ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > చరిత్ర - ప్రిపరేషన్‌ విధానం

సమన్వయంతో సాగాలి అధ్యయనం!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష సిలబస్‌లో ‘భారతదేశ చరిత్ర, సంస్కృతి - ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి’ అని ఇచ్చారు. ఒక వాక్యంగానే కనిపించినప్పటికీ దాని పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం చదవాలి, ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి ఎలా సమన్వయం చేసుకోవాలి.. తదితరాలపై అభ్యర్థులు అవగాహన ఏర్పరచుకోవాలి.

సిలబస్‌లో ‘భారతదేశ చరిత్ర- సంస్కృతి’ అని ప్రస్తావించారు కాబట్టి రాజకీయ చరిత్ర కంటే నాటి ఆర్థిక, సాంఘిక, మత, సాంస్కృతిక అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. శాతవాహనయుగం, తూర్పు చాళుక్యయుగం, కాకతీయ యుగం, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్‌షాహీ కాలంనాటి పరిస్థితులు, ఆంగ్లేయుల పాలనలో ఆంధ్రదేశం, స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులపాత్ర లాంటి అంశాలను అధ్యయనం చేయాలి.

శాతవాహన యుగంలో మొదటి శాతకర్ణి, కుంతల శాతకర్ణి, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణిల కాలం నాటి పరిస్థితులపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. హాలుడు (గాథాసప్తశతి), గుణాఢ్యుడు (బృహత్కథ) శర్వవర్మ (కాతంత్ర వ్యాకరణం) నాగార్జునుడి రచనల వివరాలను చదవాలి. అమరావతి శిల్పకళ, వాస్తు నిర్మాణాల గురించి తెలుసుకోవాలి. ఇక్ష్వాకులు, వారి రాజధాని విజయపురి, ఆ కాలంలో అభివృద్ధి చెందిన నాగార్జునకొండ, బౌద్ధమతవ్యాప్తి వంటి విషయాలు పరీక్షల కోణంలో ముఖ్యమైనవి. తూర్పు చాళుక్యులు కుబ్జవిష్ణువర్ధనుడు (స్థాపకుడు), మొదటి జయసింహవల్లభుడు (విప్పర్ల శాసనం), మొదటి చాళుక్య భీముడు (పంచారామాల అభివృద్ధి) గుణగ విజయాదిత్యుడు (అందరిలో గొప్పవాడు), అతడి సేనాని పాండురంగడు (అద్దంకి శాసనం), రాజరాజనరేంద్రుడు వంటి రాజుల కాలం నాటి భాషాసాహిత్యాల వికాసం, వాస్తుకళారంగాల అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలి. తొలి రాజధాని వేంగి, రెండో రాజధాని రాజమహేంద్రవరం, ఆదికవి నన్నయ్య లాంటి విషయాలపై దృష్టి పెట్టాలి.

విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయల ఘనత, విదేశీ యాత్రికులు, వారి వ్యాఖ్యలు, తెలుగు సాహిత్యాభివృద్ధి, అష్టదిగ్గజాల రచనలు, అప్పటి దేవాలయాలు, వాస్తు కళారంగాల అభివృద్ధి గురించి తెలుసుకోవాలి. న్యూనిజ్‌, బార్బోసా, డొమింగోపెయిస్‌, అబ్దుల్‌రజాక్‌ లాంటి విదేశీ రాయబారుల రచనల్లో పేర్కొన్న అంశాలను అధ్యయనం చేయాలి. కుతుబ్‌షాహీ పాలకుల కాలంనాటి తెలుగు భాషాకవుల పోషణ, నాటి సాంఘిక మత విషయాలు, కంచర్ల గోపన్న (భక్త రామదాసు) చరిత్ర, ఇబ్రహీంకులీ, మహమ్మద్‌కులీ, తానీషా పాలకుల కాలంనాటి ప్రాధాన్యాంశాలపై దృష్టిపెట్టాలి. ఆంధ్రదేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించిన విధానం అంటే ఉత్తర సర్కారులు, దత్త మండలాలు, నెల్లూరు చిత్తూరు జిల్లాలను ఎలా ఆక్రమించుకున్నారు, కారణాలను తెలుసుకోవాలి. విభజించి పాలించు విధానం ద్వారా ఘర్షణలను ఎలా సృష్టించారు, 1757 నాటి బొబ్బిలియుద్ధం, 1794 పద్మనాభయుద్ధం, జమీందారులు, పాలెగాళ్ల తిరుగుబాటులు, కంపెనీ ఆంగ్ల ప్రభుత్వ పాలనా ప్రభావాలు, సాంస్కృతిక పునరుజ్జీవనం కందుకూరి, రఘుపతి వెంకటరత్నం నాయుడు లాంటి సంఘ సంస్కర్తల సేవలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా భారత జాతీయోద్యమంలో భాగంగా ఆంధ్రదేశంలో జరిగిన వందేమాతర, హోంరూల్‌ ఉద్యమాలు, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల గురించి ప్రత్యేకంగా చదవాలి. మరీ ముఖ్యంగా ఆంధ్రోద్యమం, ఆంధ్రరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ కాలం నాటి ముఖ్యాంశాలు, జై తెలంగాణ (1969) జై ఆంధ్ర ఉద్యమాలు (1972), ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు (2014) లాంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి.

కాకతీయుల నుంచి రెడ్డి రాజుల వరకు
కాకతీయ యుగంలో రుద్రదేవుడు (స్వతంత్ర రాజ్యస్థాపకుడు), గణపతిదేవుడు, రుద్రమదేవి పాలనా విశేషాలు, నాయంకర పద్ధతి (సైనిక విధానం), వాస్తు నిర్మాణాలు (వేయిస్తంభాల గుడి, రామప్పగుడి), తెలుగు, సంస్కృత భాషా రచనలు, మత, ఆర్థిక, సాంఘిక అంశాలను చదవాలి. రుద్రమదేవి కాలంలో వచ్చిన మార్కోపోలో వ్యాఖ్యలు, మోటుపల్లి ఓడరేవు ప్రాధాన్యాలను తెలుసుకోవాలి. రెడ్డిరాజులు, వారి పరిపాలనా విషయాలు; అనవేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, శ్రీనాథుడి గురించి అధ్యయనం చేయాలి.

Posted on 15-08-2019