ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > విలేజ్ స‌ర్వేయ‌ర్ (గ్రేడ్ 3) ప్రిపరేషన్‌

సాధిద్దాం... సర్వేయర్‌ కొలువు!

ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 11,158 గ్రామ సర్వేయర్‌ (గ్రేడ్‌-3) ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. సేవాదృకృథంతో పనిచేయాలనుకుంటున్న నిరుద్యోగులకు ఇదో మంచి అవకాశం. నియామక పరీక్షకు కొద్ది వ్యవధి మాత్రమే ఉంది. అభ్యర్ధులు అందుబాటులో ఉన్న సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవటం ముఖ్యం. వివిధ అంశాల పఠనానికి తగిన సమయం కేటాయించుకుని ప్రణాళిక ప్రకారం సన్నద్ధమయితే ఈ పరీక్షలో నెగ్గి కొలువును సాధించవచ్చు!

గ్రామ సర్వేయర్‌ (గ్రేడ్‌-3) రాతపరీక్ష ప్రశ్నపత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది. ఈసెట్‌ స్థాయిలో సిద్ధమయితే ఉపయోగకరం. అభ్యర్థులు ఇప్పటికే ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన షార్ట్‌ నోట్స్‌ తయారు చేసుకొని ఉంటారు. దీన్ని ఉపయోగించుకొని పునశ్చరణ చేయవలసిన సమయమిది. దాంతోపాటు ముఖ్యమైన ఫార్ములాలూ, సంబంధిత మాదిరి ప్రశ్నలూ సాధన చేయాలి.

సన్నద్ధతకు కేటాయించిన సమయంలో 10 శాతం ప్రాథమిక అంశాలకూ, 80 శాతం పరీక్ష కోణంలో ముఖ్యమైన అంశాలకూ, చివరి 10 శాతం సమయం కఠినమైన అంశాలకూ కేటాయించటం సమంజసం. పునశ్చరణతో పాటు ఆన్‌లైన్‌ మాదిరి ప్రశ్నపత్రాలకు జవాబులు రాయడం వల్ల సమగ్ర అవగాహన లేని అంశాలను మెరుగుపరుచుకునే వీలు ఉంటుంది.

పరీక్షా విధానం
రాతపరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైపు) ప్రశ్నలు సమయం మొత్తం మార్కులు
పార్ట్‌-ఎ జనరల్‌ స్టడీస్‌ 50 50 50
పార్ట్‌- బి సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ 100 100 100
మొత్తం 150
* ఇందులో ప్రతి తప్పు సమాధానానికీ 25 శాతం రుణాత్మక మార్కులుంటాయి.

