ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

అభ్యర్థులకు భరోసా ఇవ్వాలి

* పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది సూచన
ఈనాడు, అమరావతి: ‘‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలు పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయన్న భరోసాను అభ్యర్థులకు ఇవ్వాలి. నియామకాల సరళిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేలా అధికారుల చర్యలుండాలి'' అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆగ‌స్టు 20న‌ తాడేపల్లిలో జరిగిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ‘‘ఉద్యోగాల సాధన కోసం అభ్యర్థులు రేయింబవళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ నియామకాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు'' అని పేర్కొన్నారు. ‘‘ప్రశ్నపత్రాలు, ఓంఎఆర్‌ షీట్లు, ఇతర విలువైన సామగ్రిని భద్రపరిచే స్ట్రాంగురూంల వద్ద భద్రత విషయంలో అప్రమత్తత అవసరం. ఓఎంఆర్‌ షీట్ల బండిల్స్‌ ఆగ‌స్టు 21 నుంచి జిల్లాలకు చేరతాయి. గోప్యత విషయంలో రాజీపడకూడదు. అరకు, పాడేరు వంటిచోట్లా పరీక్షా కేంద్రాలున్నాయి'' అని కమిషనర్‌ గిరిజా శంకర్‌ పేర్కొన్నారు. ‘‘రికార్డు స్థాయిలో నియామకాలు జరగబోతున్నాయి. చిన్న పొరపాటుకూ ఎక్కడా అవకాశం ఇవ్వొద్దు'' అని అధికారులకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ సంచాలకుడు విజయ కుమార్‌ సూచించారు. సమావేశంలో జిల్లాల విద్యాశాఖాధికారులు, ఉన్నతాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లాల సంయుక్త కలెక్టర్లు పాల్గొన్నారు.

Posted on 21-08-2019