close

తాజా స‌మాచారం

సగానికి పైగా సంబంధం లేని ప్రశ్నలే!

* ఎ.ఎస్‌.డబ్ల్యు.ఒ. పరీక్ష తీరుతో అభ్యర్థుల గగ్గోలు
ఈనాడు, విశాఖపట్నం: సాంఘిక సంక్షేమ సహాయ అధికారుల (అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌/ఎ.ఎస్‌.డబ్ల్యు.ఒ.) పోస్టులకు ఏపీపీఎస్సీ ఆగ‌స్టు 11న‌ నిర్వహించిన పోటీపరీక్షలో 150 ప్రశ్నలకు 80కిపైగా సిలబస్‌తో సంబంధం లేనివి రావడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి 75 మార్కులు, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, భారత రాజ్యాంగం, సంక్షేమ పథకాలకు సంబంధించి 75 మార్కులు ఉంటాయని ఫిబ్రవరిలో జారీచేసిన ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి 25వేల మందిలోపు రాసే పోటీ పరీక్షలకు ప్రిలిమినరీ ఉండదని తొలుత ప్రకటించారు. ఉన్నవి తొమ్మిది పోస్టులే కావడంతో 3,800 మందే దరఖాస్తు చేసినట్లు ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. అభ్యర్థుల సంఖ్య 25వేల కంటే చాలా తక్కువగా ఉండడంతో ప్రిలిమినరీ ఉండదని, నేరుగా ప్రధాన పరీక్షలు (మెయిన్స్‌) నిర్వహిస్తారని భావించారు. తదనుగుణంగానే పలువురు సాధన చేశారు. అందుకు భిన్నంగా ప్రిలిమినరీ పరీక్షల తేదీలను జూన్‌లో ప్రకటించారు. ఆ ప్రకారం అభ్యర్థులు సాధన చేశారు. తీరా పరీక్షలో ప్రశ్నపత్రాన్ని చూశాక ఆవేదనకు గురయ్యారు. అత్యధిక ప్రశ్నలు సిలబస్‌తో సంబంధం లేకుండా వచ్చాయి. మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం, గణితశాస్త్రం, ఎడ్యుకేషనల్‌ ట్రెండ్స్‌(విద్యా దృక్పథాలు)లకు సంబంధించిన ప్రశ్నలు అత్యధికంగా రావడంతో అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తాం....
ఫలితాలు ప్రకటించే ముందు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలిపే అవకాశం అభ్యర్థులకు ఇస్తాం. వారు ఏ ప్రశ్న ఏ శాస్త్రానికి సంబంధించిందో వివరాలతో జాబితా ఇస్తే నిపుణులతో అధ్యయనం చేయిస్తాం. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు వాస్తవమేనని తేలితే తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. సిలబస్‌తో సంబంధం లేని ప్రశ్నలు వచ్చాయా? లేదా? అన్న విషయాన్ని నిపుణులే నిర్థరిస్తారు.
- ఉదయభాస్కర్, అధ్యక్షుడు, ఏపీపీఎస్సీ.

Posted on 15.07.2019