ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

కలెక్టర్లకే అధికారాలు

* సచివాలయ ఉద్యోగుల నియామకాల బాధ్యత వారికే
* రెండు రోజుల్లో విడుదల కానున్న జీవో
ఈనాడు, అమరావతి: జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) విధానంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు కల్పిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు రూపొందించిన దస్త్రానికి ప్రభుత్వ ఆమోదంతో ఒకటి, రెండు రోజుల్లో జీవో విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ నియామకాలకు ఇప్పటివరకు డీఎస్సీ విధానం అమలులో ఉంది. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలనూ ఇదే విధానంలో చేపట్టనున్నారు. డీఎస్సీకి కలెక్టర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ నియామక ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలి. రాత పరీక్ష నిర్వహణ నుంచి రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగుల నియామకం వరకు డీఎస్సీ క్రియాశీలంగా వ్యవహరించనుంది.

జిల్లాల్లో ఎక్కడైనా నియామకం
* డీఎస్సీ విధానంలో నియామకాలు చేస్తున్నందున ఎంపికైన అభ్యర్థులు జిల్లాలో ఎక్కడైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్‌, పోస్టుల ఎంపిక ఉంటున్నందున జిల్లాలో ఏ మండలంలో, పంచాయతీలోనైనా నియమించొచ్చు.
* ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సందర్భంలో రాత పరీక్ష కోసం అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో మూడు జిల్లాలను ఎంపిక చేసుకోవాలి. అవకాశాన్ని బట్టి ఏ జిల్లాలో పరీక్ష రాయాలో యంత్రాంగం సమాచారాన్ని అందిస్తుంది.
* రాత పరీక్ష పూర్తయ్యాక వెబ్‌సైట్‌లో ప్రాథమిక కీ ఉంచుతారు.

అభ్యర్థుల్లో మొదలైన హడావుడి
ఒకేసారిగా 1.25 లక్షలకుపైగా శాశ్వత ఉద్యోగాల నియామకం కోసం ప్రభుత్వం ప్రకటన చేయడంతో నిరుద్యోగ యువతీ యువకుల్లో హడావుడి మొదలైంది. వీరంతా దరఖాస్తులు చేసుకోడానికి పెద్దఎత్తున పోటీ పడటంతో వెబ్‌సైట్‌ ఎప్పటికప్పుడు మొరాయిస్తోంది. అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు అనేక సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. స్వల్ప కాలిక కోర్సులు ప్రవేశపెడుతున్నారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలులో కొత్తగా శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి.

Posted on 29-07-2019