ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > ప్రిపరేషన్‌ విధానం

సచివాలయ ఉద్యోగాలకు సిద్ధమేనా?

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల్లో 16,207 పోస్టుల నియామకం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్, పురపాలక శాఖలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో 13 రకాలు, వార్డు సచివాలయాల్లో 6 రకాలు ఉన్నాయి. కొలువులను బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, సాంకేతిక అర్హతలున్నవారు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు ఏ వ్యూహంతో ముందుకు సాగాలో తెలుసుకుందాం!

పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ 5, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, వార్డు పరిపాలన కార్యదర్శి పోస్టుల భర్తీకి నిర్వహించే రాతపరీక్షల్లో 150 ప్రశ్నలు జనరల్‌ స్టడీస్‌ నుంచి అడుగుతారు. మిగతా ఉద్యోగాలన్నిటికీ 50 ప్రశ్నల జనరల్‌ స్టడీస్‌ ఉంటుంది.

150 మార్కుల జీఎస్‌ విషయానికి వస్తే ఇందులో పార్ట్‌- ఎ, పార్ట్‌- బి ఉంటాయి. ఒక్కొక్కదానిలో 75 ప్రశ్నలు ఇస్తారు.

* పార్ట్‌-ఎలో జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, తెలుగు- ఇంగ్లిష్‌ భాషల్లో కాంప్రహెన్షన్, జనరల్‌ ఇంగ్లిష్, బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్, వర్తమానాంశాలు, జనరల్‌ సైన్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సుస్థిర అభివృద్ది- పర్యావరణ పరిరక్షణ సిలబస్‌ అంశాలు.

* పార్ట్‌-బిలో భారతదేశ- ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, సంస్కృతి, భారత రాజ్యాంగం, గవర్నెన్స్, భారతదేశ- ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, సమాజం, సాంఘిక న్యాయం, హక్కులు, భారతదేశ- ఆంధ్రప్రదేశ్‌ భౌతిక భౌగోళిక అంశాలు, ఆంధ్రప్రదేశ్‌ విభజన సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కీలక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధి స్వయం సహాయక బృందాలు సిలబస్‌లో భాగంగా ఉన్నాయి.

జనరల్‌ స్టడీస్‌లో 50 మార్కుల ప్రశ్నలున్న పరీక్షల్లో సిలబస్‌ పైన వివరించిన పార్ట్‌-ఎలో ఉన్నవిధంగా ఉంటుంది. అందువల్ల రెండు రకాలైన పరీక్షలు రాసే అభ్యర్థులు కొత్తగా సిద్ధమవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఉమ్మడి ప్రణాళికతో రెండు రకాలైన జనరల్‌ స్టడీస్‌ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.

ప్రశ్నల తీరుతెన్నులు
గతంలో జరిగిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు చాలా కఠినంగా ఉన్నాయని అభ్యర్థుల భావన. వాస్తవానికి సివిల్స్, గ్రూప్స్‌కు చదివినవారు చాలావరకు మంచి స్కోర్లు సాధించారు. కారణం- వారికి ప్రాథమికాంశాలపై (బేసిక్స్‌)పై పట్టుతో పాటు స్థూలంగా అన్ని అంశాలపైనా అవగాహన ఉండటం. దీనికి భిన్నంగా మొదటిసారి పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఒకటి రెండు పుస్తకాలను బట్టీ పట్టి అందులోంచి ప్రశ్నలు రాలేదని భావించారు. అదేవిధంగా ప్రవచనాల రూపంలో ప్రశ్నలు అడగటం, చదివేందుకు ఎక్కువ సమయం పట్టేలా ప్రశ్నలు ఉండటం, నేరుగా సమాధానాలు లేకపోవడం మొదలైన అంశాల వల్ల క్లిష్టతగా భావించారు.
ఈసారి కూడా ఇదే తరహా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందువల్ల తాజాగా సిద్ధమవుతున్న అభ్యర్థులు బట్టీ పద్ధతి వదిలేసి విషయాన్ని అర్థం చేసుకుని తయారయితే మంచిది.

