ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > సైన్స్‌ & టెక్నాలజీ

అంతరిక్షంలోకి మార్కుల మార్గాలు

దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే టెక్నాలజీ ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు అంతరిక్షం, వివిధ ప్రయోగాలు, వాటి ప్రాధాన్యాల గురించి అధ్యయనం చేయాలి. రోదసీ రంగానికి చెందిన ప్రాథమికాంశాలతోపాటు తాజా విశేషాలను చదవాలి. ఉపయోగించిన రాకెట్లు, ఉపగ్రహాల వివరాలు, ప్రయోగ లక్ష్యాలపై ప్రత్యేకంగా పరీక్షల కోణంలో అవగాహన పెంచుకుంటే మార్కులు సాధించుకోవచ్చు.

అంతరిక్ష సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చి దేశ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ అంతరిక్ష, గ్రహాంతర పరిశోధనలే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను 1969, ఆగస్టు 15న స్థాపించారు. గతంలో ఇస్రోను INCOSPAR (ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రిసెర్చ్‌) అని పిలిచేవారు. దీన్ని 1962లో స్థాపించారు.
* ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. దీని ప్రస్తుత ఛైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌.
* ఇస్రో నిర్మించిన తొలి ఉపగ్రహం (శాటిలైట్‌) ఆర్యభట్ట. దీన్ని 1975, ఏప్రిల్‌ 19న సోవియట్‌ యూనియన్‌ నుంచి ప్రయోగించారు.
* భారత్‌లో ప్రయోగించిన తొలి శాటిలైట్‌ రోహిణి. దీన్ని 1980లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎస్‌ఎల్‌వీ3 (శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌) రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. మనదేశం మొదట్లో సౌండింగ్‌ (ప్రయోగాత్మక) రాకెట్లను; 1970-80 దశాబ్దంలో ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ తరహా రాకెట్లను అభివృద్ధి చేసింది.
* ఇస్రో అభివృద్ధి చేసి ప్రయోగించిన ఉపగ్రహాలు ఇన్‌శాట్‌ (ఇండియన్‌ నేషనల్‌ శాటిలైట్‌), ఐఆర్‌ఎస్‌ (ఇండియన్‌ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌). ఇన్‌శాట్‌ శ్రేణి ఉపగ్రహాలు కమ్యూనికేషన్‌, వాతావరణ అధ్యయనానికి; ఐఆర్‌ఎస్‌ ఉపగ్రహాలు సహజవనరుల అధ్యయనం, నిర్వహణకు తోడ్పడతాయి. ఇన్‌శాట్‌ ఉపగ్రహాలను జీఎస్‌ఎల్‌వీ (జియో సింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌) ద్వారా, ఐఆర్‌ఎస్‌ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ (పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌) ద్వారా ప్రయోగించారు.
* పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ఇస్రో పని గుర్రంగా పేర్కొంటారు. ఇది అత్యంత విశ్వసనీయత, దక్షతతో అన్నిరకాల మిషన్లను చేపడుతుంది. పీఎస్‌ఎల్‌వీ 48 ప్రయోగాల్లో 46 సార్లు విజయవంతంగా పనిచేసింది.
* ఇస్రో 2017 ఫిబ్రవరి 15న పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌తో ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనికి ముందు రష్యా ఒకే ప్రయోగంలో గరిష్ఠంగా 37 శాటిలైట్లను ప్రయోగించింది.
* జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ మూడు అంచెల్లో ఘన, ద్రవ, క్రయోజెనిక్‌ ఇంధనాలను ఉపయోగిస్తారు. మూడో అంచెలోని క్రయోజెనిక్‌ ఇంజిన్‌ అత్యంత సంక్లిష్టమైంది. దేశీయ క్రయోజెనిక్‌ ఇంజిన్‌లను కేరళలోని వళియమల, తమిళనాడు మహేంద్రగిరిలోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టం సెంటర్‌ (LPSC) లో తయారుచేస్తారు. బరువైన, దూరంగా వెళ్లే కమ్యూనికేషన్‌ శాటిలైట్లను జీఎస్‌ఎల్‌వీతో ప్రయోగిస్తారు. జీఎస్‌ఎల్‌వీ 13 ప్రయోగాల్లో 10 విజయవంతమయ్యాయి.
* ఇన్‌శాట్‌ ఉపగ్రహాలను ప్రస్తుతం జీశాట్‌ ఉపగ్రహాలుగా; ఐఆర్‌ఎస్‌ తరహా ఉపగ్రహాలను కార్టోశాట్‌, రిసోర్స్‌శాట్‌, ఓషన్‌శాట్‌, రిశాట్‌ తదితర పేర్లతో పిలుస్తున్నారు.
* నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (SDSC) అని పిలుస్తారు. 2002కు ముందు దీన్ని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్‌ రేంజ్‌ (షార్‌) అని పిలిచేవారు.
* ఇస్రోకి చెందిన వాతావరణ పరిశోధనా సంస్థ నేషనల్‌ అట్మాస్ఫిరిక్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీని తిరుపతికి సమీపంలోని గాదంకిలో స్థాపించారు. ఇస్రోకి సంబంధించిన వాణిజ్య విభాగం ఆంట్రిక్స్‌. నూతన వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (NSIL)ను కూడా ఇటీవల ప్రారంభించారు.
* ప్రపంచంలోనే అత్యంత తేలికైన (1.26 కి.గ్రా.) ఉపగ్రహం కలాంశాట్‌-వీ2ను పీఎస్‌ఎల్‌వీ-సీ44 ద్వారా 2019 జనవరి 24న ప్రయోగించారు.
* స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ గల జీఎస్‌ఎల్‌వీఎఫ్‌11 రాకెట్‌ ద్వారా అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్‌7ఎ ను 2018 డిసెంబరు 19న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.
* భారతదేశ అత్యంత బరువైన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌11. దీన్ని ఫ్రెంచ్‌ గయానా నుంచి 2018 డిసెంబరు 5న ప్రయోగించారు. తొలి విద్యా సంబంధిత శాటిలైట్‌ ఎడ్యుశాట్‌ (జీశాట్‌-3).
* భారత తొలి నానో శాటిలైట్‌ జుగ్నును షార్‌ నుంచి ప్రయోగించారు. తొలి రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ ఐఆర్‌ఎస్‌1ఎ ను 1988లో బైకనూర్‌ (రష్యా) నుంచి, తొలి కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ యాపిల్‌ను కౌరూ (ఫ్రెంచ్‌ గయానా) నుంచి ప్రయోగించారు.
* దివంగత ఆస్ట్రోనాట్‌ కల్పనా చావ్లా పేరు మీద భారత తొలి వాతావరణ అధ్యయన ఉపగ్రహం మెట్‌శాట్‌కి ‘కల్పనా శాట్‌’ అని పేరు పెట్టారు.
* భారత్‌ చేపట్టిన తొలి చంద్రమండల మానవ రహిత రోదసి యాత్ర చంద్రయాన్‌-1. దీన్ని 2008 అక్టోబరు 22న ప్రయోగించారు.
* భారత్‌ రెండో చంద్రమండల యాత్ర చంద్రయాన్‌-2ను 2019 జులై 22న జీఎస్‌ఎల్‌వీ-ఎంకేఖిఖిఖి ద్వారా శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఆర్బిటర్‌, ల్యాండర్‌ (విక్రం), రోవర్‌ (ప్రగ్యాన్‌) అనే విడి భాగాలను కలిగి ఉంది. ల్యాండర్‌ ఆర్బిటర్‌ నుంచి వేరుపడి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగుతుంది.
* భారత తొలి అంగారక గ్రహయాత్ర మంగళ్‌యాన్‌ (మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ - మామ్‌). దీన్ని 2013 నవంబరు 5న ప్రయోగిస్తే 2014 సెప్టెంబరు 24న అంగారకుడి కక్ష్యను చేరింది. అంగారకుడిపై మీథేన్‌ వాయువు ఉనికిని గుర్తించి ఆ గ్రహంపై జీవి మనుగడ సాధ్యాసాధ్యాలను పరిశీలించడమే దీని లక్ష్యం.
* 2022 నాటికి ఇస్రో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌. ముగ్గురు వ్యోమగాముల బృందాన్ని వారం రోజుల పాటు తీసుకొని వెళ్లే దీన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎంకేఖిఖిఖి ద్వారా ప్రయోగించనున్నారు.
* భారత తొలి అంతరిక్ష ఖగోళశాల ఆస్ట్రోశాట్‌. భారత ప్రాదేశిక నేవిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌. దీన్ని నావిక్‌ అని పిలుస్తారు. జీపీఎస్‌ను పోలిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థలో ఏడు ఉపగ్రహాలు నిరంతరం భారత భూభాగం నుంచి 1500 కి.మీ. దూరం వరకు ఉండే ప్రదేశాన్ని పరిశీలిస్తాయి.
* రోదసి పరిజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించడానికి ఇస్రో YUVIKA (యువ విజ్ఞాని కార్యక్రమ్‌) ను 2019 మే 13 నుంచి 26 వరకు చేపట్టింది.
రోదసి రంగానికి పునాది వేసిన శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ని భారత అంతరిక్ష పితామహుడు అంటారు. ఈ పరిశోధనలకు భారత్‌ స్థాపించిన తొలి కేంద్రం తిరువనంతపురంలోని ‘తుంబా ఈక్విటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌’. దీన్ని విక్రమ్‌ సారాభాయ్‌ మరణానంతరం ‘విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (VSSC) గా మార్చారు.