దేన్ని ఎలా చదవాలి?
పార్ట్ - ఎ జనరల్‌ స్టడీస్‌
* ఈ విభాగంలో 50 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు మార్కు చొప్పున 50 మార్కులు. 50 నిమిషాల సమయం ఉంటుంది.
* కరెంట్‌ అఫైర్స్, జాతీయ ప్రాముఖ్యమున్న సంఘటనల విషయానికి వస్తే- చుట్టూ జరుగుతున్న వ్యవహారాలపై, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిణామాలపై అవగాహనను పరీక్షిస్తారు. పట్టు సాధించాలంటే రోజూవారీ సాధన కీలకం. ప్రామాణిక కరెంట్‌ అఫైర్స్‌ మ్యాగజీన్స్, దినపత్రికలు, వార్తా ఛానెల్స్‌ ఉపయోగపడతాయి. క్రీడలు, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, పర్యావరణ జీవవైవిధ్యం, జాతీయ-అంతర్జాతీయ పురస్కారాలు (నోబెల్, ఆస్కార్, భారతరత్న లాంటి అవార్డులు), అంతర్జాతీయ సదస్సులు, వేదికలు వంటివి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
* వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు, సంఘటనలు, జాతీయ ఉద్యానవనాలు, కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల విషయాలు, డిజిటలైజేషన్‌కు సంబంధించిన నూతన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి.
* జనరల్‌ సైన్స్‌ విషయానికొస్తే- నూతన సాంకేతిక విషయాలు మానవ మనుగడను ఎంతవరకు సులభం చేస్తున్నాయనేదానిపై ప్రశ్నలు అడుగుతారు. సమాచారం కోసం అంతర్జాలాన్ని వినియోగించుకోవచ్చు.
* ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, సంస్కృతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. దీనితోపాటు భారతదేశ చరిత్ర, సంస్కృతిపై అవగాహన ఉంచాలి. ముఖ్యమైన పండుగలు, సంప్రదాయాలు, కులవృత్తులు, ప్రజల జీవన విధానం వంటివి ముఖ్యం.
* రాష్ట్ర విభజనకు దారితీసిన పరిస్థితులు, విభజనానంతరం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన చిక్కులు, వివాదాలూ, సమస్యల గురించిన ప్రశ్నలు అడగవచ్చు.
* ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ధి పథకాలు- డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణాలు, వైఎస్‌ఆర్‌ ఆసరా, వైఎస్‌ఆర్‌ గృహ వసతి, వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, జగనన్న అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ చేయూత తదితర పథకాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా నవరత్నాలపై అవగాహన చాలా అవసరం.
పార్ట్‌- బి సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌
* ఇది అభ్యర్థి కోర్‌ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే విభాగం. ఇందులో సిలబస్‌ మూడు విభాగాలుగా (డ్రాయింగ్, సర్వేయింగ్, డీటేయిలింగ్‌) ఉంటుంది.
* ఈ విభాగంలో 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున 100 మార్కులు, 100 నిముషాల సమయం.
* డ్రాయింగ్‌: ఏ గ్రామంలోనైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటపుడు ఆ ప్రాంతంపై అవగాహన ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌ని ఉపయోగించుకొని అందరికీ అర్థమయ్యేలా ఒక మ్యాప్‌ని స్కేలు ఆధారంగా, ఆ ప్రాంత నమూనాను తయారుచేయవచ్చు. ఈ మ్యాప్‌... ఒక ప్రాంత పరిమాణం, ఆకారం వివరించడానికీ, వైవిధ్యాలు, పరిమితులు తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌లో వివిధ రకాల చిహ్నాలు, ఆకారాలు, కోణాలు, గుర్తులు, ప్రామాణిక కొలతలను ఉపయోగిస్తారు. ఈ పరీక్షకు సన్నద్ధమయ్యేవారికి ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌లో పూర్తి విషయ పరిజ్ఞానం ముఖ్యం. వివిధ రకాల డ్రాయింగ్‌ పద్ధతులు, వాటి మధ్య సారూప్యతలు, తేడాలు, ఈ పద్ధతులను ఉపయోగించే విధానం మొదలైనవాటిపై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ఇందులో ఎటువంటి ప్రశ్నలను సాధన చేయాలన్నా ముందుగా ఊహా పరిజ్ఞానాన్ని ఉపయోగించి రఫ్‌ స్కెచ్‌ తయారుచేసుకోవాలి. దానివల్ల ప్రశ్నల సాధన వేగం పెరుగుతుంది తద్వారా పరీక్షలో సమయపాలనా సాధ్యమవుతుంది. (నోట్‌: దిశను సూచించే గుర్తులు (లేబులింగ్‌ ఆరోస్‌), మ్యాప్‌ స్కేలు, లెటరింగ్, నేమింగ్‌ అనేవి డ్రాయింగ్‌కి ఎంతో కీలకం. సాధారణంగా చాలామంది వీటి ప్రాముఖ్యం గుర్తించక పరీక్షలో తప్పిదాలు చేస్తారు.)
* సర్వేయింగ్‌: ఇది సివిల్‌ ఇంజినీరింగ్‌లో కీలకమైన సబ్జెక్టు. ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా మొదటగా భూమి కొలత, ఎత్తుపల్లాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇది సర్వేయింగ్‌ ద్వారానే సాధ్యం. రహదారుల నిర్మాణం చేపట్టాలన్నా, వ్యవసాయ భూముల కొలతలు లెక్కించాలన్నా, కాలువలు నిర్మించాలన్నా సర్వేయింగ్‌ చేపట్టాల్సిందే. సిలబస్‌లో అన్ని విషయాలూ ముఖ్యమైనవిగానే చెప్పవచ్చు. కానీ ఇప్పుడున్న తక్కువ వ్యవధిలో లెవలింగ్, కంపాస్‌ సర్వేయింగ్‌లపై ఎక్కువ దృష్టి అవసరం. మొదటగా సర్వేయింగ్‌పై ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకొని, అందులో సిలబస్‌ ప్రకారంగా థియరీని అధ్యయనం చేయాలి. చిన్న చిన్న ఫార్ములాలతో రాబట్టగల ప్రశ్నలను సాధన చేయాలి. ప్రాథమిక అంశాలపై దృష్టి సారించడం మరవొద్దు. ముఖ్యమైన ఫార్ములాలను విడిగా రాసుకోవడం, షార్ట్‌ నోట్స్‌ తయారుచేసుకోవటం వల్ల రివిజన్‌ వేగంగా పూర్తవుతుంది.
* బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డీటేయిలింగ్‌: కట్టడం పునాది నుంచి కాలమ్‌లు, బీమ్‌లు, స్లాబులు, ఫ్లోరింగ్, ఆర్చీలు, స్టెయిర్‌కేస్, గోడలు, పైకప్పు, తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు, లిఫ్టులు మొదలైనవాటిపై అభ్యర్ధి సమగ్ర అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. వివిధ రకాల రహదారులు, రైల్వే లైన్లు, నీటి పారుదల నిర్మాణాలు, పైపు లైన్లు, డ్రైనేజీలు, శానిటరీ ఫిట్టింగులు, రివిటెడ్‌ జాయింట్లు, స్టీల్‌ సెక్షన్లు తదితర నిర్మాణాల డీటెయిల్డ్‌ డ్రాయింగ్స్‌పై ప్రశ్నలు ఇస్తారు. ముఖ్యంగా రిక్రియేషన్‌ భవనాలు (థియేటర్లు, టౌన్‌ హాళ్లు, క్లబ్బులు, హోటళ్లు), నివాస భవంతులు (బంగళాలు, అపార్ట్‌మెంట్‌లు, వరుస ఇళ్ళు), రవాణా భవనాలు (బస్‌స్టాండులు, రైల్వే స్టేషన్‌లు, ఎయిర్‌పోర్టులు), సంస్థాగత భవనాలు (ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు, ల్యాబరేటరీలు, జైళ్ళు, హాస్పిటళ్లు) నిర్మాణాలపై అభ్యర్థులు దృష్టి సారించాలి. ఈ సబ్జెక్టు నుంచి పూర్తి థియరీ ప్రశ్నలే రావచ్చు. ఈ దిశలో సాధన చేస్తే సమాధానాలను గుర్తించే వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. చివరగా అభ్యర్థులు ముఖ్యమైన అంశాలైన మ్యాసనరీ, రూఫ్‌లు, వివిధ నిర్మాణాల క్రాస్‌ సెక్షన్లపై దృష్టి సారించడం మంచిది.

