పరీక్షలు రాసేందుకు సహాయకుణ్ని అనుమతిస్తాం.
* పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో తీయించి జిల్లా కేంద్రాల్లోని కమాండ్‌ సెంటర్లలో అధికారులు పర్యవేక్షిస్తారు.
* అభ్యర్థులు గుర్తింపు కార్డుతో పాటు హాల్‌టికెట్‌ తీసుకొని నిర్ణీత సమయానికి గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. ప్రత్యేకించి మహిళలు, దివ్యాంగులకు సమీపంలోనే కేంద్రాలు కేటాయిస్తున్నాం.

Posted on 13-08-2019