జీఎస్‌ ప్రశ్నల సరళి ఎలా?
గతంలో జరిగిన 150 మార్కుల జనరల్‌ స్టడీస్‌ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* పార్ట్‌ - ఎ: ఈ సిలబస్‌లో 75 ప్రశ్నలకు గాను 18 ప్రశ్నలు మానసిక సామర్థ్యాలు, రీజనింగ్‌ విభాగం నుంచి అడిగారు. అంకగణిత అంశాలపైన నాలుగు ప్రశ్నలు వచ్చాయి. అంటే దాదాపుగా 1/3 వంతు ప్రశ్నలు ఈ రెండు అంశాలపైనే ఉన్నాయి. అంటే ఎగ్జామినర్‌ అభ్యర్థుల మానసిక సామర్థ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెప్పవచ్చు. ఈసారీ ఈ విభాగం అంతే స్థాయిలో ప్రాధాన్యం పొందొచ్చు. వర్తమాన అంశాలపై 14 ప్రశ్నలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు బాగా లోతుగా ఉన్నాయి. అభ్యర్థి వర్తమాన స్పృహను పరిశీలించేందుకు ఈ ప్రయత్నం జరిగిందని చెప్పవచ్చు. తదుపరి పరీక్షలోనూ ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉంది.
దాదాపు పది ప్రశ్నలు పర్యావరణ, విపత్తు సంబంధిత అంశాలపై వచ్చాయి. అంటే దాదాపుగా పోటీపరీక్షల్లో మారిన ధోరణికి అనుగుణంగానే ఈ అంశాల ప్రాధాన్యం పెంచారనుకోవచ్చు. రాబోయే పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇదే స్థాయిలో ఈ అంశం మీద తయారవ్వాల్సి ఉంటుంది. భౌతికశాస్త్రంలో రెండు ప్రశ్నలు, రసాయన శాస్త్రంలో ఒక ప్రశ్న, వృక్ష శాస్త్రంలో ఒక ప్రశ్న, జంతు శాస్త్రంలో రెండు ప్రశ్నలు వచ్చాయి. అంటే విస్తృతమైన జనరల్‌ సైన్స్‌ సిలబస్‌కి తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని అర్థమవుతోంది. కానీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి ఏకంగా ఆరు ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రాధాన్యాలను బట్టి రాయబోయే పరీక్షకు ఏ విధంగా సంసిద్ధమవ్వాలనేది అభ్యర్థులు నిర్ణయించుకోవాలి.
భాషా పాటవాన్ని పరిశీలించేందుకు తెలుగు భాషపై 5, ఆంగ్ల భాష సంబంధిత అంశాలపై 10 ప్రశ్నలు వచ్చాయి. 75 ప్రశ్నలకు గాను 15 ప్రశ్నలు అంటే సరైన ప్రాధాన్యం భాషలకు ఇచ్చినట్లుగానే భావించవచ్చు. అందువల్ల రాబోయే పరీక్షలు ఎదుర్కొనే క్రమంలో అభ్యర్థులు తప్పక భాషాంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భాషా సంబంధిత ప్రశ్నల కఠినస్థాయిని అర్థం చేసుకునేందుకు గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం మేలైన మార్గం.
50 మార్కుల జనరల్‌ స్టడీస్‌ పరీక్షలోనూ దాదాపుగా ఇదే ధోరణి అనుసరించే అవకాశం ఉంది. అభ్యర్థులు పైన వివరించిన ప్రాధాన్యాలను అర్థం చేసుకుని సిద్ధమైతే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

