ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

సచివాలయ అభ్యర్థుల్లో 42 శాతం పోస్టు గ్రాడ్యుయేట్లే

* మొత్తంగా 21.69 లక్షల దరఖాస్తులు

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురాబోతున్న గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగాల కోసం చేసిన దరఖాస్తుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ల నుంచి వచ్చినవే అధికంగా ఉన్నాయి. మొత్తం దరఖాస్తుల్లో వీరి నుంచే 42 శాతం వచ్చాయి. అలాగే గ్రాడ్యుయేట్ల నుంచి 38 శాతం, ఇంజినీరింగ్‌ అభ్యర్థులు 20 శాతం మంది దరఖాస్తు చేశారు. సెప్టెంబ‌రు 1 నుంచి 8వ తేదీ మధ్య నిర్వహించనున్న రాత పరీక్షల కోసం ఆగ‌స్టు 25 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ప్రభుత్వ కొలువులు కావడంతో: సచివాలయాల్లో చేస్తున్న నియామకాలు శాశ్వత ఉద్యోగాలు కావడంతో అధికారులు ఊహించినట్లే పెద్ద సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి. డిగ్రీ చదవిన వారంతా కేటగిరి-1లోని పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-5), మహిళా పోలీస్‌, సంక్షేమ, విద్య సహాయకులు, వార్డు పరిపాలన కార్యదర్శి పోస్టులకు పోటీ పడుతున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు కేటగిరి-1లోని పోస్టులతోపాటు ఇతర విభాగాల్లో ఉద్యోగాలకూ దరఖాస్తులు చేశారు. వీరు రెండు, మూడు పరీక్షలు రాయనున్నారు. ఇంజినీరింగ్‌ అభ్యర్థులు కేటగిరి-3లోని పోస్టులకు ప్రాధాన్యమిచ్చారు. సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చేసిన వీరంతా ఇంజినీరింగ్‌ సహాయకులు, వార్డు ప్లానింగ్‌, నియంత్రణ కార్యదర్శి, వార్డు విద్య, డేటా ప్రొసెసింగ్‌ కార్యదర్శి, వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి పోస్టులకు పోటీ పడుతున్నారు.


Posted on 17-08-2019