close

తాజా స‌మాచారం

తెలుగు లేదా ఆంగ్లంలోనే ప్రశ్నలు!

ఈనాడు, అమరావతి: ఉద్యోగ నియామకాల ప్రధాన రాత పరీక్ష (మెయిన్స్‌)ల్లో అభ్యర్థులు కోరిన మేరకు తెలుగు లేదా ఆంగ్లంలోనే ప్రశ్నలు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో జరిగే పరీక్షలకే దీనిని వర్తింపజేయాలని ఫిబ్ర‌వ‌రి 20న‌ జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. వ్యాసరూపంలో జరిగే గ్రూపు-1 ప్రధాన పరీక్షలకు ఇందులో మినహాయింపు ఉంటుందన్నారు. ఇంజినీరింగ్‌, వైద్య, ఇతర శాఖల ఉద్యోగాలకు డిగ్రీని ఆంగ్లంలో పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులని, వారికి ఏ పేపరులోనైనా ఆంగ్లంలోనే ప్రశ్నలు ఇస్తామన్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో కోర్సులు లభ్యమయ్యే ఇతర డిగ్రీలు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రధాన పరీక్షల్లో ప్రశ్నలను ఆంగ్లం, తెలుగుల్లో ఏదో ఒక భాషలోనే ఇస్తామన్నారు. ఆన్‌లైన్‌లో జరిపే ఈ పరీక్షలకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేస్తామని పేర్కొన్నారు. భూ పరిపాలనశాఖలో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ - కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి ప్రకటనను ఒకట్రెండు రోజుల్లో ఇస్తామని తెలిపారు.

Posted on 21.02.2019