* పార్ట్‌ - బి: ఈ సిలబస్‌ అంశాలను విశ్లేషిస్తే ఆంధ్రప్రదేశ్‌ సంబంధిత అంశాల నుంచి ఏకంగా 34/75 ప్రశ్నలు వచ్చాయి. అంటే దాదాపు 50 శాతం ప్రాధాన్యం! ఏపీ ఆర్థిక వ్యవస్థ నుంచి 12, ఏపీ చరిత్ర నుంచి 5, ఏపీ భౌగోళిక అంశాల నుంచి 3, ఏపీ విభజన సమస్యల నుంచి 5, స్వయం సహాయక బృందాలు- మహిళా సాధికారత నుంచి 9 ప్రశ్నలు వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు సమగ్రంగా ఏపీ సంబంధిత విషయాలపై పట్టు సాధిస్తే ఉద్యోగం పొందటం సులభమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ఆర్థిక వెనుకబాటు వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించే వివిధ పథకాలు- అమలు- వాటి గణాంకాలను అర్థం చేసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు. ఇందుకోసం 2019- 20 బడ్జెట్, 2018- 19 ఎకనామిక్‌ సర్వే, నవరత్నాలు, ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతర పరిణామాలు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
పాలిటీ, గవర్నెన్స్‌ నుంచి 14 ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా పాలిటీలో అడిగిన ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయి. రాజ్యాంగ అవగాహననూ ప్రశ్నించే స్థాయిలో ఉన్నాయి .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాల ఆధారంగా గవర్నెన్స్‌ ప్రశ్నలు అడిగారు. సోషియాలజీలో ‘సమాజం’ అనే దానికి సంబంధించి ప్రాథమిక అంశాలపైనే ప్రశ్నలు వచ్చాయి. సోషియాలజీని ప్రత్యేకంగా చదవకపోయినా సాధారణ పరిజ్ఞానంతో సమాధానాలు గుర్తించదగిన స్థాయిలో ఉన్నాయి.

గ్రూప్‌-2 సన్నద్ధత ఇప్పటికే ఆరంభించినవారు..
జనరల్‌ స్టడీస్‌లో 50 మార్కులు మాత్రమే ఉన్న పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు మొదటి ప్రాధాన్యం తమ సబ్జెక్టుకు ఇవ్వాలి. 100 ప్రశ్నలు సబ్జెక్టుల నుంచి వస్తాయి కాబట్టి ఒకరకంగా అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించే స్థాయిలో ఈ విభాగం ఉంటుందని అందరూ గుర్తించాలి. దీని కోసం గతంలో జరిగిన ప్రశ్నపత్రాలను పరిశీలించి వారి వారి సబ్జెక్టులపై పూర్తిస్థాయి అవగాహనను సాధించాలి. సబ్జెక్టుపై పట్టు బిగించిన తర్వాత జనరల్‌ స్టడీస్‌లోని మానసిక సామర్థ్యాలు, రీజనింగ్, కరెంట్‌ అఫైర్స్‌పై ముందు పట్టు సాధించాలి. తద్వారా ర్యాంకు మరింతగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో సబ్జెక్టు విభాగంలో మెరిట్‌ అభ్యర్థుల అందరూ ఒకే రకమైన మార్కులు తెచ్చుకున్నప్పటికీ జీఎస్‌ మార్కుల వల్ల అంతిమంగా ఎంపికవుతారు. ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని సన్నద్ధమవ్వాలి. పరీక్ష తేదీని బట్టి సిలబస్‌లో అన్ని అంశాలనూ చదవాలా, కొన్నిటికి పరిమితం కావాలా అనేది నిర్ణయించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు
గ్రామ సచివాలయం: 14,061 పోస్టులు
వార్డు సచివాలయం: 2,146 పోస్టులు
మొత్తం: 16,207 పోస్టులు
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: 31 జనవరి 2020.
వెబ్‌సైట్‌: http://gramasachivalayam.ap.gov.in/
వెబ్‌సైట్‌: http://wardsachivalayam.ap.gov.in/కొడాలి భవానీ శంకర్
Posted on 20-01-2020