ప్రామాణిక పుస్తకాలు
* ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌- 1) ఎన్‌.డి. భట్‌ 2) కె.ఎల్‌. నారాయణ
* ఇంజినీరింగ్‌ సర్వేయింగ్‌- 2) బి.సి. పున్‌మియా 2) ఎస్‌. మెహబూబ్‌ బాషా
* బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డీటేయిలింగ్‌- రంగ్‌వాలా
* డ్రాఫ్స్‌మెన్‌ సివిల్ - ఆర్‌.ఎస్‌. మల్లిక్‌ అండ్‌ జి.ఎస్‌.మియో

జనరల్‌ స్టడీస్‌ నమూనా ప్రశ్నలు
1. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకీ సంవత్సరానికి ఎన్ని రూపాయిలు ఇవ్వనున్నారు?
ఎ) రూ.12500 బి) రూ.25000 సి) రూ.30000 డి) రూ.40000
జవాబు:

2. ‘అమ్మఒడి పథకం’కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
ఎ) పాఠశాలకు పంపించే ప్రతి విద్యార్థి తల్లికీ సంవత్సరానికి రూ.15000 భృతి ఇవ్వనున్నారు.
బి) పాఠశాలకు పంపించే ప్రతి విద్యార్థి తల్లికీ సంవత్సరానికి రూ.25000 భృతి ఇవ్వనున్నారు.
సి) పాఠశాలకు పంపించే ప్రతి విద్యార్ధి తల్లికీ సంవత్సరానికి రూ.20000 భృతి ఇవ్వనున్నారు.
డి) పాఠశాలకు పంపించే ప్రతి విద్యార్ధి తల్లికీ సంవత్సరానికి రూ.30000 భృతి ఇవ్వనున్నారు.
జవాబు:

3. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నియమించిన నూతన గవర్నర్‌ ఎవరు?
ఎ) బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బి) ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌
సి) భన్వరీలాల్‌ పురోహిత్‌ డి) పలానిస్వామి సదాశివం
జవాబు:

4. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏ పథకంపై మొట్టమొదటి సంతకం చేశారు?
ఎ) ఎన్‌టీఆర్‌ క్యాంటీన్‌ బి) నవరత్నాలు పథకం
సి) పెళ్లికానుక పథకం డి) బడికి వస్తా పథకం
జవాబు: బి

5. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన క్యాబినెట్‌లో ఎంతమందికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జవాబు: డి


వై.వి.గోపాలకృష్ణమూర్తి
Posted on 21-08-2019