ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

పరీక్షల మీద పరీక్షలు

* ఆగస్టులో గ్రూప్‌-2, 3 ప్రధాన పరీక్షలు
* సెప్టెంబరులో గ్రామ, వార్డు సచివాలయ నియామకాలు
* సన్నద్ధతపై అభ్యర్థుల్లో ఉత్కంఠ
ఈనాడు - అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు వెలువడినందున అభ్యర్థుల్లో హడావుడి మొదలైంది. సన్నద్ధతపై దృష్టి కేంద్రీకరించారు. సెప్టెంబరు ఒకటో తేదీన ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష జరగనుంది. మరోవైపు గ్రూపు-3 (పంచాయతీ కార్యదర్శి) ఉద్యోగాల భర్తీకి ప్రధాన పరీక్షను ఆగస్టు 26వ తేదీన నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. గ్రూపు-2 ప్రధాన పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనుంది. గ్రూపు-2 ప్రిలిమ్స్‌ నుంచి ప్రధాన పరీక్షకు అర్హత సాధించిన వారు 6,195 మంది ఉన్నారు. గ్రూపు-3 ఉద్యోగాల భర్తీకి అర్హత సాధించిన వారు 14,175 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఒకపక్క ప్రధాన పరీక్షలకు సన్నద్ధమవుతూనే సెప్టెంబరు ఒకటో తేదీన జరిగే పరీక్షపైనా దృష్టి కేంద్రీకరించాలి. సాధారణంగా నోటిఫికేషన్ల జారీకి రాత పరీక్ష మధ్య 45 రోజుల వరకు వ్యవధి ఉండడం సంప్రదాయంగా వస్తోంది. కానీ.. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలో ఎంపికైన వారు అక్టోబరు 2వ తేదీనాటికి ఉద్యోగాల్లో చేరాలన్న లక్ష్యంతో తక్కువ వ్యవధిలోనే నియామక ప్రక్రియ జరగబోతోంది. తక్కువ సమయంలో సన్నద్ధం కావడం అభ్యర్థులకు కత్తిమీద సాములా మారింది. ఈ పరిస్థితుల్లో పకడ్బందీ ప్రణాళికతో రాత పరీక్షకు సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారు అక్టోబరు 2వ తేదీన విధుల్లో చేరేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. గ్రూపు-3, 2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రధాన పరీక్షల ఫలితాలను కూడా వెంటనే ప్రకటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారు గ్రూపు-3, 2 ఉద్యోగాలకూ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రూపు-3, 2 ఉద్యోగాల ఫలితాల వెల్లడి, నియామకాల్లో జాప్యం జరిగితే అభ్యర్థులు తొలుత గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో చేరతారు. అనంతరం గ్రూపు-3, 2 ఉద్యోగాలకు ఎంపిక జరిగితే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను వదులుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రాధాన్య క్రమంలో వీరి తరువాత వరుసలో ఉన్న వారికి అవకాశం పోతుంది.

Posted on 29-07-2019