మాదిరి ప్రశ్నలు
1. క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌ని ఎక్కడ ఉపయోగిస్తారు?
1) పీఎస్‌ఎల్‌వీ మూడో అంచె
2) జీఎస్‌ఎల్‌వీ నాలుగో అంచె
3) ఏఎస్‌ఎల్‌వీ రెండో అంచె
4) జీఎస్‌ఎల్‌వీ మూడో అంచె

2. చంద్రయాన్‌-2ను ఎప్పుడు ప్రయోగించారు?
1) 2019, జులై 22 2) 2019, జులై 24
3) 2019, జులై 20 4) 2019, జులై 14

3. నావిక్‌ వ్యవస్థలోని ఉపగ్రహాల సంఖ్య?
1) 24 2) 6 3) 7 4) 8

4. హైసిస్‌ ఒక......
1) ఉపగ్రహం 2) రాకెట్‌
3) క్రయోజెనిక్‌ ఇంజిన్‌ 4) సంస్థ

5. ఇస్రోకి చెందిన వాతావరణ పరిశోధనా సంస్థ అట్మాస్ఫిరిక్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీని ఎక్కడ స్థాపించారు?
1) బెంగళూరు 2) అహ్మదాబాద్‌
3) శ్రీహరికోట 4) గాదంకి

6. భారత తొలి ఉపగ్రహం?
1) యాపిల్‌ 2) ఇన్‌శాట్‌1ఎ
3) ఆర్యభట్ట 4) రోహిణి

7. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ఎప్పుడు స్థాపించారు?
1) 1969 2) 1968 3) 1970 4) 1967

8. చంద్రయాన్‌-1 చంద్రుడిపై దేని ఆనవాళ్లను గుర్తించింది?
1) గాలి 2) మీథేన్‌ 3) ఆక్సిజన్‌ 4) నీరు

సమాధానాలు
1-4; 2-1; 3-3; 4-1; 5-4; 6-3; 7-1; 8-4


దురిశెట్టి
అనంత రామకృష్ణ
Posted on 23-08-2019