ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > ప్రిపరేషన్‌ విధానం

అపోహలు పక్కనపెట్టి ధీమాగా.. ధైర్యంగా!

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో రకరకాల మానసిక పరిస్థితులు కనిపిస్తుంటాయి. అంతా చదవలేకపోయామనీ, ఏదీ గుర్తుండటం లేదనీ, పేపర్లు లీకవుతాయనీ.. ఇలా ఏవేవో ఊహించుకుంటూ ఆందోళన పడుతుంటారు. అపోహలను వదిలిపెట్టి ధీమాగా.. ధైర్యంగా పరీక్షకు హాజరు కావాలి. ప్రిపేర్ అయినంత వరకు బాగా రాయడానికి ప్రయత్నించాలి.

1. మనోబలమే సగం విజయం: గతంలో పోటీ పరీక్షలు రాసినవారు కొంతవరకు మనోధైర్యంతో ఉంటారు. కానీ సిలబస్ భారం, లభించిన వ్యవధి తక్కువ కావడంతో చాలామంది మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలి. పోటీ పరీక్షల్లో ఎంత ఎక్కువ సమయం ఇచ్చినా ఇంకా ఏదో చదవలేదనే అసంతృప్తి సహజమే. ఈ సత్యాన్ని గుర్తించి ఉన్నంతలో బాగా చదివాను అనే సంతృప్తి పెంచుకోవాలి. దీనివల్ల పరీక్షా సమయంలో సరిగ్గా రాణించే అవకాశం ఉంటుంది.

2. సిలబస్ పూర్తికాలేదనే చింత: సిలబస్ ప్రకారం చదవడం పూర్తి కాలేదు అని అసంతృప్తి చెందుతుంటారు. దీని వల్ల న్యూనతకు గురవుతుంటారు. ఇది సరైన ఆలోచన కాదు. ఇటీవల జరిగిన ఏఎస్ఓ, పంచాయతీ కార్యదర్శుల పరీక్షల్లో, గతంలో అనేక పరీక్షల్లోనూ సిలబస్ లోని అన్ని విభాగాలకూ సమాన ప్రాధాన్యంతో ప్రశ్నపత్రాలు తయారుచేయలేదు. అందుకని- అది చదవలేదు, ఇది చదవలేదు అనే ఆందోళన అవసరం లేదు. సాధారణంగా సిలబస్ లో కొన్ని విభాగాలపై అభ్యర్థులు ఆశలు ఎక్కువ పెట్టుకుంటారు. వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు ఆశిస్తారు. కానీ ఆశించిన సంఖ్యలో ప్రశ్నలు రాకపోతే మొత్తం పరీక్షను చెడగొట్టుకుంటారు. ఇటీవల జరిగిన పంచాయతీ కార్యదర్శుల పరీక్షలో జనరల్ స్టడీస్ లో వర్తమాన అంశాల నుంచి ఒకే ఒక ప్రశ్న అడిగారు.
తాజా ఉదాహరణ: గురువారం జరిగిన గ్రూప్-2 పరీక్షలో సిలబస్ లో ఉన్న అన్ని అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇండియన్ జాగ్రఫీ, విభజన సమస్యలు, భారతదేశ చరిత్ర, కరెంట్ అఫైర్స్ లకు కనీసం ప్రాతినిధ్యం లేకుండానే ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. ఏఎస్ఓ పరీక్షలో అత్యధిక ప్రశ్నలు ఎకానమీ నుంచి అడిగారు. గతంలో జరిగిన ఒక పరీక్షలో 50 శాతానికి పైగా ప్రశ్నలు వర్తమాన అంశాల్లోనివే. ఇలాంటి పరిస్థితిని ముందుగానే ఊహిస్తే పరీక్ష హాల్లో ఎటువంటి ఇబ్బందులకూ గురి కాకుండా వచ్చినంత మేరకు సమర్థంగా రాయవచ్చు.

