close

తాజా స‌మాచారం

ఇక తాజా రిజర్వేషన్లతో ఉద్యోగాలు!

* నియామకాల్లో ఆ మేరకు మార్పులు
* ప్రకటనల జారీపై సందిగ్ధం
* ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం: ఎపీపీఎస్సీ

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కాపులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌ కల్పించడానికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నుంచి వెలువడాల్సిన నోటిఫికేషన్లలో జాప్యం అనివార్యంగా కనిపిస్తోంది. భూ పరిపాలన శాఖకు చెందిన జూనియర్‌ అసిస్టెంట్‌-కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు 670 వరకు ఖాళీగా ఉన్నాయి. గత సెప్టెంబరులో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాల భర్తీ జాబితాలో ఈ పోస్టుల వివరాలున్నాయి. తదుపరి సమాచారం రానందున వీటి భర్తీకి కమిషన్‌ నుంచి ప్రకటన వెలువడలేదు. సంప్రదింపుల అనంతరం వివరాలు రావడంతో కమిషన్‌ నోటిఫికేషన్‌ వెలువరించేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో కాపులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్‌ కల్పించడంపై చట్టబద్ధత వచ్చినందున ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటన ఇచ్చేందుకు సమయం పడుతుందని కమిషన్‌ అధ్యక్షుడు ఆచార్య ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. రిజర్వేషన్‌ వర్గాల వారీగా పోస్టుల గుర్తింపులో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండవచ్చునని, ఈ విషయమై ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రభావం అసిస్టెంట్‌ ఇంజినీర్‌, ఇతర ఉద్యోగ ప్రకటనల జారీపైనా కనిపిస్తోంది. మరోవంక గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి వేర్వేరుగా రెండు ప్రకటనలు (లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌) ఫిబ్ర‌వ‌రి 21న‌ వెలువడ్డాయి. వీటికి తాజా 10% రిజర్వేషన్‌ అవరోధం కాదని కమిషన్‌ వర్గాలు వివరించాయి.
* టెక్నికల్‌ అసిస్టెంట్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌, వెల్ఫేర్‌ ఆర్గనైజర్‌ (ఏపీ సైనిక్‌ వెల్ఫేర్‌) సహా 21 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి ప్రకటన వెలువడింది. దరఖాస్తులను మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 17 వరకు స్వీకరిస్తారు. పరీక్ష తేదీ తరువాత ప్రకటిస్తారు.
* గెజిటెడ్‌ కేటగిరిలో సహాయ బీసీ సంక్షేమాధికారి, సహాయ సాంఘిక సంక్షేమ శాఖాధికారి, గిరిజన సంక్షేమాధికారి, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (ఏపీ ఇన్స్యూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) తదితర 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తులను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 16 వరకు స్వీకరిస్తారు. ఆఫ్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్‌ తేదీని తరువాత ప్రకటిస్తారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఆంగ్లంలోనే పరీక్షలపై పునఃపరిశీలనకు అభ్యర్థన
ఆంగ్ల నేపథ్యంతో డిగ్రీ పూర్తిచేసిన వారికి పరీక్షలను తెలుగులో కాకుండా కేవలం ఆంగ్లంలో నిర్వహిస్తామని ప్రకటించడాన్ని పునఃపరిశీలించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Posted on 22.02.2019