close

తాజా స‌మాచారం

600 కేంద్రాల్లో గ్రూపు-2 పరీక్ష

* తగిన సౌకర్యాలుంటేనే ఎంపిక
* పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేలా చర్యలు
* ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడి

ఈనాడు, అమరావతి: మే 5న జరగనున్న గ్రూపు-2 ప్రాథమిక పరీక్ష సందర్భంగా పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు సులభంగా గుర్తించేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చర్యలు తీసుకుంటోంది. గత ఆదివారం పంచాయతీ కార్యదర్శుల పరీక్ష జరగ్గా అభ్యర్థులు ఇబ్బందుల పాలైన నేపథ్యంలో ఈ సారి జాగ్రత్త పడుతోంది. గ్రూపు-2 పరీక్షకు 2.95 లక్షల మంది దరఖాస్తు చేయగా 600 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనుంది. అభ్యర్థుల సంఖ్యకు తగినట్లు పరీక్షా కేంద్రాల్లో తగిన బల్లలు, కుర్చీలున్నాయా? లేవా? ఇతర సౌకర్యాలెలా ఉన్నాయన్న అంశాలపై జిల్లాల నుంచి సమాచారాన్ని కమిషన్ కోరింది. అన్ని కోణాల నుంచి పరిశీలన జరిపాకే కేంద్రాలను ఎంపిక చేస్తామని కమిషన్ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. అవసరమైతే కమిషన్ నుంచి సీనియర్ అధికారులను కేంద్రాల సందర్శనకు పంపిస్తామని వివరించారు.
పరీక్ష కేంద్రాలకు జియో ట్యాగింగ్
విశాఖ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్షా కేంద్రం చిరునామాలో అస్పష్టత నెలకొనడంతో పలువురు అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. హాల్టికెట్లలో మండల కేంద్రం, ఇతర పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు కార్యదర్శి మౌర్య వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు జియో ట్యాగింగ్ చేసి అభ్యర్థులకు సమాచారాన్ని అందించాలని చూస్తున్నామని చెప్పారు. గ్రూపు-2 పరీక్ష సమయానికి ఇది కుదరకుంటే భవిష్యత్తులో జరగబోయే పరీక్షలకు అమలు చేస్తామని తెలిపారు.
3 లేదా 4 వారాల్లో ఫలితాలు....
గత ఆదివారం జరిగిన పంచాయతీ కార్యదర్శుల నియామక రాత పరీక్షా ఫలితాలను 3 లేదా 4 వారాల్లో వెల్లడిస్తామని కమిషన్ కార్యదర్శి తెలిపారు. ప్రాథమిక ‘కీ'ని గురువారం విడుదల చేస్తామని వివరించారు. ప్రశ్నపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో దొర్లిన తప్పులపై అభ్యర్థుల ఆందోళన గురించి ప్రస్తావించగా.. ఆంగ్ల ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకుంటామని ముందుగానే ప్రకటించినట్లు వెల్లడించారు.

Posted on 25.04.2019