3. తెలియనివాటికి జవాబులు రాస్తే: నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలామంది పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. దీన్ని హేతుబద్ధరీతిలో అర్థం చేసుకుంటే నష్టం రాకుండా చూసుకోవచ్చు. సగటు అభ్యర్థులు, మొదటిసారి పరీక్ష రాసేవారు కనీసం నాలుగు ప్రశ్నల్ని లాటరీ ద్వారా గుర్తిస్తే ఒకటైనా రైట్ అవుతుంది కాబట్టి నష్టమేమీ లేదనే అభిప్రాయంతో ఉంటారు. అదృష్టం ఉంటే కనీసం రెండయినా రైట్ అయితే లాభమే కదా అని సంభావ్యత లెక్కలు వేసుకుంటుంటారు. ఇటీవల జరిగిన గ్రూప్ వన్ స్క్రీనింగ్ లో ఒక అభ్యర్థికి కచ్చితంగా తెలిసిన ప్రశ్నలు 92 ఉన్నాయి. కానీ పైన చెప్పిన పద్ధతిలో ఆలోచించి మొత్తం 135 ప్రశ్నల వరకు సమాధానాలు గుర్తించారు. తీరా పోల్చుకుంటే 40 ప్రశ్నల వరకు తప్పులేనని అర్థమైంది. పర్యవసానంగా స్కోరు బాగా పడిపోయింది. నెగెటివ్ మార్కింగ్ ఉన్న ప్రశ్నపత్రాల్లో తెలిసిన వాటికి కచ్చితమైన సమాధానాన్ని గుర్తించి మిగతా ప్రశ్నలు వదిలివేయడం సరైన పద్ధతి.

4. ప్రశాంత మానసిక స్థితి: ఆబ్జెక్టివ్ పరీక్షలో బాగా రాణించాలంటే కనీసం 18 గంటల ముందు ప్రిపరేషన్ ను నిలిపేయాలి. ప్రశాంతమైన మానసిక స్థితిని అలవర్చుకోవడం చాలా అవసరం. చాలామంది అభ్యర్థులు పరీక్ష హాలు దగ్గర కూడా చదువుతూ ఉంటారు. దీనివల్ల ఒక బిట్ లో ఏదైనా అదృష్టం కలిసి రావచ్చు కానీ అత్యధిక బిట్లను తికమక వల్ల నష్టపోవచ్చు.

5. ఆశించినవి రాకపోయినా సరే...: చాలామంది మార్కెట్లో దొరికే ఒకటి రెండు పుస్తకాల నుంచి ప్రశ్నలు వస్తాయని ఆశించి భంగపడతారు. అభ్యర్థులు తాము చదివిన పుస్తకాల నుంచి ప్రశ్నలు రావాలని కోరుకుంటారు. దానికి వ్యతిరేకంగా జరగగానే ఆశాభంగంతో పరీక్షలో తమకు వచ్చినవి కూడా సరిగా రాయలేరు. అందుకని అభ్యర్థులు సంయమనం కోల్పోకుండా జాగ్రత్తపడాలి.

6. నమూనా పరీక్షలు జాగ్రత్త: కొంతమంది అభ్యర్థులు చివరి రోజుల్లో తమ సన్నద్ధతా సామర్థ్యాన్ని పరిశీలించుకునేందుకు మాక్ పరీక్షలను రాస్తూవుంటారు. ఆ పరీక్షల్లో మార్కులు సరిగా రాకపోతే నిరాశతో నీరసపడిపోతారు. దీంతో నిజమైన పరీక్షలను సమర్థంగా ఎదుర్కోలేక పోతారు. అందువల్ల హేతుబద్ధం కాని నమూనా పరీక్షలను రాయకూడదు. వాటిలో వచ్చిన స్కోర్లపై ఆధారపడి నష్టపోకూడదు.


కొడాలి భవానీ శంకర్
Posted on 31-08-2019