ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

గ్రామసచివాలయ ఉద్యోగాలకు నాలుగు లక్షలకుపైగా దరఖాస్తులు

* వాలంటీర్లకు ఆగ‌స్టు 1న‌ నియామక పత్రాలు
ఈనాడు-అమరావతి : గ్రామ సచివాలయాల్లో వివిధ కేటగిరిల్లో ఉద్యోగాలకు గత నాలుగు రోజుల వ్యవధిలో 4,71,103 మంది దరఖాస్తులు చేశారు. కేటగిరి-1లోగల పోస్టులకు అత్యధికంగా 2,78,027 మంది దరఖాస్తులు చేశారని అధికారులు తెలిపారు. గ్రామ, పట్టణ వాలంటీర్లకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆగ‌స్టు 1న‌ నియామక పత్రాలు పంపనున్నారు. ఎంపికైన వారంతా 5 నుంచి 10 వరకు శిక్షణ తీసుకున్నాక 15 నుంచి విధులకు హాజరవుతారు.
* సవరణలకు అవకాశం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసే నిరుద్యోగులు తొందర్లో చేసే పొరపాట్లను సవరించుకునే అవకాశం జులై 31 నుంచి అమల్లోకి వచ్చింది. దరఖాస్తుదారు గుర్తింపు సంఖ్య (ఓటీపీఆర్‌ ఐడీ) ఆధారంగా పేరు, చిరునామా, విద్యార్హతలు, ఆధార్‌ వివరాలు ఇలా దేనినైనా పాత దరఖాస్తులో సవరణలు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ సందేహాలను నివృత్తి చేసేందుకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవా కేంద్రానికి రోజూ ఆరు వేల మందికిపైగా ఫోన్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 22 మంది ఉద్యోగులు సేవలు అందిస్తూ విద్యార్థుల సందేహాలు తీరుస్తున్నారు.

Posted on 01-08-2019