close

తాజా స‌మాచారం

విభజన కాలేదు.. పాఠ్యాంశాలు రాలేదు

* ఏపీలో తెలుగు అకాడమీ ఏర్పాటుపై కనిపించని కదలిక
* ప్రామాణిక మెటీరియల్‌కు నిరుద్యోగుల ఎదురుచూపు
* ఊరిస్తున్న అవకాశాలు.. ఉసూరుమనిపిస్తున్న పుస్తకాల కొరత
* వరస నియామక ప్రకటనలతో ఉక్కిరిబిక్కిరి

ఈనాడు - అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు అకాడమీ నుంచి వెలువడే పాఠ్యాంశాలు (స్టడీ మెటీరియల్‌) అందుబాటులో లేకపోవడంపై రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3, ఇంజినీరింగ్‌, ఇతర ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి ఇటీవల ప్రకటనలు వెలువడ్డాయి. భూ పరిపాలన శాఖలో 600కుపైగా ఉన్న ‘జూనియర్‌ అసిస్టెంట్‌-కం-కంప్యూటర్‌ అసిస్టెంట్‌’ ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలో ప్రకటన రాబోతుంది. స్వల్ప వ్యవధిలోనే వేర్వేరు ప్రకటనలు రావడం, దగ్గర దగ్గరలోనే రాత పరీక్షలు ఉండడంవల్ల ఎంపిక చేసుకున్న వాటికి మాత్రమే దరఖాస్తు చేయాల్సి వస్తోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నియామక ప్రకటనలకు దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి దారితీసిన కారణాల్లో ఇదొకటిగా పేర్కొంటున్నారు. 2016 నుంచి ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో వచ్చే ప్రశ్నల సరళి మారింది. దీనికి అనుగుణంగా లోతైన అవగాహనతో అభ్యర్థులు సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రకటించిన పోస్టుల సంఖ్యను అనుసరించి గతంలో కంటే తక్కువగానే అభ్యర్థులను ప్రిలిమ్స్‌ నుంచి ప్రధాన పరీక్షలకు ఎంపిక చేస్తామని కమిషన్‌ ప్రకటించడంతో అభ్యర్థులు మరింత కలవరపడుతున్నారు. గ్రూపు-1 ప్రిలిమినరీ పేపరు - 2లోని మానసిక సామర్థ్యాలకు (సైకాలజికల్‌ అబిలీటిస్‌కు) సంబంధించిన పుస్తకాలు తెలుగులో దొరకడంలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలకు తగ్గట్లు ప్రామాణిక పుస్తకాలు లేకపోవడం మరింత ఇబ్బందికరంగా మారుతోందని వాపోతున్నారు.
ఇదే ప్రామాణికం
ఏపీపీఎస్సీ ఖరారు చేసిన ఉద్యోగ నియామకాల ప్రణాళికకు తగినట్లు ‘స్టడీ మెటీరియల్‌’ తయారు చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు అకాడమీ కీలకం. ఈ సంస్థ తరఫున ప్రత్యేకంగా సంపాదక మండళ్లు ఉన్నాయి. ఆయా పాఠ్యాంశాల్లో నిపుణులతో కమిటీలు ఏర్పాటుచేసి, అధ్యయన సామగ్రిని తయారుచేస్తోంది. ప్రతి పేజీకి 30 పైసల వంతున వంద పేజీలు ఉంటే రూ.30కి విక్రయిస్తోంది. అభ్యర్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా స్టడీ మెటీరియల్‌ను తెలుగు అకాడమీ రూపొందిస్తూ వస్తోంది. రాత పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఏమైనా తప్పులు దొర్లితే తెలుగు అకాడమీ మెటీరియల్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఒక్క మార్కు వ్యత్యాసంలోనూ అభ్యర్థుల భవితవ్యం మారిపోయే పరిస్థితుల్లో ఇలాంటి ప్రామాణిక పుస్తకాలు లేకపోవడం అభ్యర్థులను హైరానాకు గురిచేస్తోంది. లాభసాటిగా ఉంటేనే ప్రైవేట్‌ సంస్థల వారు పుస్తకాలను మార్కెట్లోకి తెస్తున్నారు. తెలుగు పుస్తకాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న అభిప్రాయం నిరుద్యోగుల్లో ఉంది. విభజన చట్టం 10వ షెడ్యూలులో అకాడమీ ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అకాడమీ ఏర్పాటు కాలేదు. దీనినెవరూ పట్టించుకోవడం లేదు. సరైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారడంతోపాటు ఆర్థికంగానూ అభ్యర్థులపై భారాన్ని పెంచుతోంది.
ప్రభుత్వం దృష్టిపెట్టాలి
‘స్వల్ప వ్యవధిలో ఉద్యోగ ప్రకటనలు రావడంతో పరీక్షల తేదీల మధ్య వ్యవధిని అంచనా వేసుకుంటూ అభ్యర్థులు సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర విభజనకు ముందున్న సమాచారం 23 జిల్లాలతో ఉంది. విభజన తరువాత చోటుచేసుకున్న పరిణామాలపై తెలుగులో పుస్తకాలు తక్కువగా అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శ్వేతపత్రాలు, జిల్లా, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రభుత్వం చేసిన ప్రకటనలపై సమాచారం దొరకడం కష్టంగా మారింది. వీటినుంచే రాత పరీక్షల్లో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.’
- లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ, పోటీ రంగ నిపుణుడు

Posted on 20.02.2019